Begin typing your search above and press return to search.

ఏబీవీ స్టోరీ : ముఖం చూడడానికే ఇష్టం లేదా.. ?

By:  Tupaki Desk   |   12 May 2022 7:31 AM GMT
ఏబీవీ స్టోరీ : ముఖం చూడడానికే ఇష్టం లేదా.. ?
X
ఆయన సీనియర్ ఐపీఎస్ అధికారి. గత ప్రభుత్వంలో ఏపీ ఇంటలిజెన్స్ చీఫ్ గా పనిచేశారు. నాడు ఆయన మీద వైసీపీ విపక్షంలో ఉండగా ఘాటు ఆరోపణలు చేసింది. ఆయనే ఏబీ వెంకటేశ్వరావు. ఇక అధికారంలోకి వస్తూనే సస్పెండ్ చేసింది. మొత్తానికి ఆయన సుప్రీం కోర్టుకు వెళ్లి సస్పెన్షన్ ని తొలగించుకున్నారు. ఇది జరిగి ఇప్పటికి పదిహేను రోజులు అయింది.

ఆయన ఏపీ సచివాలయం చుట్టూ తిరుగుతున్నా అక్కడ పలకరించే వారు లేరా అన్న చర్చ వస్తోంది. ఆయన ఇప్పటికి ఒకసారి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శ‌ర్మను కలిశారు. తనకు పోస్టింగుతో పాటు పూర్తి జీతం ఇవ్వాలని కోరారు. సుప్రీం కోర్టు ఆదేశాలను కూడా ముందుంచారు. ప్రాసెస్ లో పెడతామని నాడు చెప్పిన సీఎస్ ఆ తరువాత మళ్ళీ అపాయింట్మెంట్ ఇవ్వడంలేదు అని ఏబీ వెంకటేశ్వరావు అయితే ఆవేదన చెందుతున్నారు.

ఆయన గత రెండు రోజులుగా సచివాలాయానికి వస్తున్నా సీఎస్ దర్శనం మాత్రం అవడంలేదు. ఇక నిన్నటికి నిన్న సీఎస్ తన చాంబర్ లో ఉండగానే ఏబీవీ వచ్చారట. ఆయన్ని వెయిటింగ్ లో ఉంచి మరీ సీఎస్ తన చాంబర్ నుంచి వెళ్లిపోయారు అని చెబుతున్నారు. దీని బట్టి చూస్తే ఒక్కసారి మాత్రం ఏదో విధంగా ఏబీవీ సీఎస్ ని కలవగలిగారు. కానీ ఇపుడు ఆయన ముఖం చూపేందుకే ఇష్టపడడం లేదా అన్న చర్చ వస్తోంది.

దీంతో ఏబీవీ అయితే ఆందోళనలో ఉన్నారు. సుప్రీం కోర్టు ఆదేశాలను తెచ్చి చూపించినా ప్రభుత్వం నుంచి పోస్టింగ్ మీద ఏ క్లారిటీ రాలేదని వాపోతున్నారు. మరి ప్రభుత్వ పెద్దలకు ఏబీవీ ముఖం చూడడమే అసలు ఇష్టం లేనట్లుగా ఉందని అంటున్నారు. మరి ఇలాగైతే సుప్రీం కోర్టు ఆదేశాలు ఎలా అమలు చేస్తారు అన్నది కూడా ప్రశ్న.

మరి సుప్రీం కోర్టు ఆదేశాలను ధిక్కరిస్తే దాని ఫలితాలు ఎలా ఉంటాయో అన్న కంగారు అధికార వర్గాలలో ఉందిట. మొత్తానికి ఏబీవీ కధ ఒక సీరియల్ ఎపిసోడ్ నే తలపిస్తోంది అంటున్నారు. ఆయనకు పోస్టింగ్ ఇవ్వడం ప్రభుత్వానికి ఇష్టం లేదని కూడా చర్చ సాగుతోంది. మరి ఈ విషయంలో ఏం చేస్తారో ఎలా ఈ కధ కు ఎండ్ కార్డ్ పడుతుందో చూడాలి.