ఇసుక - మద్యంపై ఏపీ కఠిన నిర్ణయం: అక‌్రమ రవాణా చేస్తే కటకటాలే

Sun May 31 2020 12:41:40 GMT+0530 (IST)

Andhra Govt On About illegal Sand and Liquor Transporation

పక్క రాష్ట్రం తెలంగాణలో ఇసుక - మద్యం విషయంలో ధరలు తక్కువగా ఉండడంతో పాటు విరివిగా లభిస్తోంది. ఆంధ్రప్రదేశ్ లో మద్యం - ఇసుకపై తీవ్ర ఆంక్షలు ఉన్నాయి. దీంతో ఏపీవాసులు తెలంగాణ వైపు కన్నేశారు. ఈ రెండింటిని అక్రమంగా తెలంగాణ నుంచి ఏపీలోకి తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. పలుచోట్ల పోలీసులు స్వాధీనం చేసుకుని వారిపై కేసులు కూడా నమోదు చేసిన విషయం తెలిసిందే. ముఖ్యంగా మద్యం తెలంగాణ నుంచి ఏపీకి అక్రమంగా పెద్దసంఖ్యలో సరఫరా అవుతోంది. దీంతో ఆ ప్రభుత్వం నివారణ చర్యలు చేపట్టింది. ఇకపై ఇసుక - మద్యం అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపనున్నట్లు స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో కమిషనర్ వినీత్ బ్రిజ్ లాల్ ప్రకటించారు. రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో ముమ్మర తనిఖీలు చేస్తూ ఇసుక - మద్యం అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా విజయవాడలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు.ఇప్పటివరకు మద్యం - ఇసుక అక్రమ రవాణా విషయంలో 485 కేసులు నమోదు చేశామని - 955 మందిపై కేసులు - 730 వాహనాలను సీజ్ చేసినట్లు వివరించారు. ఈ సందర్భంగా 29629 టన్నుల ఇసుక స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ క్రమంలోనే ఇసుక - మద్యం అక్రమ రవాణాను అరికట్టేందుకు సాంకేతిక పరిజ్ఞానం వినియోగించుకుంటున్నట్లు పేర్కొన్నారు. రాత్రివేళల్లో గస్తీని పకడ్బందీగా ఏర్పాటు చేసి మెరుపు దాడులు చేస్తున్నట్లు చెప్పారు. ఇసుక - మద్యం అక్రమ రవాణా విషయంలో ప్రభుత్వం - అధికారులు ఎన్ని చర్యలు చేపడుతున్నా - ప్రజల సహకారం తప్పకుండా ఉండాలని కోరారు.

ఇకపై ఇసుక - మద్యం అక్రమ రవాణాలో పట్టుబడితే మాత్రం ఊహించని చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పాత నేరగాళ్లు అయితే పీడీ యాక్టు ప్రయోగిస్తామని ప్రకటించారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై రౌడీషీట్స్ తెరిచే ఆలోచనలు కూడా చేస్తున్నట్టు తెలిపారు. ఈ క్రమంలోనే వారి ఆస్తులను కూడా జప్తు చేసేందుకు సిద్ధమని స్పష్టం చేశారు.