Begin typing your search above and press return to search.

ప్రధానికి ఏపీ సర్కారు రాసిన లేఖలో ఏముంది?

By:  Tupaki Desk   |   9 Aug 2020 5:00 AM GMT
ప్రధానికి ఏపీ సర్కారు రాసిన లేఖలో ఏముంది?
X
ప్రధాని నరేంద్ర మోడీకి ఏపీ ప్రభుత్వం తాజాగా ఒక లేఖ రాసింది. మూడు రాజధానులపై ఉత్సాహంగా ఉన్న జగన్ సర్కారు.. వీలైనంత త్వరగా కొత్త రాజధానిగా నిర్ణయించిన విశాఖలో శంకుస్థాపన కార్యక్రమాన్ని చేపట్టాలని భావిస్తున్నారు. ఇందులో భాగంగా ప్రధాని మోడీని ఈ కార్యక్రమానికి ఆహ్వానించాలని భావిస్తున్నారు. దీనికి సంబంధించిన ఆహ్వానం కోసం ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి ముఖ్యకార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ ఒక లేఖ రాసినట్లు చెబుతున్నారు. ప్రధాని కార్యాలయ సంయుక్త కార్యదర్శి శేషాద్రికి ఈ లేఖను రాసినట్లు సమాచారం.

అందులో మూడు కీలక అంశాల్ని ప్రస్తావించినట్లు చెబుతున్నారు. ప్రధానితో భేటీ కోసం ముఖ్యమంత్రి అపాయింట్ మెంట్ ఇవ్వాల్సిందిగా కోరినట్లు చెబుతున్నారు. దీంతో పాటు.. ఏపీలో మూడు రాజధానుల అంశాన్ని కూడా ప్రస్తావించటంతో పాటు.. శంకుస్థాపన కార్యక్రమాన్ని ఆగస్టు 16న నిర్వహించాలన్న యోచనలో ఉన్న విషయాన్ని పేర్కొన్నట్లు చెబుతున్నారు. ఇక.. మూడో అంశం పేదలకు పెద్ద ఎత్తున ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టామని.. అందులో పాల్గొనేందుకు ఆహ్వానం అందించాలన్న ఆలోచనలో ఉన్నామన్న విషయాన్ని పేర్కొన్నట్లు చెబుతున్నారు.

2022 నాటికి అందరికి సొంతంగా ఇళ్లు ఉండాలన్న ప్రధాని లక్ష్యాన్ని ఆచరణలో పెట్టేందుకు వీలుగా ఏపీ సర్కారు భారీ కార్యక్రమాన్ని చేపట్టినట్లు లేఖలో పేర్కొన్నారు. గ్రామీణ.. పట్టణ ప్రాంతాల్లోని 30 లక్షల మంది పేదలకు ఇళ్ల స్థలాల్ని పంపిణీ చేయనున్నట్లుగా వెల్లడించారు. రూ.20వేల కోట్లు వెచ్చించి 62వేల ఎకరాల్ని సమీకరించామని.. అందరికి ఇళ్ల స్థలాలు అందించాక.. 30 లక్షల మందికి ప్రధానమంత్రి ఆవాస యోజన కార్యక్రమం కింద 2022 నాటికి ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేయటం తమ లక్ష్యంగా లేఖలో పేర్కొన్నారు.

ఈ విషయాల్ని ప్రధానితో చర్చించేందుకు వీలుగా వీలైనంత త్వరగా అపాయింట్ మెంట్ ఇవ్వాలని కోరినట్లుగా చెబుతుున్నారు. ఆగస్టు 16న తాము ఈ కార్యక్రమాల్ని నిర్వహించాలన్నది లక్ష్యమని.. తర్వాత మంచి రోజులు లేవన్న విషయాన్ని లేఖలో పొందుపర్చినట్లుగా తెలుస్తోంది. మరి.. ఏపీ సర్కారు రాసిన లేఖ విషయంలో ప్రధాని మోడీ ఏ రీతిలో రియాక్ట్ అవుతారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా చెప్పక తప్పదు. గుట్టుగా రాసినఈ లేఖ వ్యవహారం మీడియాలో రావటం కూడా ఏపీ సర్కారును ఇరుకున పెట్టే అవకాశం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.