మరో 2600 కోట్ల అప్పు.. ఏపీ అభ్యర్థనకు కేంద్రం ఓకే

Tue Sep 14 2021 15:09:34 GMT+0530 (IST)

Another 2600 crore debt The center is OK for AP

ఏపీ రాష్ట్ర ప్రభుత్వం.. ఆర్థిక సమస్యలతో అల్లాడుతోంది. అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు.. సర్కారుకు గుదిబండల్లా మారిపోయాయా? అనే సందేహం వ్యక్తమవుతోంది. ఈ క్రమంలో అప్పులపై అప్పులు చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే కేంద్రం నుంచి రిజర్వ్ బ్యాంకు నుంచి అనేక రూపాల్లో కోట్ల రూపాయలు అప్పులు తెచ్చుకున్న జగన్ ప్రభుత్వం.. తాజాగా మరోసారి రూ.2600 కోట్ల అప్పు కోసం చేసిన ప్రయత్నాలు ఫలించాయి.మంగళవారం కేంద్ర ఆర్థిక శాఖ పరిధిలోని ఖర్చులు వ్యయాల విభాగం.. ఏపీ ప్రభుత్వం మరో రూ.2655 కోట్లను అప్పుగా తీసుకునేందుకు అది కూడా బహిరంగ మార్కెట్ నుంచి తెచ్చుకునేందుకు అనుమతి ఇచ్చింది. దీనికి సంబంధించి అధికకారులు విడుదల చేసిన ప్రకటన మేరకు.. రాష్ట్ర ప్రభుత్వం బహిరంగ మార్కెట్ నుంచి రుణాలు తెచ్చుకునేందుకు అనుమతి ఇచ్చింది. దీంతో 2021-22 మధ్య మూల ధన వ్యయంపై కేంద్రం అనుమతించే అప్పులు చేరుకున్నట్టు అయిందని పేర్కొన్నారు.

అదనంగా తీసుకున్న మార్కెట్ అప్పుల అనుమతి రాష్ట్ర జీడీపీపై 0.25 శాతం ఉంటుందని ఆర్థిక మంత్రిత్వ శాఖ పేర్కొంది. అయితే.. ఒక్క ఏపీనే కాకుండా.. మరో పది రాష్ట్రాలు.. బిహార్ ఛత్తీస్‌గఢ్ హరియాణ మధ్య ప్రదేశ్ మణిపూర్ మేఘాలయ నాగాలాండ్ రాజస్థాన్ ఉత్తరాఖండ్ రాష్ట్రాలకు కూడా అదనంగా మార్కెట్ రుణాలు తెచ్చుకునేందుకు అనుమతులు మంజూరు చేసినట్టు కేంద్రం వెల్లడించింది.

ఈ 11 రాష్ట్రాల మొత్తం మార్కెట్ రుణం.. రూ.15721 కోట్ల వరకు ఉంటుందని.. దీనిలో ఏపీ వాటా రూ.2655 కోట్లు ఉందని.. పేర్కొంది. ఏపీ తర్వాత.. మధ్య ప్రదేశ్ రూ. 2590 కోట్లు తీసుకునేందుకు అనుమతి ఇచ్చినట్టు కేంద్రం తెలిపింది. ఇక దీని తర్వాత.. మళ్లీ అప్పు కావాలంటే మాత్రం ఈ ఏడాది డిసెంబరు వరకు ఆగాల్సి ఉంటుందని పేర్కొంది. ప్రస్తుతం ఇచ్చిన అనుమతుల మేరకు ఈ నెల 30 వరకు మూల వ్యయాలపై అంచనాలు వేసినట్టు తెలిపింది.

వచ్చే ఏడాది మార్చిలో మూడో సమీక్ష ఉంటుందని.. అప్పటికి ఉన్న మూల వ్యయాలపై రాష్ట్రాల వాటాను పరిగణనలోకి తీసుకుని మదింపు చేయనున్నట్టు పేర్కొంది. మూల ధన వ్యయంపై 0.50 శాతం రాష్ట్ర జీడీపీ మేరకు అనుమతి ఉంటుందని తెలిపింది. ఇప్పటికే ఈ నెల 30 నాటికి 45 శాతం కనీస వ్యయ పరిమితిని చేరుకున్నట్టు వివరించారు. లేదా మొత్తం డిసెంబరు నాటికి 70 శాతం వ్యయానికి చేరుకున్న వాటిని పరిగణనలోకి తీసుకున్నట్టు కేంద్రం తెలిపింది. ఇ

ఇదిలావుంటే.. గత వారమే కేంద్రం రూ.10500 కోట్ల రుణానికి ఏపీకి అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించి రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి రోజుల తరబడి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మాలా సీతారామన్‌తో చర్చలు జరిగి.. మరీ ఈ అప్పు సాధించారు. ఇక ఇప్పుడు తీసుకున్న మొత్తం అప్పు డిసెంబరు వరకు కొనసాగనుంది. దీని ప్రకారం చూస్తే.. రాష్ట్రం గత తొమ్మిది మాసాల్లలో మొత్తం రూ. 31251 కోట్లకు చేరినట్టు అధికారులు వివరించారు.