మరో వివాదం.. శివలింగానికి తాడా: సోము వీర్రాజు ఫైర్!

Mon Sep 26 2022 13:08:33 GMT+0530 (India Standard Time)

Another controversy.. Somu Veerraju fires at

ఇప్పటికే వైఎస్ జగన్ ప్రభుత్వం వచ్చాక హిందూ దేవాలయాలకు రక్షణ లేదని ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి. అంతర్వేదిలో లక్ష్మీనరసింహస్వామి రథం తగలబడటం తిరుమల శ్రీశైలంలో అన్యమత ప్రచారం అన్యమత ఉద్యోగులు పనిచేస్తుండటం రామతీర్థంలో విగ్రహాల మాయం వంటి ఘటనలపై ప్రతిపక్ష పార్టీలు పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించిన సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో మరో వివాదం రేగింది. తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలుకు ఘనచరిత్ర ఉంది. తూర్పు చాళుక్యల కాలం బిక్కవోలు ప్రముఖ పుణ్యక్షేత్రంగా ఉంది. ఇక్కడ పురాతనమైన గోలింగేశ్వర స్వామి ఆలయం ఉంది.

కాగా బిక్కవోలులో వైఎస్సార్ చేయూత వారోత్సవాలు తాజాగా నిర్వహించారు. ఇందుకోసం టెంటు వేసిన వైఎస్సార్సీపీ నేతలు ఆ తాళ్లను గుడిలో ఉన్న శివలింగానికి కట్టేయడం తీవ్ర వివాదాస్పదమవుతోంది. దీనిపై హిందూ సంస్థలు బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ట్వీట్ చేశారు. జగన్ ప్రభుత్వ వైఖరిని దునుమాడారు. బిక్కవోలు ఘటనకు సంబంధించి సోము వీర్రాజు ఒక వీడియోను సైతం పోస్టు చేశారు.

హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా ప్రవర్తించారని సోము వీర్రాజు ధ్వజమెత్తారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సంబంధిత వ్యక్తులపై పోలీసులు వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్రంలో హిందూ వ్యతిరేక చర్యలకు వత్తాసు పలికే ప్రభుత్వానికి అధికారులు తలొగ్గకుండా దోషులను శిక్షించాలని కోరారు.

మరోవైపు టెంట్ తాళ్లను శివలింగానికి కట్టిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. నిర్వాహకులపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శివలింగానికి కట్టిన టెంట్ తాళ్లను వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు.

మరోవైపు బిక్కవోలు ఘటనపై టీడీపీ కూడా మండిపడింది. వీరి పాపం పండే రోజు త్వరలోనే వస్తుంని హెచ్చరించింది. శివలింగానికి తాళ్లు కట్టడం మంచి పద్ధతి కాదని దుయ్యబట్టింది. మరోవైపు హిందూ సంఘాలు ఆర్ఎస్ఎస్ హిందూ వాహిని భజరంగదళ్ వంటి సంస్థలు బిక్కవోలు ఘటనపై మండిపడ్డాయి.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.