Begin typing your search above and press return to search.

చైనా వస్తువులు వాడొద్దంటే.. అకౌంట్ బ్లాక్ చేశారా?

By:  Tupaki Desk   |   7 Jun 2020 4:56 AM GMT
చైనా వస్తువులు వాడొద్దంటే.. అకౌంట్ బ్లాక్ చేశారా?
X
గడిచిన కొంతకాలంగా వినిపిస్తున్న డిమాండే. ఇటీవల మరింత జోరందుకున్న డిమాండ్ .. చైనా వస్తువుల్ని కొనద్దని. కేంద్రప్రభుత్వం సైతం స్వదేశీ వస్తువుల్ని కొనుగోలు చేయాలని స్వయంగా చెబుతున్న వేళ.. దేశంలోని అతి పెద్ద డెయిరీ కంపెనీ అమూల్ కు ఊహించని షాక్ తగిలింది. ఆ కంపెనీ ట్విట్టర్ ఖాతా బ్లాక్ అయ్యింది. దీనికి కారణం ఇటీవల పెట్టిన ఒక పోస్టుగా చెబుతున్నారు. అమూల్ లాంటి ప్రఖ్యాత కంపెనీ ట్విట్టర్ ఖాతాను బ్లాక్ చేయాల్సిన అవసరం ఏమొచ్చిందన్న వివరాల్లోకి వెళితే.. బయటకొస్తున్న వివరాలు ఆసక్తికరంగా మారాయి.

చైనా వస్తువుల్ని బాయ్ కాట్ చేయాలన్న పోస్టును సమర్థిస్తూ.. అమూల్ తన ట్విట్టర్ ఖాతాలో ఒక పోస్టును పెట్టింది. అమూల్ టాపికల్: అబౌట్ ది బాయ్ కాట్ ఆఫ్ చైనీస్ ప్రొడక్ట్స్ అనే క్యాప్షన్ తో ఈ నెల మూడున తన ట్విట్టర్ ఖాతాలో ఒక ట్వీట్ ను పోస్టు చేసింది. అనూహ్యంగా తర్వాతి రోజున ఆ కంపెనీ ట్విట్టర్ ఖాతా బ్లాక్ అయినట్లు గుర్తించారు. ఈ విషయాన్ని గుర్తించిన కొందరు నెటిజన్లు.. అమూల్ కు ఈ విషయాన్ని తెలియజేశారు.

దీంతో రంగంలోకి దిగిన అమూల్.. ట్విట్టర్ ను సంప్రదించారు. తమ ఖాతా డీయాక్టివేషన్ కు కారణం ఏమిటన్న వివరణను అడిగే ప్రయత్నం చేసింది. ఒక రోజు వ్యవధిలో తిరిగి ట్విట్టర్ ఖాతాను పునరుద్ధరించినట్లు అమూల్ ఎండీ ఆర్ఎస్ సోధి వెల్లడించారు. సాంకేతిక కారణాలతోనే అకౌంట్ బ్లాక్ అయ్యిందే తప్పించి.. ట్వీట్ చేసిన పోస్టు అంశం కారణం కాదన్న విషయాన్ని ట్విట్టర్ తమకు చెప్పినట్లు సోధీ పేర్కొన్నారు.

ఒకవేళ అదే నిజమైతే.. సదరు సాంకేతిక కారణం ఏమిటో ట్విట్టర్ ఎందుకు ప్రకటన జారీ చేయలేదన్న మాట వినిపిస్తోంది. ఇటీవల చైనా యాప్స్ ను వినియోగించొద్దంటూ విడుదల చేసిన యాప్ ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి తొలగించటం.. భారత టిక్ టాక్ గా చెప్పే మింత్రోను సైతం గూగుల్ ప్లే స్టోర్ లో తీసేసిన వేళలోనే.. అమూల్ అంశం తెర మీదకు రావటం గమనార్హం.ఏమైనా ఇటీవల అమూల్ ఎపిసోడ్ లో ట్విట్టర్ స్పందించిన తీరు సరిగా లేదన్న మాట వినిపిస్తోంది.