Begin typing your search above and press return to search.

ప్రమాదపుటంచులలో ఆంధ్రప్రదేశ్... ?

By:  Tupaki Desk   |   14 Oct 2021 4:30 PM GMT
ప్రమాదపుటంచులలో ఆంధ్రప్రదేశ్... ?
X
ఆంధ్రప్రదేశ్. ఈ పేరు కలసి రాలేదా అంటే లేదు అని వాదించే వారు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ అంటే దుష్ట సమాసం అని అనే వారు కూడా ఉన్నారు. ఆంధ్ర తెలుగు పదమైతే ప్రదేశ్ అన్నది హిందీ పదం. అయితే నాటి ప్రధాని నెహ్రూ పెట్టిన పేరుగా చెప్పుకుంటారు. ఇక ఆంధ్ర ప్రదేశ్ హిస్టరీ గురించి చెప్పుకుంటే ఎపుడూ ఇబ్బందులే సమస్యలే నేస్తాలుగా చేసుకుని సాగింది. ఉమ్మడి మద్రాస్ రాష్ట్రంలో నాడు పదకొండు జిల్లాల ఆంధ్ర రాష్ట్రం ఉండేది. ఇక మద్రాస్ రాజధాని నిర్మాణం వెనక తెలుగు వారి కృషి ఎంతో ఉందని చరిత్ర చెబుతోంది.

ఆంధ్రులకు ఒక రాష్ట్రం కావాలని కోరుకున్నపుడు మద్రాస్ రాజధానిగా అన్న డిమాండ్ కూడా పెట్టారు. అది కనుక జరిగినట్లు అయితే తెలంగాణాతో విలీనం కాకుండానే ఆంధ్ర రాష్ట్రం ఈ రోజుకు ఎంతో అభివృద్ధి చెందేది. కానీ నాటి మద్రాస్ చీఫ్ మినిస్టర్ రాజాజీ రాజకీయ వ్యూహాలు, నెహ్రూ ఆలోచనా విధానాలు అన్నీ కలసి రాజధాని లేని పదకొండు జిల్లాల ఆంధ్ర రాష్ట్రాన్నే ఇచ్చేసి వదిలేశాయి. దాంతో ఇప్పటికి ఏడు దశాబ్దాల క్రితం ఎలాంటి ప్రగతి లేకుండా ఆంధ్ర రాష్ట్రం అవతరించింది. నాడు చూస్తే ఒక్క పెద్ద నగరం లేకుండా ఆదాయం లేకుండా ఆదాయం లేని రాష్ట్రాన్ని మూడేళ్ళ పాటు కనా కష్టంగా తొలి పాలకులు నడిపారు.

అలా ఆంధ్ర రాష్ట్రం ఒంటరిగా మనుగడ సాధించలేదన్న కారణంతోనే నాటి హైదరాబాద్ స్టేట్ ని కూడా కలిపి ఆంధ్ర ప్రదేశ్ గా నామకరణం చేసి మరీ తొలి భాషా ప్రయుక్త రాష్ట్రంగా దేశానికి చూపారు. అయితే తెలంగాణావాదుల ఉద్యమాలతో మళ్లీ అరవయ్యేళ్ళ నాటికి ఉమ్మడి ఏపీ రెండుగా చీలిపోయింది. అలా 2014లో పదమూడు జిల్లాలతో ఆంధ్ర ప్రదేశ్ గా ఏర్పడింది. మళ్లీ 1953 నాటి పరిస్థితులే ఎటు చూసినా ఉన్నాయి. నాటితో పోలిస్తే విజయవాడ, విశాఖ కొంత అభివృద్ధి చెందిన నగరాలుగా ఉన్నా కూడా ఆంధ్ర రాష్ట్రం ప్రగతి చక్రాలకు అవసరం అయిన ఇంధనాన్ని అవి ఇవ్వలేకపోతున్నాయి.

అందుకే అప్పులతోనే ఏపీ రధం సాగుతోంది. నాడు మూడేళ్ళు, విభజన తరువాత ఏడేళ్ళు మొత్తం పదేళ్ళ కాలాన్ని కనుక విశ్లేషించి చూసినపుడు ఆంధ్ర రాష్ట్రం సుదీర్ఘ కాలంలో అభివృద్ధి సాధించి మనుగుడ సాగించగలదా అన్న చర్చ అయితే మేధావుల్లో వస్తోంది. ఎందుకంటే 2014 నాటికి అప్పు చూస్తే దాదాపు లక్ష కోట్లు, ఇప్పటికి అది పెరిగి ఆరు లక్షల కోట్ల అప్పులకు పేరుకుపోయాయి. మరో సగం పాలన వైసీపీకి ఉంది. ఇంకా అప్పులు చేయాల్సి రావచ్చు. ఆ తరువాత మళ్ళీ వైసీపీ వచ్చినా, టీడీపీ అధికారంలోకి వచ్చినా అప్పులే దిక్కు తప్ప అద్భుతాలు అయితే వేరేగా జరిగిపోవు.

ఏపీ వ్య‌వసాయికంగా ఆధారపడిన రాష్ట్రం. పారిశ్రామికంగా ముందుకు సాగాలంటే కొన్ని దశాబ్దాల కాలం పట్టే అవకాశం ఉంది. కేంద్రం సాయం చేయాలి. ప్రకృతి సహకరించాలి. కరోనా లాంటి ముప్పులు రాకుండా ఉండాలి. కానీ ఏపీ పరిస్థితి చూస్తే ఇపుడు అందరికీ నిరాశే కలుగుతోంది. ఈ నేపధ్యంలో అప్పులు కుప్పలుగా పేరుకుపోతే ఏపీని మళ్ళీ ఏ బలమైన రాష్ట్రంలో కలిపి విలీనం చేయమన్న ప్రతిపాదన వచ్చినా ఆశ్చర్యమే లేదు అంటున్నారు మేధావులు. సొంతంగా ఏపీ మనుగడ సాగించకపోతే మళ్ళీ మద్రాస్ ఉమ్మడి రాష్ట్రంలో విలీనం అవుతుందా లేక తిరిగి తెలంగాణాలో కలపాల్సి ఉంటుందా అన్న చర్చ అయితే ఈ రోజుకు గట్టిగానే ఉంది. ఏపీని ఒక రాష్ట్రంగా నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ఇపుడు రాజకీయ పార్టీలతో పాటు, ఈ గడ్డ మీద పుట్టి వివిధ రంగాల్లో రాణిస్తున్న వారి అందరి మీదా ఉంది. లేకపోతే మాత్రం ఏపీ ప్రమాదపు అంచుల వైపుగా సాగుతూనే ఉంటుంది.