Begin typing your search above and press return to search.

ఓ పక్క తీవ్ర ఉద్రిక్తతలు.. తైవాన్ కు మరో అమెరికా టీం

By:  Tupaki Desk   |   15 Aug 2022 5:30 AM GMT
ఓ పక్క తీవ్ర ఉద్రిక్తతలు.. తైవాన్ కు మరో అమెరికా టీం
X
వినాశనానికి వీలుగా ఎవరో పని కట్టుకొని శ్రద్ధగా స్క్రిప్టు రాసిన చందంగా ఇటీవల పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. గతానికి భిన్నంగా తైవాన్ లో చోటు చేసుకుంటున్న పరిణామాలు రాబోయే రోజుల్లో ఏ మాత్రం తేడా కొట్టినా.. మొత్తం ప్రపంచమే మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోందన్న మాట వినిపిస్తోంది. కొరివితో తలగోక్కున్నట్లుగా.. చైనాతో వ్యవహరించే విషయంలో అమెరికా ప్రదర్శిస్తున్న దూకుడు.. పలువురికి ఆందోళన కలిగిస్తోంది. చైనా దూకుడుకు కళ్లాలు వేసేందుకు వీలుగా.. తైవాన్ లో అమెరికా ప్రభుత్వంలోని పలువురు ముఖ్యులు ఆ దేశానికి వచ్చి వెళుతున్న వైనం పరిస్థితిని మరింత ఇబ్బందికరంగా మారుస్తోంది.

మొన్నటికి మొన్న అమెరికాలోని అత్యున్నత స్థానంలో ఉన్న అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ పెలోసీ తైవాన్ పర్యటన సందర్భంగా చోటు చేసుకున్న పరిణామాలు.. ఆ తర్వాత తైవాన్ సరిహద్దుల్లో చైనా ప్రదర్శిస్తున్న దూకుడు పలు దేశాలకు నిద్ర పట్టకుండా చేస్తున్నాయి. ఉరిమి ఉరిమి మంగళం మీద పడినట్లుగా.. చైనా - తైవాన్ - అమెరికా మధ్య చోటు చేసుకునే రచ్చకు ప్రపంచం ఎక్కడ మూల్యం చెల్లించాల్సి వస్తుందన్న భయాందోళనలు ఎక్కువ అవుతున్నాయి.

దీనికి తగ్గట్లే తైవాన్ చుట్టుపక్కల ప్రాంతాల్లో చైనా యుద్ద విమానాలు.. క్షిపణులు.. యుద్ధ నౌకల విన్యాసాలతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారుతోందంటున్నారు. ఇలాంటి వేళ.. అమెరికా అధికార పక్షానికి చెందిన డెమోక్రాట్ల టీం ఒకటి తాజాగా తైవాన్ ను సందర్శిస్తోంది. తైవాన్ తమదని.. దాని విషయంలో వేలు పెట్టొద్దని చైనా తేల్చి చెబుతున్న సంగతి తెలిసిందే. డ్రాగన్ దేశ మాటల్ని లెక్క చేయని అమెరికా.. తేల్చుకోవాలన్న రీతిలో వ్యవహరిస్తోంది.అయితే..

ఇలాంటి సందర్భాల్లో ముందుకు వచ్చినట్లే వచ్చి.. తన ప్రయోజనాలకు భంగం వాటిల్లే అవకాశం ఉందంటే చాలు.. చప్పున ఎస్కేప్ అయ్యే అమెరికా తీరును తైవాన్ పాలకులు సరిగానే అంచనా వేశారా? అన్నది ప్రశ్న.

పెలోసీ పర్యటన కారణంగా చెలరేగిన ఉద్రిక్తతలు ఒక కొలిక్కి రాక ముందే డెమోక్రాట్లకు చెందిన ఐదుగురు ప్రతినిధుల సభ సభ్యులు తైవాన్ ను సందర్శించారు. ఈ టీం భారత కాలమానం ప్రకారం ఆదివారంరాత్రి ఏడు గంటల ప్రాంతంలో తైవాన్ కు చేరుకుంది. రెండు రోజుల పాటు అమెరికా - తైవాన్ దేశాల మధ్య సంబంధాలు.. వాణిజ్యం.. పెట్టుబడి అంశాలపై చర్చలు జరుగుతాయని చెబుతున్నారు. పుండు మీద కారం చల్లినట్లుగా..

అగ్నికి ఆజ్యం పోసినట్లుగా పెలోసీ టూర్ ఉద్రిక్తతలు ఒక కొలిక్కి రాక ముందే.. అమెరికా తనకు చెందిన మరో టీం తైవాన్ కు పంపటం ద్వారా పరిస్థితిని మరింత సున్నితంగా మార్చిందంటున్నారు. మరి.. దీనిపై చైనా రియాక్షన్ ఏమిటి? ప్రపంచం మీద మరెలాంటి ప్రభావం పడనుంది? అన్నదిప్పుడు ప్రశ్నగా మారిందని చెప్పక తప్పదు.