Begin typing your search above and press return to search.

విజయవాడ లో మరో గ్యాంగ్ వార్!

By:  Tupaki Desk   |   11 Aug 2020 6:00 AM GMT
విజయవాడ లో మరో గ్యాంగ్ వార్!
X
విజయవాడ లో గత కొన్ని రోజుల కింద సందీప్-కేటీఎం పండు మధ్య జరిగిన గ్యాంగ్ వార్ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆ గ్యాంగ్ వార్ ఘటన ఇంకా పూర్తిగా మరిచిపోకముందే , తాజాగా బెజవాడలో మరో గ్యాంగ్ వార్ చోటు చేసుకుంది. షేక్ నాగుల్ మీరా అలియాస్ మున్నా,రాహుల్‌ కి చెందిన ఇరు వర్గాలు పరస్పర దాడులకి దిగాయి. కత్తులు, కర్రలు, మారణాయుధాలతో ఒకరిపై ఒకరు దాడులకు దిగారు. ఈ విషయం పోలీసులకి తెలియడంతో రెండు వర్గాలకు చెందిన పలువురిని అరెస్ట్ చేశారు.

ఈ గ్యాంగ్ వార్ పై పూర్తి వివరాల్లోకి వెళ్తే .. విజయవాడలోని కేదారేశ్వరపేట ఖుద్దూస్ నగర్‌ కి షేక్ నాగుల్ మీరా,రాహుల్ అనే యువకులు కొద్దిరోజులుగా గ్యాంగ్ మెయింటైన్ చేస్తు వస్తున్నారు. వీరిద్దరి మధ్య గతంలో ఏవో పాత గొడవలు ఉన్నాయి. ఈ తరుణంలోనే జులై 31న రాహుల్ వర్గం నాగుల్ మీరా వర్గంపై అదును చూసుకొని కత్తులు, కర్రలతో దాడి చేసింది. ఈ దాడిలో రాహుల్ ‌తో పాటు అయోధ్య నగర్‌ కు చెందిన వినయ్ తదితరులు భాగమైయ్యారు. రాహుల్ వర్గం దాడితో ఆగ్రహంతో ఊగిపోయిన నాగుల్ మీరా వర్గం అదే రోజు రాత్రి వారిపై ప్రతి దాడికి దిగింది. ఇరు వర్గాల పరస్పర దాడుల తర్వాత రెండు గ్యాంగ్స్ సైలెంట్ అయిపోయాయి.

ఈ క్రమంలోనే పుట్టా వినయ్ అనే యువకుడు నాగుల్ మీరా వర్గం తనపై దాడి చేసినట్లుగా అజిత్‌ సింగ్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో నాగుల్ మీరాతో పాటు షేక్ ఈసబ్,లావేటి సాయి కుమార్,సాయి పవన్,కంది సాయి లపై కేసు నమోదైంది. పుట్టా వినయ్ కేసుతో నాగుల్ మీరా గ్యాంగ్ ‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అందులో ఇద్దరు మైనర్లు కూడా ఉన్నారు. సోమవారం వీరిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. అరెస్టయిన నాగుల్ మీరా గ్యాంగ్ నుంచి ఓ బైక్, కత్తులు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. దీనిపై విచారణ చేస్తున్నారు.

ఇదిలా ఉంటే , షేక్ నాగుల్ మీరా కూడా ఆదివారం సత్యనారాయణపురం పోలీసులకు ఫిర్యాదు చేశాడు . ఈ ఫిర్యాదుతో ఖుద్దూస్ ‌నగర్‌ కి చెందిన రాహుల్,అతని అనుచరులైన సాయి కిరణ్,పుట్టా వినయ్,వికాస్ తదితరులను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి నుంచి కత్తులు స్వాధీనం చేసుకున్నారు. మరో ఐదుగురు యువకుల కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. వీరిని కూడా కోర్టులో హాజరుపరచనున్నారు. గత కొన్ని రోజులుగా నగరంలో ఇలాంటి గ్యాంగ్ వార్ లు ఎక్కువ అవుతుండటంతో పోలీసులు ఇలాంటి వారికీ హెచ్చరికలు చేస్తున్నారు. అన్ని వదిలేసి ప్రశాంతంగా జీవిస్తే బాగుంటుంది అని , ఎవరైనా గోడవలని ప్రోత్సహించినట్టు తెలిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు.