Begin typing your search above and press return to search.

పోలింగ్ తర్వాత కూడా డబ్బులడుగుతున్నారు

By:  Tupaki Desk   |   26 April 2019 1:30 AM GMT
పోలింగ్ తర్వాత కూడా డబ్బులడుగుతున్నారు
X
ముగిసిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపు అన్ని పార్టీల అభ్యర్థులు పది వేల కోట్లు ఖర్చు పెట్టారని.. తనకు వ్యక్తిగతంగానే 50 కోట్ల వరకు ఖర్చు వచ్చిందని అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి బాంబు పేల్చారు.. అలాగే ఓటర్లు 2 వేల ఇస్తే సంతృప్తి చెందడం లేదని.. 5 వేలు అడుగుతున్నారని ఇలా వచ్చే ఎన్నికల్లో కష్టమేనని జేసీ చేసిన వ్యాఖ్యలు అటు పొలిటికల్ సర్కిల్స్ లో ఇటు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి.. ఎన్నికల నిబంధనల ప్రకారం జేసీ మాట్లాడింది తప్పా ఒప్పా అనేది పక్కనపెడితే.. జేసి కరెక్ట్ గా మాట్లాడాడు రా అంటూ కొందరు ఎమ్మెల్యేలు కూడా అనుకుంటున్నారట.

ఈ సంగతి ఇలా ఉంచితే.. పోలింగ్ ముగిసిన తర్వాత కూడా ఎమ్మెల్యే అభ్యర్థులు గా పోటీ చే్సిన వారి ఇళ్లకు కొందరు ఓటర్లు బార్లు తీరుతున్నారట... ప్రధాన పార్టీల అభ్యర్థులు పోలింగ్‌కు ముందురోజు వరకు కొన్ని నియోజకవర్గాల్లో డబ్బులు పంచగా - పోలింగ్ రోజున కూడా మరికొన్ని నియోజకవర్గాల్లో ఓటుకు నోట్లిచ్చారు. ఈ డబ్బుల పంపిణీ సమయంలో ఇళ్లల్లో లేనివారిలో కొంతమంది పోలింగ్‌ తర్వాత ఎమ్మెల్యే అభ్యర్థులను కలిశారట. "మేము మీకే ఓటేశాం. డబ్బులు ఇవ్వాలి'' అని అడిగారట. ఈ పరిణామంతో ఆయా నేతల నోట మాట రాలేదట. గుంటూరు - కృష్ణాజిల్లాల్లోని పలు నియోజకవర్గాల్లో ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయట.. డబ్బులు పంపిణీ చేసే సమయంలో మేము లేము. ఆ తర్వాత వచ్చాం. మా ఓటు మీకే వేశాం'' అని చెప్పి డబ్బులు అడిగే కొత్త సంస్కృతి ఈ ఎన్నికల్లోనే మొదలైందని కొందరు ఎమ్మెల్యే అభ్యర్థులు వాపోతున్నారట...

ఈ నేపథ్యంలో తమ దగ్గరికి వచ్చిన వారు ఏ పార్టీకి ఓటేశారో తెలుసుకునేందుకు స్థానిక నేతలను సంప్రదిస్తున్నారట. వారు ధ్రువీకరించిన తర్వాతే సదరు వ్యక్తులకు అభ్యర్థులు డబ్బులిస్తున్నారట. రాష్ట్రంలో పోస్టల్ బ్యాలెట్‌ కు సిద్ధమైన కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు కూడా తమ ఓటును అమ్ముకున్న సందర్భాలు కోకొల్లలుగా ఉన్నాయి. మరో వైపు కొన్ని నియోజకవర్గాల్లో పోలింగ్ ముగిశాక కూడా ఓటర్లు ఏ పార్టీకి ఓట్లేశారో తెలుసుకుని కొంతమంది అభ్యర్థులు ఓటర్లకు డబ్బులు పంపిణీ చేశారట.. ఇదండీ పోలింగ్ ముగిసిన తర్వాత కూడా ఓటర్లు డబ్బు తీసుకోవడం మా హక్కు అనేలా ఎమ్మెల్యే అభ్యర్థులకు చుక్కలు చూపిస్తున్నారట...