Begin typing your search above and press return to search.

లోక్ స‌భ‌లో ఆ బిల్లుకు ఒక్క వ్య‌తిరేక ఓటూ లేదు!

By:  Tupaki Desk   |   10 Dec 2019 4:05 PM GMT
లోక్ స‌భ‌లో ఆ బిల్లుకు ఒక్క వ్య‌తిరేక ఓటూ లేదు!
X
సాధార‌ణంగా ఏదైనా బిల్లును లోక్ స‌భ‌లో లేదా రాజ్య‌స‌భ‌లో ప్ర‌తిపాదిస్తే - ఏదైనా రాష్ట్ర అసెంబ్లీలో ప్ర‌వేశ పెడితే దానికి అనుకూలంగా ప‌డే ఓట్లు - వ్య‌తిరేకిస్తూ ప‌డే ఓట్లు కొన్ని అయినా ఉంటాయి. కొన్ని సార్లు అనుకూలంగా ప‌డే ఓట్లు త‌క్కువై పోయి బిల్లులు ఆగిపోతూ ఉంటాయి కూడా!

అలాంటి స‌మ‌యాల్లో వైరి ప‌క్ష పార్టీల‌ను కూడా అధికార ప‌క్షం బుజ్జ‌గించి ఓట్లు వేయించుకోవ‌డానికి ప్ర‌య‌త్నిస్తూ ఉంటుంది. భార‌త ప్ర‌జాస్వామ్యంలో అలాంటి చిత్రాలు మామూలే. అయితే కొన్ని బిల్లులు ఏక‌గ్రీవంగా పాస్ అవుతూ ఉంటాయి. కానీ ఎంత ఏక‌గ్రీవంగా పాస్ అయినా.. కొన్ని పార్టీలు అయినా ప్ర‌తి బిల్లునూ వ్య‌తిరేకిస్తూ ఉంటాయి.

అయితే తాజాగా లోక్ స‌భ‌లో పాస్ అయిన ఒక బిల్లుకు వ్య‌తిరేకంగా ఒక్క‌టంటే ఒక్క ఓటు కూడా ప‌డ‌లేదు. అది ఎస్సీ-ఎస్టీ- ఆంగ్లో ఇండియ‌న్ పొలిటిక‌ల్ రిజ‌ర్వేష‌న్ల విష‌యంలో.

లోక్ స‌భ‌తో పాటు దేశంలోని అన్ని రాష్ట్రాల్లోనూ ఎస్సీ-ఎస్టీల‌కు - ఆంగ్లో ఇండియ‌న్ల‌కు రాజ్యాంగం రిజ‌ర్వేష‌న్ల‌ను ప్ర‌తిపాదించింది. వాళ్లు పోటీ చేయ‌డానికి కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల‌ను రిజ‌ర్వ్ చేసే నియ‌మాన్ని అమ‌ల్లో పెట్టింది.

డెబ్బై యేళ్ల కింద‌ట ఈ నియ‌మం అమ‌ల్లోకి వ‌చ్చింది. అప్ప‌ట్లో డెబ్బై యేళ్ల పాటు ఆ రిజ‌ర్వేష‌న్లు అమ‌ల‌య్యేలా రాసుకున్నారు. ఆ గ‌డువు వ‌చ్చే ఏడాదితో పూర్తి కానుంది.

ఇలాంటి నేప‌థ్యంలో ద‌ళితుల‌కు - గిరిజ‌నుల‌కు - ఆంగ్లో ఇండియ‌న్ల‌కు ఆ రిజ‌ర్వేష‌న్ల‌ను పెంచింది కేంద్ర ప్ర‌భుత్వం. మ‌రో ప‌దేళ్ల పాటు పొలిటిక‌ల్ రిజ‌ర్వేష‌న్ల‌ను పెంచారు. అందుకు గానూ లోక్ స‌భ‌లో ఓటింగ్ జ‌రిగింది. మొత్తం 352 మంది ఈ ఓటింగ్ లో పాల్గొన‌గా.. అన్ని ఓట్లూ ఆ బిల్లుకు అనుకూలంగానే ప‌డ్దాయి. క‌నీసం ఒక్క ఓటు కూడా ఆ రిజ‌ర్వేష‌న్ల‌ను వ్య‌తిరేకిస్తూ ప‌డ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం.