రోడ్డుపై ఆక్సీజన్ సిలిండర్ తో వృద్ధురాలు.. అసలు నిజం ఇదీ!

Thu Apr 22 2021 22:46:06 GMT+0530 (IST)

An old woman with an oxygen cylinder on the road

కరోనా విలయతాండం సృష్టిస్తున్న వేళ జనాలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఆసుపత్రుల్లో బెడ్లు దొరక్క ఎంతో మంది అవస్థలు పడుతున్నారు. ఆక్సీజన్ కొరతతో అల్లాడుతున్నారు. ఎంతో మంది ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో పై ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. రోడ్డుపై ఆక్సీజన్ సిలిండర్ తో దీనంగా కూర్చున్న వృద్ధురాలి పరిస్థితిని చూసి అందరూ చలించిపోయారు.ఇలాంటి దారుణ పరిస్థితుల్లో వృద్ధురాలు ఉంటే అధికారులు ఏం చేస్తున్నారంటూ.. ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎంతో మంది షేర్ల మీద షేర్లు చేశారు. ఇంకా చేస్తున్నారు. అయితే.. ఈ ఫొటో ఇప్పటిది కాదని కరోనాకు ఈమెకు సంబంధం లేదనే విషయం తెరపైకి వచ్చింది. ఇది 2018లో తీసిన చిత్రంగా చెబుతున్నారు.

2018లో ఉత్తరప్రదేశ్ లోని ఆగ్రాలో జరిగిన సంఘటనగా చెబుతున్నారు. అప్పట్లో అనారోగ్యంతో బాధపడుతున్న ఈ వృద్ధురాలికి శ్వాస సమస్య ఎదురు కావడంతో సిలిండర్ తీసుకొచ్చారట. అంబులెన్స్ వస్తే.. అందులో ఆసుపత్రికి వెళ్లాల్సి ఉందట. అయితే.. అంబులెన్స్ ఎంతకీ రాలేదట.

దీంతో.. ఆమె ఇబ్బందిని గమనించిన కుమారుడు రోడ్డుపైనే ఆక్సీజన్ అందించారనే విషయం ఇప్పుడు వెలుగు చూసింది. సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఏ విషయమైనా ముందూ వెనకా చూడకుండా వైరల్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు కరోనా ఉగ్రరూపం ప్రదర్శిస్తుండడంతో.. ఆ హోరులో ఈ ఫొటో కూడా వైరల్ అయ్యింది.