ఏపీ వెనుజులా అవుతుందా?

Wed Oct 09 2019 20:00:02 GMT+0530 (IST)

Andhra To Becomes Another venezuela

ప్రపంచంలో దివాళా దశకు చేరిన దేశాల్లో ఒకటి వెనుజులా. ఆయిల్ ఉత్పత్తితో ఒక దశలో వెలిగిన దేశం అది. అయితే విపరీతమైన సంక్షేమ  పథకాల వల్ల ఆ దేశం ఆర్థికంగా బాగా దెబ్బతిన్నదని అంటారు. సోషలిస్ట్ కంట్రీ అయిన వెనుజులా ప్రస్తుతం చాలా ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని తరచూ వార్తలు వస్తూ ఉంటాయి. దానంతటికీ కారణం అతిగా చేసిన సంక్షేమ పథకాలు అని పరిశీలకులు అంటూ ఉంటారు.విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పరిస్థితి కూడా చాలా దారుణంగా తయారైందనది తెలుస్తున్న అంశమే. ఆదాయం లేదు - అంతకంతకూ పెరుగుతున్న ఖర్చులు. ఇదీ ఏపీ ఆర్థిక పరిస్థితి.

గత ప్రభుత్వ హయాంలోనే రెండు లక్షల కోట్ల రూపాయలకు పైగా - దాదాపు మూడు లక్షల రూపాయల వరకూ అప్పులు చేసినట్టుగా గణాంకాలు చెబుతూ ఉన్నాయి. విభజన సమయంలో ఉన్న అప్పులకు అనేక రెట్ల అప్పులను చేశారు చంద్రబాబు నాయుడు. ఆ డబ్బులు ఏమయ్యాయి అంటే.. ఆన్సర్ లేదు!

ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి కాలేదు - అద్భుతాలు చేసింది లేదు - అమరావతిలో ఇటుక పేర్చలేదు. అయినా లక్షల కోట్ల రూపాయల అప్పు అయితే మిగిలింది.  ఇలాంటి నేపథ్యంలో..కొత్త ప్రభుత్వం మరిన్ని సంక్షేమ పథకాలను అమలు చేస్తూ ఉంది. పెన్షన్లు పెరిగాయి - జీతాలు పెరిగాయి - ఆర్టీసీ తోడయ్యింది.. ఇంకా కొన్ని సంక్షేమ పథకాలను అమలు చేయబోతున్నారు.

ఇలాంటి నేపథ్యంలో ఇదంతా ప్రభుత్వఖ ఖజానాకు భారమే అయ్యే అవకాశాలున్నాయి. కొత్తగా ఆర్థిక వనరులను అన్వేషించాల్సి ఉంది.  అదే జరగకపోతే.. ఏపీ పరిస్థితి వెనుజులాలా తయారు అవుతుందని విశ్లేషకులు అంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎలా పరిరక్షించుకుంటుందో!