ఏపీ శాసనమండలిలో ఉత్కంఠ..తోసుకునే వరకూ....

Wed Jan 22 2020 21:40:32 GMT+0530 (IST)

 Andhra Govt Three Capial Issue

ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ఉత్కంఠభరిత పరిణామాలకు వేదికగా నిలుస్తోంది. ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లులపై అధికార ప్రతిపక్షాలు పట్టుతో వ్యవహరిస్తున్నాయి. సీఆర్డీఏ రద్దు బిల్లుతో పాటు పాలనా వికేంద్రీకరణ బిల్లులను బిల్లును సెలక్ట్ కమిటీకి పంపాలన్న అంశంపై అధికార - ప్రతిపక్షాల మధ్య వాగ్వాదం జరిగింది. ఈ సమయంలో తోపులాట వంటి పరిస్థితులు చోటుచేసుకున్నాయి. మంత్రి బొత్స సత్యనారాయణ మాజీ మంత్రి లోకేష్ మధ్య హాట్ హాట్ గా వాదోపవాదాలు జరిగాయి.బిల్లులపై చర్చ సందర్భంగా మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ - టీడీపీ తప్ప మిగిలిన అన్ని పక్షాలు బిల్లును పరిగణనలోకి తీసుకోవాలని కోరుతున్నాయని తెలిపారు. ఛైర్మన్ బిల్లు పరిగణనలోకి తీసుకోకపోవడం సరికాదన్నారు. టీడీపీ నేతలు ఛైర్మన్ వద్దకు వెళ్లి గుసగుసలాడటమేంటని బొత్స అభ్యంతరం వ్యక్తం చేశారు. టీడీపీ సభ్యులు చెప్పినట్లు మండలి ఛైర్మన్ షరీఫ్ వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు ఇదే సమయంలో టీడీపీ సభ్యులు అభ్యంతరం తెలిపారు.  పోడియం ఎదుట బొత్స - లోకేష్ వాగ్వివాదానికి దిగారు. టీడీపీ సభ్యుల మీదకు దూసుకు వెళ్లేందుకు  కొడాలి నాని యత్నించగా నాని మీదకు దూసుకెళ్ళెందుకు టీడీపీ ఎమ్మెల్సీల ప్రయత్నించారు. దీంతో కౌన్సిల్ పదిహేను నిముషాల పాటు వాయిదా పడింది. ఇలా వాదోపవాదాలతో శాసనమండలి ఏకంగా ఐదోసారి వాయిదా పడింది. అధికార ప్రతిపక్ష సభ్యుల ఆందోళనలతో 10 నిమిషాలు వాయిదా వేశారు. ఈ నేపథ్యంలో మండలి ఛైర్మన్‌తో మంత్రులు భేటీ అయ్యారు.

అనంతరం మండలి తిరిగి సమావేశం అయింది. ఈ సమయంలో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మాట్లాడుతూ మంత్రి బిల్లును సెలక్ట్ కమిటీకి పంపాల్సిన అవసరం లేదని తెలిపారు. ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు స్పందిస్తూ  సెలక్ట్ కమిటీకి పంపాలా.. లేదా అనే విషయంపై ఓటింగ్ జరపాలని  డిమాండ్ చేశారు. కాగా ఈ బిల్లులపై మండలిలో చర్చ ముగిసింది.