రిలయన్స్‌లోకి కొత్త వారసుడొచ్చేశాడు..

Tue May 26 2020 23:00:01 GMT+0530 (IST)

New Successor Came to Reliance

దేశంలోనే అగ్రగామి సంస్థగా రూపుదిద్దుకున్న రిలయన్స్‌లో కీలక మార్పు చోటుచేసుకుంది. ప్రముఖ పారిశ్రామికవేత్త ముకేశ్ అంబానీ తన తనయుడు అనంత్ అంబానీకి కీలక బాధ్యతలు అప్పగించారు. రిలయన్స్ సామ్రాజ్యంలోకి తన వారసుడిని తీసుకొచ్చారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ తన చిన్న కుమారుడు అనంత్ అంబానీ (25) జియో ప్లాట్‌ఫామ్స్‌లో అదనపు డైరెక్టర్‌గా రిలయన్స్ వ్యాపార సామ్రాజ్యంలోకి అడుగుపెట్టనున్నారు. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు. త్వరలోనే ప్రకటిస్తారని తెలుస్తోంది.రిలయన్స్ ఇండస్ట్రీస్ యాజమాన్యంలోని జియో ప్లాట్‌ఫామ్స్‌లో అదనపు డైరెక్టర్‌గా అనంత్ అంబానీ ఎంట్రీ ఇచ్చారని బిజినెస్ వర్గాల్లో వార్తలు హాట్ టాపిక్‌గా మారాయి. మొదటి లాక్డౌన్ ప్రకటించడానికి వారం రోజుల ముందే ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. ఐదు నెలల కిందట తన తాత రిలయన్స్ ఇండస్ట్రీస్ వ్యవస్థాపకుడు దీరూభాయ్ అంబానీ జన్మదినం సందర్భంగా అనంత్ అంబానీ ముఖ్య ఉపన్యాసం చేశారు. రిలయన్స్ కుటుంబానికి సేవ చేయడమే తన జీవితంలో అతి ముఖ్యమైన లక్ష్యమని మార్పుకు భారతదేశం నాయకత్వం వహించాలని కోరారు. ఆ మార్పులో రిలయన్స్ ముందంజలో ఉండాలని పేర్కొన్నారు. రిలయన్స్ నా జీవితం అని ఆ సందర్భంగా ప్రకటించాడు. ఆ వ్యాఖ్యలతోనే అనంత్ ఎంట్రీ ఉండబోతుందని అందరూ భావించారు. అన్నట్టుగా వచ్చేస్తున్నాడు.

ముకేశ్ అంబానీకి ఇద్దరు కుమారులు ఆకాశ్ అంబానీ అనంత్ అంబానీ కుమార్తె ఇషా. ఆకాశ్ ఇషా ఇప్పటికే వ్యాపార బాధ్యతలు చూసుకుంటున్నారు. 2014లో జియో.. రిటైల్ వ్యాపారాల బోర్డుల్లో ఇషా ఆకాశ్ డైరెక్టర్లుగా నియమితులైన విషయం తెలిసిందే. అనంత్ ఇంకా 25 ఏళ్ల పిల్లవాడు. యుక్త వయసు రావడంతో ఇప్పుడు బాధ్యతలు అప్పగించినట్లు సమాచారం. గతంలో అనంత్ అంబానీ ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్‌లలో తన తల్లి నీతా అంబానీతో కలిసి ముంబై ఇండియన్స్ మ్యాచ్‌లలో కనిపించేవాడు. అప్పట్లో ఊబకాయంతో అనంత్ బాధపడేవాడు. ఈ క్రమంలో చికిత్స పొంది అనూహ్యంగా బక్కపలచని యువకుడిగా మారిపోయాడు. 18 నెలల్లో ఏకంగా 108 కేజీలు బరువు తగ్గి అందర్నీ షాక్‌కు గురిచేశాడు. ఇప్పుడు కొత్త బాధ్యతలు త్వరలోనే స్వీకరించనున్నాడు.