Begin typing your search above and press return to search.

వాళ్ళతో పెట్టుకుంటున్న వైసీపీ...రిజల్ట్... ?

By:  Tupaki Desk   |   19 Jan 2022 10:31 AM GMT
వాళ్ళతో పెట్టుకుంటున్న వైసీపీ...రిజల్ట్... ?
X
వైసీపీ ప్రభుత్వం రావాలని అంతా అనుకున్నారు. అలాంటి వాళ్ళలో ప్రభుత్వ ఉద్యోగులు కూడా ముందు భాగంలో ఉన్నారు. దానికి కారణం ఉద్యోగులకు వైఎస్సార్ అంటే ఇష్టం. ఆయన ప్రభుత్వ హయాంలో వారికి బాగా మేలు జరిగింది. ఇక కాంగ్రెస్ ప్రభుత్వాలు ఎపుడూ ఉద్యోగులకు అనుకూలంగా ఉంటాయి. దాంతో జగన్ని కూడా అలాగే చూస్తూ ఆయన కావాలీ రావాలీ అనుకున్నారు. ఇక జగన్ వస్తే తమ జీతాలు ఊహకు అందనంత ఎక్కువగా పెరిగిపోతాయని కూడా భావించారు.

కానీ ఉద్యోగుల మీదనే ఇపుడు వైసీపీ సర్కార్ గట్టిగా చూస్తోంది అని వాపోతున్నారు. మేము ఇవ్వాల్సింది ఇంతే. ఆ మీదట మీ ఇష్టం అంటోంది సర్కార్. నిజానికి కొత్త పీయార్సీ వైసీపీ ప్రభుత్వం నుంచి ఇలా ఉంటుందని అసలు ఉద్యోగులు ఊహించలేదు. దాంతో వారు షాక్ తింటున్నారు. ఐర్ ఆర్ కంటే కూడా ఎక్కడా ఫిట్మెంట్ తగ్గిన సందర్భాలు లేవు దాంతో ఇది రివర్స్ పీయార్సీ అనేస్తున్నారు.

అంతే కాదు. తమకు రావాల్సిన అన్ని రకాల ఆర్ధిక ప్రయోజనాలను కూడా పూర్తిగా కోత పెట్టారని వారు గోల పెడుతున్నారు. కొత్త పీయార్సీ వల్ల ప్రతీ ఉద్యోగికి నెలకు కనీసంగా నాలుగు వేల రూపాయలు మేర ఆర్ధిక నష్టం సంభవిస్తుంది అని వారు అంటున్నారు.

సరే ఇవన్నీ ప్రభుత్వానికి తెలియవు అనుకోవడానికి లేదు. అయితే ఇప్పటికే వారికి ఇవ్వాల్సింది ఇచ్చేశామని అంటోంది. కొత్త పీయార్సీ వల్ల ఏకంగా ఖజనా మీద పది వేల కోట్ల రూపాయల భారం పడుతోంది అన్నది సర్కార్ పెద్దల వాదన. మొత్తానికి రెండు రోజుల క్రితం పీయార్సీకి సంబంధించి జీవోలు విడుదల చేసిన ప్రభుత్వం ఉద్యోగుల ఆందోళన విషయంలో ఏ రకంగాను ప్రస్తుతానికి రియాక్ట్ అయ్యేలా కనిపించడంలేదు

దాంతో ఉద్యోగులు సమ్మె వైపుగానే అడుగులు వేస్తున్నారు. ఇది అనివార్యమని, ప్రభుత్వమే తమను అలా నడిపిస్తోందని ఉద్యోగ సంఘాల నాయకులు అంటున్నారు. తమకు సహకరించాలని వారు ప్రజలను కోరుతున్నారు. అయితే ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో ప్రజలలో కొంత వ్యతిరేకత ఉంటుందని అందువల్ల వారు ఆందోళనకు వెళ్ళినా ఉపయోగం ఉండదన్న లెక్కలేవో సర్కార్ పెద్దలకు ఉన్నాయి. ఇప్పటికైతే ఉద్యోగులు సమ్మె చేస్తారు. వేరే విధంగా చేస్తారు. అయినా కూడా సర్కార్ దిగి రాకపోతే అన్న చర్చ కూడా ఉంది. అయితే ప్రభుత్వ ఉద్యోగులు 13 లక్షల దాకా ఉన్నారు. వారికి వైసీపీ సర్కార్ మీద అయితే గట్టిగానే మండుతోంది.

ఆ మంటను వారు చల్లార్చుకోవడానికి సరైన టైమ్ కోసం చూస్తారు అన్నది రాజకీయ విశ్లేషణ. అదే కనుక జరిగితే 2024 ఎన్నికలు మాత్రం వైసీపీ సర్కార్ కి ఇబ్బందే అంటున్నారు. ఉద్యోగులతో గతంలో పెట్టుకున్న ప్రభుత్వాలు రాజకీయంగా ఇబ్బందులు పడ్డాయనే చరిత్ర చెబుతోంది. మరి ప్రజా మద్దతు విశేషంగా ఉందని భావిస్తున్న వైసీపీ పెద్దలు ఉద్యోగులను ఖాతరు చేయకుంటే రిజల్ట్ ఎలా ఉంటుంది అంటే మరో రెండేళ్లలో రానున్న ఎన్నికల దాకా ఎదురుచూడడమే.