Begin typing your search above and press return to search.

ఆ తేదీ నాటికి ఏపీలో తారాస్థాయికి కొవిడ్ కేసులు..!

By:  Tupaki Desk   |   19 Jan 2022 3:29 AM GMT
ఆ తేదీ నాటికి ఏపీలో తారాస్థాయికి కొవిడ్ కేసులు..!
X
చైనాలో పుట్టిన కరోనా మహమ్మారి ప్రపంచ వ్యాప్తంగా అల్లకల్లోలం సృష్టిస్తోంది. ఇప్పటికే చాలా దేశాల్లో లక్షల సంఖ్యలో కేసులు నమోదు అవుతుండగా... మన దేశంలో కూడా అదే ఉధృతి కొనసాగుతోంది. తాజాగా మన దేశంలో మొత్తం కేసుల సంఖ్య ఒక్క రోజులో రెండు లక్షల ముప్పై ఎనిమిది వేలను దాటింది. మరోవైపు మరణాల సంఖ్య కూడా 300కు పైగా నమోదయినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి అంతకంతకూ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఇప్పటికే చాలా రాష్ట్రాలు ఆంక్షలను కఠినతరం చేశాయి. కొన్ని రాష్ట్రాల్లో అయితే రాత్రిపూట కర్ఫ్యూను అమలు చేస్తున్నాయి స్థానిక ప్రభుత్వాలు. మరికొన్ని రాష్ట్రాలు పాఠశాలలను, ఎంటర్టైన్మెంట్ జోన్లను పూర్తిగా మూసి వేసాయి. అయినా కానీ దేశంలోని ప్రముఖ మెట్రో నగరాల్లో వైరస్ కేసులు భారీగా వెలువు చూస్తున్నాయి. ముఖ్యంగా జనసాంద్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో కేసులు కూడా ఎక్కువగా బయట పడుతున్నాయి.

దేశవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో వెలుగు చూస్తున్న వైరస్ కేసులను దృష్టిలో ఉంచుకొని తగు చర్యలను చేపడుతున్నారు. అయితే ఇప్పటికే దేశంలో మూడో వేవ్ ప్రారంభమైందని అధికారులు చెప్పారు. ఈ నేపథ్యంలోనే మరింత అప్రమత్తంగా ఉండాలని పేర్కొంటున్నారు. ఇదే సమయంలో గతంలో పాటించిన విధంగానే కొవిడ్ ప్రోటోకాల్ ను తప్పనిసరిగా పాటించాలని సూచిస్తున్నారు. అయితే ఈ మూడో వేవ్ కచ్చితంగా ఎప్పటి వరకు మన దేశంలో అల్లకల్లోలం సృష్టిస్తుంది అనే దానిపై అధికారులు పూర్తి సమాచారాన్ని ఇంతవరకూ ఇవ్వలేదు. కానీ ఐఐటీ కాన్పూర్ కు చెందిన ప్రొఫెసర్ మాత్రం మరో వారం రోజుల్లో కోవిడ్ తారాస్థాయికి చేరుతుందని అంచనా వేశారు. కేవలం ఏడు రోజుల వ్యవధిలోనే దేశంలో కేసుల సంఖ్య జీవన కాల గరిష్టానికి చేరుతుందని చెప్పారు. ప్రస్తుతం ఉన్న కేసులు కంటే రెట్టింపు కేసులు వస్తాయని అన్నారు. అంతే కాకుండా కొన్ని ప్రధాన నగరాల్లో వైరస్ కేసులు రెట్టింపు అవుతాయనే పేర్కొన్నారు. ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీతో పాటు కలకత్తా, ముంబై, అహ్మదాబాద్, బెంగళూరు లాంటి నగరాల్లో కేసులు అమాంతం పెరుగుతాయని ఆయన స్పష్టం చేశారు.

ఈ నేపథ్యంలోనే ఢిల్లీతో పాటు మహారాష్ట్ర గుజరాత్ కర్ణాటక రాష్ట్రాల్లో వైరస్ కేసుల సంఖ్య పెద్దమొత్తంలో నమోదవుతుందని ఐఐటి కాన్పూర్ కు చెందిన ప్రొఫెసర్ మణీందర్ అగర్వాల్ పేర్కొన్నారు. ఆయన వెల్లడించిన దాని ప్రకారం మహారాష్ట్ర, గుజరాత్ లలో ఈ నెల 19 వ తేదీకి కొవిడ్ కేసులు ఎన్నడూ లేని విధంగా నిర్దారణ అవుతాయని అగర్వాల్ తెలిపారు. ఢిల్లీకి సరిహద్దు రాష్ట్రం గా ఉండే హర్యానాలో కూడా ఈనెల 20వ తేదీ నాటికి కరోనా కేసుల సంఖ్య భారీగా వెలుగు చూస్తాయని ఆయన చెప్పారు. ఈ క్రమంలోనే అగర్వాల్ మరో శుభవార్త చెప్పారు. కేసుల సంఖ్య ఏ విధంగా అయితే తారా స్థాయికి చేరిందో అదే విధంగా తగ్గిపోతుందని ఆయన స్పష్టం చేశారు. కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కారణంగానే దేశంలో లక్షల కేసులు నమోదు అవుతున్నాయని తెలిపారు.

మరోవైపు దేశంలో దక్షిణాది రాష్ట్రాల్లో కూడా వైరస్ ప్రభావం గట్టిగానే ఉంటుందని మణీందర్ అగర్వాల్ తెలిపారు. ఈనెల 23వ తేదీన కర్ణాటకలో వైరస్ కేసుల సంఖ్య భారీగా నమోదవుతుందని అగర్వాల్ స్పష్టం చేశారు. అంతేకాకుండా 25వ తేదీన కేసుల సంఖ్య తమిళనాడులో జీవన కాలం గరిష్టానికి చేరుతుందని ఆయన చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో ఈనెల 30వ తేదీన వైరస్ కేసులు అత్యధికంగా నమోదు కానున్నట్లు తెలిపారు.