దేశానికి మరో ఉపద్రవం.. పెరుగుతున్న టొమాటో ఫ్లూ కేసులు

Sun May 29 2022 07:00:01 GMT+0530 (IST)

Another disaster for the country Rising tomato flu cases

ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా బాధల నుంచి ఇప్పుడిప్పుడే జనం కోలుకుంటున్నారు. కానీ అంతలోనే మరో మహమ్మారి ముంచుకొస్తోంది. దేశంలోని తమిళనాడులో మొదలైన టొమాటో ఫ్లూ చాపకింద నీరులా విస్తరిస్తోంది. ఇప్పటివరకు బాధిత రాష్ట్రం తమిళనాడు మాత్రమే అనుకుంటున్న తరుణంలో ఇప్పుడు ఆ లిస్టులో ఒడిశా చేరింది. ఈ రాష్ట్రంలో టొమాటో ఫ్లూ కేసులు రోజురోజుకు అధికమవుతున్నాయి.కొన్ని రోజులుగా ఇక్కడ కేసులు పెరుగుతున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలుపుతోంది. డబ్ల్యూహెచ్ వో ప్రకారం ఐదు సంవత్సరాల కంటే తక్కు వయసున్న వారిలో టొమాటో ఫ్లూ పెరుగుతోందని తెలిపింది. అయితే కరోనా అంత ప్రమాదకరంగా కాకపోయినా పిల్లల రోగనిరోధక శక్తిపై మాత్రం జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.

టొమాటో ఫ్లూ ఒకరి నుంచి మరొకరికి వేగంగా వ్యాపిస్తుంది. చిన్నపిల్లలు దగ్గరగా ఉన్నవాళ్లకి తొందరగా అంటుతుంది. చికెన్ ఫాక్స్ స్మాల్ పాక్స్ లాగే ఉన్నా ఇది ప్రత్యేక మైన వ్యాధి. న్యూఢిల్లీలోని ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లోని పీడియాట్రిక్స్ అండ్ ప్రివెన్షన్ విభాగానికి చెందిన డాక్టర్ అమోల్ కుమార్ లోకాడే టొమాటో ఫ్లూ గురించి వివరించారు. ఈ వైరస్ ఎలా సొకుతుంతో తెలియడం లేదన్నారు.

కానీ వచ్చిన వారి పట్ల జాగ్రత్తగా ఉండాలన్నారు. ఎందుకంటే ఇది ఐదు సంవత్సరాల లోపు వయసున్న వారిలో ఎక్కువగా వ్యాపిస్తుందని తెలిపారు. కానీ ఫ్లూ సోకిన వెంటనే భయపడాల్సిన అవసరం లేదని అయితే జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు.

తమిళనాడు రాష్ట్రంలో వెలుగుచూసిన ఈ కేసులు ఇప్పుడు ఒడిశాలో పెరుగుతున్నాయి. ఆ తరువాత దేశ వ్యాప్తంగా విస్తరించే అవకాశం ఉందని అంటున్నారు. ముఖ్యంగా రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న పిల్లల పట్ల జాగ్రత్తగా ఉండాలంటున్నారు. ఒకవేళ వారికి ఎలంటి డిసీస్ కనిపించినా వెంటనే వైద్యులను సంప్రదించాలని చెబుతున్నారు. జ్వరంతో బాధపడుతుంటే సొంతంగా మందులు వాడకుండా వైద్యులను సంప్రదించాలంటున్నారు. మరోవైపు చిన్నారులకు మాత్రమే వచ్చే ఈ ఫ్లూ పై వైద్య పరిశోధనలు జరుగుతున్నాయి. జ్వరపీడితులు ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నారు.

టోమొటో ఫ్లూ వచ్చిందని తెలియనడాకి ముందుగా జ్వరం వస్తుంది. ఆ తరువాత కడుపునొప్పి వాంతులు విరేచనాలు డీ హైడ్రేషన్ ఏర్పడుతుందని డాక్టర్ అమోల్ కుమార్ తెలుపుతున్నారు. ఈ రకమైన లక్షణాలున్న పిల్లలను వేరుగా ఉంచడం మంచిదంటున్నారు. మూడు నుంచి ఐదు రోజుల వరకు జ్వరం కొనసాగితే టొమాటో ఫ్లూ కోసం పరీక్ష చేయించుకోవాలంటున్నారు.

శరీరంపై ఎరుపు రంగు దద్దుర్లు కనిపిస్తే టోమాటో ఫ్లూ గుర్తించాలని అంటున్నారు. వీటిలో ద్రవం ఉంటుందని వాటిని ముట్టుకోవడం ద్వారా ఇతరులకు సోకే ప్రమాదం ఉందని అంటున్నారు. ఇవి పిల్లల శరీరంపై ఏడు నుంచి 14 రోజుల పాటు ఉంటాయని ఆ సమయంలో పిల్లలకు కడుపునొప్పి వాంతులు విరేచనాలు ఉంటాయని వైద్యుడు తెలిపారు.