Begin typing your search above and press return to search.

మరో గుబులు.. మంకీ పాక్స్.. భయపడాల్సిన అవసరం ఉందా?

By:  Tupaki Desk   |   15 Jun 2021 1:30 PM GMT
మరో గుబులు.. మంకీ పాక్స్.. భయపడాల్సిన అవసరం ఉందా?
X
కరోనా దెబ్బతో.. వైరస్ అన్నా.. కొత్త రోగమన్నా విపరీతమైన అటెన్షన్ తో పాటు.. మనకొచ్చే అవకాశాలు ఎంతన్నది లెక్కలేసుకునే పరిస్థితి. ఊ.. అంటేనే ఉలిక్కిపడే పరిస్థితి ఇప్పుడు నెలకొంది. కొన్నింటి విషయాలతో మనకు సంబంధం లేకున్నా.. సోషల్ మీడియా.. వాట్సాప్ పుణ్యమా అని ప్రతిది మన వద్దకు వచ్చి ఆగే పరిస్థితి. తాజాగా మంకీపాక్స్ గురించిన గుబులు ఎక్కువైంది. యూకేలో రెండు మంకీ పాక్స్ కేసులు తాజాగా నమోదయ్యాయి.

అయితే.. ఈ రెండు కేసులు కూడా ఒకే ఇంటికి సంబంధించిన వారే కావటం గమనార్హం. ఈ వైరస్ బారిన పడిన వారు గడిచిన 21 రోజులుగా విదేశాలకు వెళ్లి వచ్చిన చరిత్ర లేదు. బయటకు వెళ్లింది లేదు. దీంతో ఈ వైరస్ ఎలా సోకిందన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. చాలా సులువుగా ఇతరులకు సోకే అవకాశం ఉన్న ఈ వైరస్ కు చెక్ పెట్టేందుకు వీలుగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇంతకీ మంకీ పాక్స్ అంటే మరేదో కాదు.. స్మాల్ పాక్స్ అని.. అమ్మవారు సోకిందని అనుకుంటాం చూశారా? అదే. దాని కుటుంబానికి చెందినదే ఈ మంకీ పాక్స్.

సాధారణంగా మధ్య..పశ్చిమ ఆఫ్రికాలో ఈ వైరస్ కనిపిస్తూ ఉంటుంది. దీని బారిన పడిన వారు తమ్మునా.. దగ్గినా కూడా వాటి తుంపర్ల కారణంగా ఇతరులకు సోకే ప్రమాదం ఉంది. అయితే.. దీని బారిన పడినోళ్లు ఆరు రోజుల నుంచి పదమూడు రోజుల వరకు కోలుకుంటారు. కొంతమందికి మాత్రం ఐదు రోజుల నుంచి 21 రోజుల వరకు ఉంటుంది. దీన్ని ఎలా గుర్తించాలంటే.. చర్మం మీద కురుపులు కనిపిస్తాయి. నొప్పి ఉంటుంది. బాగా దురద ఉంటుంది. తక్కువ మోతాదులో ఉంటే గుర్తించలేం కానీ.. ఎక్కువ మోతాదులో ఉంటే మాత్రం గుర్తించొచ్చు.

యూకే చరిత్రలో ఇప్పటివరకు ఆరు కేసులు మాత్రమే నమోదయ్యాయి. అందులో తాజాగా నమోదైనవి రెండు కూడా కలిపారు. ఇంత అరుదుగా కేసులు నమోదవుతాయి కాబట్టే.. ఇప్పుడింత ఆదుర్దాకు గురవుతున్నారు. వీటికి మందులు ఉన్నాయి. వ్యాక్సిన్ కూడా ఉంది కానీ.. చాలా తక్కువగా ఉపయోగిస్తారు. రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉన్న వారికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. తక్కువగా ఉండేవారు దీని బారిన పడే వీలుంది. మన దగ్గర ఇది సోకే అవకాశాలు తక్కువని చెబుతున్నారు.