ఏపీలో ఈ ఐఏఎస్ అందరికీ ఆదర్శం.. ఏం చేశారంటే!

Wed Jul 06 2022 14:04:51 GMT+0530 (India Standard Time)

Andhrapradesh IAS Prabhakar Reddy

ఉన్నత స్థాయికి ఎదిగినా.. అత్యున్నత స్థాయి అధికారులుగా రాజభోగం అనుభవిస్తున్నా కొంతమంది అధికారులు అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. అన్ని అవకాశాలు ఉండి కూడా.. కావాలనుకుంటే కార్పొరేట్ సదుపాయాలు పొందగల డబ్బూ దర్పం ఉన్నా సాధారణ ప్రజల్లానే ఉంటున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వ వైద్యశాలల్లోనే పురుడు పోసుకోవడం చికిత్సలు చేయించుకోవడం వంటివి చేస్తున్నారు. ఇటీవల తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో కలెక్టర్ ఒకరు తన సతీమణికి ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రసవం చేయించారు.అలాగే కొంతమంది అత్యున్నత అధికారులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలు కళాశాలల్లో చేర్పిస్తున్నారు. తద్వారా పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. సాధారణ ప్రజలకు ప్రభుత్వ విద్యా సంస్థలు వైద్య సంస్థల మీద తమ చర్యల ద్వారా నమ్మకం కల్పిస్తున్నారు.

సాధారణ ప్రజలు రెక్కలు ముక్కలు చేసుకుని అత్యధిక ఫీజులు చెల్లించి తమ పిల్లలను పాఠశాలలకు పంపుతున్నారు. అయితే ఆంధ్రప్రదేశ్ లో ఈ ఐఏఎస్ అధికారి మాత్రం వినూత్నంగా ఆలోచించారు.

ఆర్థిక స్థోమత మెరుగ్గా ఉన్న అందరిలాగా కార్పొరేట్ స్కూల్స్ లో పిల్లలను చదివించకుండా ప్రభుత్వ పాఠశాలలో చదివించేందుకు ముందుకొచ్చారు. ప్రభుత్వాధికారులే ప్రైవేట్ స్కూళ్ల బాట పడుతుంటే ఆ ఐఏఎస్ అధికారి పిల్లలిద్దరిని గవర్నమెంట్ స్కూళ్లో చేర్పించారు.

ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ (శాప్) వీసీ ఎండీ ఎన్ ప్రభాకరరెడ్డి తమ ఇద్దరు పిల్లలను విజయవాడలోని కోనేరు బసవయ్య చౌదరీ జెడ్పీ హైస్కూళ్లో చేర్పించారు. ఇది కొత్తేం కాదు.. గతంలో నెల్లూరు జిల్లా జాయింట్ కలెక్టర్ గా పనిచేస్తున్న సమయంలో ప్రభుత్వ పాఠశాలల్లోనే వారిని చదివించారు. ప్రభాకరరెడ్డి సతీసమేతంగా వచ్చి పిల్లలకు అడ్మిషన్లు తీసుకున్నారు.

పాఠశాలలో వసతులు విశాలమైన ఆట స్థలం ఉండటంతోనే ఇక్కడ చేర్పిస్తున్నామని తెలిపారు. కూతురు ఎనిమిదో తరగతి చదువుతుండగా కొడుకు కోసం ఆరో తరగతిలో అడ్మిషన్ తీసుకున్నట్లు వివరించారు. ఈ విషయం తెలిసినవారు ప్రభాకరరెడ్డిని ఆదర్శంగా తీసుకోవాలని అంటున్నారు.