రెండేళ్ల క్రితం లేఖ రాసిన కేసీఆర్.. వాస్తవంలోకి తీసుకొచ్చిన చీఫ్ జస్టిస్

Thu Jun 10 2021 09:39:26 GMT+0530 (IST)

'Andhra' makes KCR dream come true

తెలంగాణ హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్యను పెంచాలన్నది చాలా కాలంగా ఉన్న కల. సుదీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న ఈ సమస్యకు పరిష్కారం కానుంది. ఎందుకంటే.. చీప్ జస్టిస్ ఈ ఇష్యూను తాజాగా క్లియర్ చేశారు. దీంతో తెలంగాణ హైకోర్టులో ఇప్పుడున్న 24 మంది న్యాయమూర్తుల సంఖ్య ఏకంగా 42 కానుంది.తెలంగాణ హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్యను పెంచేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఆమోద ముద్ర వేయించారు.  ఆసక్తికరమైన విషయం ఏమంటే.. ఇటీవల కాలంలో ఏ హైకోర్టులోని న్యాయమూర్తుల సంఖ్య ఇంత భారీగా పెరిగింది లేదు. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ హైకోర్టు ఏర్పాటైన వేళ.. మొత్తం  42 మంది న్యాయమూర్తుల్ని మంజూరు చేశారు. ఇందులో 32 మంది శాశ్వత న్యాయమూర్తులు కాగా.. 10 మంది అదనపు న్యాయమూర్తులు ఉంటారు.  

ఇక్కడో ఆసక్తికరమైన విషయాన్ని చెప్పాలి. హైకోర్టు న్యాయమూర్తుల ఖాళీల్ని మూడొంతుల్లో రెండు వంతులను న్యాయవాదుల నుంచి ఎంపిక చేస్తారు. మూడింట ఒక వంతు మందిని న్యాయసేవల అధికారులతో భర్తీ చేస్తారు. అంటే.. 42 మంది జడ్జిలలో 28 మందిని న్యాయవాదుల నుంచి.. న్యాయసర్వీసుల నుంచి 14 మందిని ఎంపిక చేయనున్నారు. 2019లో తెలంగాణ హైకోర్టులోన్యాయమూర్తుల సంఖ్య పెంచాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి కేంద్ర న్యాయశాఖా మంత్రికి లేఖ రాశారు. ఆ లేఖను అప్పటి గవర్నర్.. సీఎం కేసీఆర్ ఇద్దరూ బలపర్చారు. కానీ.. అది పెండింగ్ లో ఉంది.

ఆ తర్వాతి కాలంలో ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం ప్రధాని మోడీకి లేఖ రాశారు. అయినప్పటికి ఆ విన్నపం పెండింగ్ లోనే ఉంది. .ఇలాంటి వేళ.. చీఫ్ జస్టిస్ పదవిని చేపట్టిన ఎల్వీ రమణ.. వివిధ స్థాయిల్లో పెండింగ్ లో ఉన్న ప్రతిపాదనలు ఏమేం ఉన్నాయన్న అంశంపై ఫోకస్ పెట్టారు. ప్రధాని.. న్యాయశాఖా మంత్రితో మాట్లాడారు. తెలంగాణ హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య పెంచాలన్న అభ్యర్థనలో హేతుబద్ధత ఉందని.. ముఖ్యమంత్రి కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించారని ఎల్వీ రమణ కేంద్రానికి చెప్పటంతో పాటు లేఖ రాశారు.

దీంతో న్యాయశాఖ తక్షణం స్పందించింది. జస్టిస్ రమణ లేఖను ఆమోదం వేస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో.. తెలంగాణ హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 42కు పెరిగేందుకు అనుమతి లభించినటైంది. తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్య పెంపుపై కిషన్ రెడ్డి స్పందిస్తూ.. సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ రోజుగా అభివర్ణించటం విశేషం. అయితే.. ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న ఇంత పెద్ద నిర్ణయం చకచకా కదలటంలో చీఫ్ జస్టిన్ ఎల్వీ రమణ చొరవే కీలకం. ఆయన ఆంధ్ర ప్రదేశ్ లోని క్రిష్ణా జిల్లాకు చెందిన వారు. అత్యున్నత స్థానాల్లో ఉన్న వారికి ప్రాంతాలు.. ఇతర అంశాల్ని అస్సలు పట్టదు. మెరిట్ ఆధారంగానే ఇష్యూల్ని డీల్ చేస్తారు. ఈ విషయాన్ని జస్టిస్ రమణ తన నిర్ణయంతో మరోసారి నిరూపించారు.