మరో కేసులో లంచం ఇచ్చిన గాలి....పరారీ?

Wed Nov 07 2018 17:34:32 GMT+0530 (IST)

Another Case On Gali JanaRdhan Reddy

కర్ణాటక బీజేపీలో చక్రం తిప్పగల నాయకుడు బళ్లారిలో గట్టి పట్టున్న మైనింగ్ డాన్ గాలి జనార్ధన్ రెడ్డి గురించి దక్షిణాది ప్రజలకు పరిచయం అక్కర లేదు. అక్రమ మైనింగ్ ద్వారా వేల కోట్లు కొల్లగొట్టిన గాలి జనార్దన్ రెడ్డి పలు సీబీఐ ఈడీ కేసుల్లో జైలుకు వెళ్లారు. యూపీఏ హయాంలో జనార్ధన్ ....అనేక కేసులతో ఉక్కిరిబిక్కిరి అయ్యారు. అయితే 2014లో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సీన్ మారింది. ప్రస్తుతం గాలి జనార్ధన్ బెయిల్ పై బయట ఉన్నారు. ఆ బెయిల్ వ్యవహారంలో ముడుపులు అందుకున్నారని ఓ జడ్జిపై ఆరోపణలు రావడ కలకలం రేపింది. తాజాగా మరో కేసు నుంచి తప్పించుకునేందుకు గాలి...ఈడీ అధికారులకు లంచాలిచ్చినట్లు ఆరోపణలు వస్తున్నాయి. బళ్లారి ఉపఎన్నికలో బీజేపీ ఓటమితో కుదేలవుతోన్న గాలి కోసం...ఆ కేసు వ్యవహారంలో ఈడీ పోలీసులు గాలిస్తున్నట్లు తెలుస్తోంది.కర్ణాటకలోని యాంబిడెంట్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ వ్యవహారంపై కొద్ది రోజుల క్రితం వివాదం రేగింది. పోంజీ స్కీములతో ప్రజలను మభ్యపెట్టి...ప్రజల నుంచి భారీ స్థాయిలో డిపాజిట్లను ఆ కంపెనీ సేకరించింది. మనీ లాండరింగ్ కు పాల్పడ్డ ఆ కంపెనీపై ఈడీ కేసులు నమోదు చేసింది. దీంతో ఆ కంపెనీ.. గాలి జనార్దన్ రెడ్డిని ఆశ్రయించిందని తెలుస్తోంది. దీంతో ఆ కేసులు ఎత్తివేయిస్తానని చెప్పి గాలి హామీ ఇచ్చారట. ఆ డీల్ సెట్ చేసినందుకు  నగదుకు బదులుగా 57 కిలోల బంగారు కడ్డీలు మాత్రం స్వీకరించారట. ఆ కేసును నీరుగార్చడానికి ఈడీ అధికారులకు…గాలి రూ. కోటి లంచం ఇచ్చారట. అయితే యాంబిడెంట్ కంపెనీలో సోదాలు నిర్వహించిన ఈడీ అధికారులకు ఆ డీల్ కు సంబంధించిన ఆధారాలు దొరికాయి. దీంతో గాలి జనార్ధన్ రెడ్డిని విచారణ జరిపేందుకు పోలీసులు ఆయని నివాసాలు కార్యాలయాల్లో తనిఖీలు చేపట్టారు. అయితే ఈ విషయం ముందుగానే పసిగట్టిన గాలి..పరారైనట్లు తెలుస్తోంది. గాలిని విచారణ చేసిన వెంటనే ఆయనను కస్టడీలోకి తీసుకునే అవకాశముందని తెలుస్తోంది.