Begin typing your search above and press return to search.

చంద్ర‌బాబు మాట్లాడుతుండ‌గానే.. త‌మ్ముళ్లు సీట్లు ఖాళీ చేశారు!

By:  Tupaki Desk   |   19 Oct 2020 4:00 AM GMT
చంద్ర‌బాబు మాట్లాడుతుండ‌గానే.. త‌మ్ముళ్లు సీట్లు ఖాళీ చేశారు!
X
రాష్ట్రంలో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీకి పున‌ర్వైభ‌వం తెచ్చేదిశ‌గా ఆ పార్టీ అధినేత చంద్ర‌బాబు అనేక రూపాల్లో ప్ర‌య‌త్నాలు ప్రారంభించినా.. ఫ‌లితం ఆశించిన మేరకు క‌నిపించ‌డం లేద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రీ ముఖ్యంగా టీడీపీకి కంచుకోట‌ల వంటి జిల్లాల్లో పార్టీ ప‌రిస్థితి ఇంకా చ‌క్క‌బ‌డ‌లేదు. ఇటీవ‌ల పార్ల‌మెంట‌రీ పార్టీ జిల్లాల‌కు ఇంచార్జ్‌ల‌ను నియ‌మించినా.. పార్ల‌మెంట‌రీ జిల్లాల‌కు మ‌హిళా నేత‌ల‌ను నియ‌మించినా.. త‌మ్ముళ్ల‌లో అసంతృప్తి గూళ్లు అలానే ఉన్నాయి. ఈ నేప‌థ్యంలో వారు పార్టీ త‌ర‌ఫున నిర్వ‌హించే కార్య‌క్ర‌మాల‌కు క‌డు దూరంగా ఉండ‌డం గ‌మ‌నార్హం.


ఇదే ప‌రిణామం.. అత్యంత కీల‌క‌మైన అనంత‌పురం జిల్లా టీడీపీలోనూ క‌నిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం. పార్టీ త‌ర‌ఫున దాదాపు రెండు, రెండున్నర ద‌శాబ్దాలుగా సేవ‌లు అందిస్తూ.. పార్టీ జెండాను మోస్తున్న వారు బాబు తీరును ఎండ‌గ‌డుతున్నారు. ``అధికారంలో ఉంటే.. చంద్ర‌బాబు ప్రాధాన్యాలు వేరు. ప్ర‌తిప‌క్షంలోకి రాగానే ఆయ‌న చూపించే ప్రేమ వేరు. దీనిని ఎలా అర్ధం చేసుకోవాలి?`` అని వారు వాపోతున్నారు. ఇటీవ‌ల అనంత‌పురం జిల్లా పార్టీ శ్రేణుల‌తో చంద్ర‌బాబు జూమ్ యాప్ ద్వారా స‌మావేశం నిర్వ‌హించారు. దీనికి కీల‌క‌మైన జేసీ వ‌ర్గం దూరంగా ఉంది. ప‌రిటాల కుటుంబం నుంచి ఎవ‌రూ రాలేదు.

అయితే, ద్వితీయ, తృతీయ శ్రేణి నాయ‌కులు వ‌చ్చినా.. మ‌ధ్య‌లోనే బాబు ప్ర‌సంగాన్ని ఆపేసి వెళ్లిపోయా రు. ఈ ప‌రిణామం జిల్లా రాజ‌కీయాల్లోనే రాష్ట్ర టీడీపీలోనూ విస్తృతంగా చ‌ర్చ‌కు వ‌చ్చింది. దీంతో అస‌లు ఏం జ‌రిగింద‌ని ఆరా తీస్తే.. ‘జెండాలు మోశారు. మోస్తున్నారు. మిమ్ములను ఎన్నటికీ మరువను. పార్టీలో ప్రాధాన్యత కల్పిస్తా. గతంలో జరిగిన పొరపాటు జరగదు’ అని అనంతపురం తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలను ఉద్దేశించి టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. అంతే! ఒక్క‌సారిగా సీట్లు స‌గానికిపైగా ఖాళీ అయ్యాయి. దీనికి కార‌ణం.. బాబు త‌మ‌ను ఇంకా జెండాలు మోయ‌మ‌నే అంటున్నార‌ని.. త‌మ‌కు గుర్తింపు ఎప్పుడ‌ని త‌మ్ముళ్ల‌లో ఆగ్ర‌హం క‌ట్ట‌లు తెగ‌డ‌మేన‌ని తెలుస్తోంది.

త‌మ‌కేదో ప‌ద‌వులు ప్ర‌క‌టిస్తారు. త‌మ‌నేదో గుర్తిస్తార‌ని భావించిన తృతీయ శ్రేణి నాయ‌కులు చంద్ర‌బాబు తొలిప‌లుకుల‌తోనే హ‌తాశుల‌య్యారు. ``ఆయ‌న మాపై జెండా మోత బ‌రువును మ‌ళ్లీ పెట్టారు. ఇంక ఎన్నాళ్ల‌ని మోస్తాం. యువ‌త‌కు ప్రాధాన్యం అన్నారు. మాకు ప‌ద‌వులు అన్నారు. మొండి చేయి చూపించారు. ఇప్పుడు మ‌ళ్లీ జెండా మోయాలంటూ.. న‌మస్కారాలు పెడుతున్నారు. మేం ఏకంగా పార్టీకే న‌మ‌స్కారం పెట్టాల‌ని చూస్తున్నాం`` అని కొంద‌రు నాయ‌కులు మీడియా ముందు వ్యాఖ్యానించ‌డం సంచ‌ల‌నంగా మారింది.

గ‌త ఎన్నిక‌ల్లో గెలిచిన బాల‌య్య అందుబాటులో ఉండ‌డంలేద‌ని, ప‌య్యావుల కేశ‌వ్‌.. గ‌డ‌ప దాటి బ‌య‌ట‌కు కూడా రావ‌డం లేద‌ని.. ఈ స‌మ‌యంలో త‌మ స‌మ‌స్య‌లు వినిపించేందుకు మార్గం చూపుతార‌ని బాబుపై ఆశ‌లు పెట్టుకుంటే.. ఇంకా జెండాలు మోయాల‌నే అజెండానే ఆయ‌న ఎత్తుకోవ‌డం బాధ‌గా ఉంద‌ని త‌మ్ముళ్లు తీవ్ర అసంతృప్తి వ్య‌క్తం చేయ‌డం గ‌మ‌నార్హం. మొత్తానికి పార్టీ ప‌టిష్ట‌త‌కు చంద్ర‌బాబు ఎంతగా కృషి చేస్తున్నా.. ఫ‌లితాలు మాత్రం ఆశించిన విధంగా రావ‌డం లేద‌ని ప‌రిశీల‌కులు సైతం అంటున్నారు.