Begin typing your search above and press return to search.

నారా లోకేష్‌ పై మరో కేసు!

By:  Tupaki Desk   |   7 Feb 2023 1:00 PM GMT
నారా లోకేష్‌ పై మరో కేసు!
X
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ చేపట్టిన యువగళం పాదయాత్ర కొనసాగుతుంది. జనవరి 27 చేపట్టిన యాత్ర 12 రోజుకు చేరుకుంది. మొత్తం 4 వేల కిలోమీటర్ల మేర 400 రోజులపాటు ఆయన పాదయాత్ర చేయనున్న సంగతి తెలిసిందే.

ప్రస్తుతం లోకేష్‌ పాదయాత్ర చిత్తూరు జిల్లాలో కొనసాగుతోంది. పూతలపట్టు నియోజకవర్గంలో పాదయాత్రను ముగించిన లోకేష్‌ ప్రస్తుతం చిత్తూరు నగరంలో పాదయాత్ర చేస్తున్నారు. ఫిబ్రవరి 7న 12 వ రోజు కూడా చిత్తూరులోనే ఆయన పాదయాత్ర చేయనున్నారు.

కాగా ఫిబ్రవరి 6 నాటికి లోకేష్‌ పాదయాత్ర ప్రారంభించి 11 రోజులు అయ్యింది. ఈ 11 రోజుల్లో ఆయన 139 కిలోమీటర్ల మేర నడిచారు. రోజుకు సరాసరిగా పది కిలోమీటర్లు మేర నడుస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయనపై పోలీసులు అప్పుడే నాలుగు కేసులు నమోదు చేశారు.

కొద్ది రోజుల క్రితం బంగారుపాళ్యంలో లోకేష్‌ ప్రచార రథంపై ఉండి మాట్లాడటానికి పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో లోకేష్‌ అక్కడే సెంటర్‌ లో ఉన్న మిద్దెపైన ఉండి మాట్లాడారు. దీంతో పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. పలువురి నేతలపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. నాన్‌ బెయిలబుల్‌ సెక్షన్ల కింద కేసులు పెట్టారు.

పోలీసుల విధులను అడ్డుకున్నందుకు, నిబంధనలు పాటించినందుకు లోకేష్‌ తోపాటు ఆరుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

లోకేష్‌ పాదయాత్ర నిబంధనలు ఉల్లంఘించారని పలమనేరు సీఐ అశోక్‌ చేసిన ఫిర్యాదుతో బంగారుపాళ్యం ఎస్‌ఐ మల్లికార్జునరెడ్డి కేసు నమోదు చేశారు. 355, 290, 180, 341 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.

కాగా పాదయాత్ర ప్రారంభమైన జనవరి 27న కుప్పంలో నిబంధనలు ఉల్లంఘించారని, పోలీసులను అసభ్యంగా దూషించారని తొలి రోజే పోలీసులు లోకేష్‌ పై కేసు నమోదు చేశారు. ఇదే క్రమంలో ఫిబ్రవరి 3న బంగారుపాళ్యంలో మరో రెండు ఎఫ్‌ఐఆర్‌ లు నమోదు చేశారు. ఇందులో ఒక ఎఫ్‌ఐఆర్‌ లో ఏకంగా హత్యాయత్నం కింద పలు సెక్షన్లు పెట్టడం గమనార్హం. అలాగే ఫిబ్రవరి 4న పలమనేరులోనూ లోకేష్‌ పై మరో ఎఫ్‌ఐఆర్‌ నమోదు అయింది. ఈ కేసులన్నీ పోలీసులే పెట్టడం మరో విశేషం.

కాగా ఇప్పటివరకు మొత్తం మీద తనపై పోలీసులు 16 కేసులు నమోదు చేశారని నారా లోకేష్‌ పోలీసులపై మండిపడ్డారు. యువగళం అంటే నీకెందుకంత భయం జగన్‌ అని నిలదీశారు. ఖాకీలను అడ్డుపెట్టుకుని పాదయాత్ర, బహిరంగ సభలను అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. మధ్యలో పోలీసులు ఎందుకు నేరుగా నువ్వే రా అని సవాల్‌ విసిరారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా పాదయాత్ర ఆగదన్నారు. పవన్‌ కల్యాణ్‌ వారాహీ కూడా ఆగదని.. అడ్డొస్తే తొక్కుకుంటూ వెళతామని లోకేశ్‌ హెచ్చరించారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.