Begin typing your search above and press return to search.

చిరకాల కోరిక తీర్చిన జగన్

By:  Tupaki Desk   |   26 Jan 2022 6:30 AM GMT
చిరకాల కోరిక తీర్చిన జగన్
X
మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పేరుతో ఒక కొత్త జిల్లాను ఏర్పాటు చేయడం ద్వారా ముఖ్యమంత్రి జగన్ గిరి పుత్రుల చిరకాల డిమాండ్ ని నెరవేర్చారు. నిజానికి ఇది ఈనాటి డిమాండ్ కాదు, గత కొన్ని దశాబ్దాలుగా వారు కోరుతున్నారు. అల్లూరి పుట్టింది క్షత్రియుడుగా అయినా ఆయన జీవితం పోరాటం అంతా గిరిజనుల కోసం అంకితం చేశారు. మరీ ముఖ్యంగా 1922 నుంచి 1924 వరకూ రెండేళ్ళ పాటు అలుపెరగని పోరాటాన్ని విశాఖ ఏజెన్సీ వేదికగా చేసుకుని అల్లూరి చేశారు.

ఆయన విశాఖ మన్యం నుంచే తెల్లదొరలను ఎదుర్కొన్నారు. ఆయన మన్యం వీరులకు యుద్ధ రీతులు నేర్పించడం ద్వారా వారిలో స్వతంత్ర భావాలను రగిలించారు. ఈ దేశం నుంచి బ్రిటిష్ వారు వెళ్ళిపోవాలని గర్జించిన అల్లూరి అడుగు జాడలు అన్నీ విశాఖ మన్యంలో కనిపిస్తాయి.

అలాంటి అల్లూరిని క్రిష్ణదేవి పేటలో హతమార్చారు. ఆయన అస్థికలు కూడా అక్కడ ఉన్న వరాహనదీలో కలిపారు. అల్లూరి జీవితం అంతా విశాఖ ఏజెన్సీలో సాగింది. కాబట్టి ఏజెన్సీ జిల్లాకు ఆయన పేరు పెట్టాలన్న డిమాండ్ ని ఇన్నాళ్ళకు వైసీపీ సర్కార్ నెరవేర్చింది.

అల్లూరి సీతారామరాజు పేరుతో పాడేరు కేంద్రంగా పాడేరు, అరకు, రంపచోడవరం నియోజకవర్గాలను కలుపుతూ కొత్త జిల్లాను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇక మీదట ఆ విప్లవవీరుడిని తలుస్తూ భావి తరాలు కూడా నివాళి అర్పించేలా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. జగన్ ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడమే కాదు, విప్లవవీరుడుకి సరైన నివాళి అర్పించారని అంతా ప్రస్తుతిస్తున్నారు. అల్లూరితో పాటే జగన్ పేరు కూడా శాశ్వతంగా నిలుస్తుందని కూడా అల్లూరి అభిమాన సంఘాలే కాక గిరిజన నాయకులు కూడా చెబుతున్నారు. మొత్తానికి జగన్ తీసుకున్నది చారిత్రాత్మకమైన నిర్ణయం అని ప్రశంసలు దక్కుతున్నాయి.