అమరావతి టూ హైదరాబాద్.. 'రియల్' ఢమాల్!

Sun Feb 28 2021 17:20:09 GMT+0530 (IST)

Amravati to Hyderabad

రాష్ట్ర విభజన తర్వాత చాలా మంది ఏపీవాసులు నవ్యాంధ్రకు తరలివచ్చారు. వారిలో మెజారిటీగా ఉద్యోగులు రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఉన్నారు. వీరిలో రియల్ వ్యాపారులు అమరావతి చుటుపక్కల పెట్టుబడులు పెట్టారు. ఉద్యోగులు అందులో ప్లాట్లు కొన్నారు. అయితే.. మారిన పరిస్థితుల నేపథ్యంలో పక్క చూపులు చూస్తున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. వీరిలో కొందరు అమరావతి టూ హైదరాబాద్ టికెట్ తీసుకునేందుకు చూస్తుండగా.. మరికొందరు ఇతర ప్రాంతాల్లో బిజినెస్ చేయడానికి ప్రయత్నిస్తున్నారని సమాచారం.రాష్ట్రంలో వ్యవసాయం తర్వాత అత్యధికులు ఆధారపడే రంగం రియల్ ఎస్టేట్. ఈ రంగం ఇప్పుడు డీలా పడిపోయిందని అంటున్నారు. ఈ రంగం దెబ్బతినడానికి ఇసుక విధానం ఒక కారణంగా చెబుతున్నారు. నూతన విధానం ద్వారా.. ఇసుక ధరలు రెండు మూడింతలు పెరిగాయని చెబుతున్నారు. అంతకుముందు లారీ ఇసుక రూ.6 7వేలకు లభిస్తే.. ఇప్పుడు రూ.20 వేలైందంటున్నారు వ్యాపారులు.

ఇక మూడు రాజధానుల నిర్ణయం కూడా రియల్ వ్యాపారంపై ప్రభావం చూపిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. విశాఖకు ఎగ్జిగ్యూటివ్ రాజధాని తరలిస్తున్నామని ప్రభుత్వం చెప్పినప్పటికీ.. అక్కడ పెద్దగా రియల్ వ్యాపారం పెరగలేదని అంటున్నారు. ఇటు కర్నూల్ న్యాయరాజధానిగా చెప్పినా.. ఇక్కడా స్థిరాస్థి రంగానికి పెద్దగా ఊపు వచ్చిన దాఖలాలు కనిపించట్లేదు. ఇక అమరావతి పరిసరాలతోపాటు గుంటూరు రాజమండ్రి ఏలూరు తదితర నగరాల్లోనూ రియల్  వ్యాపారంలో పురోగతి లేదంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అమరావతిని వదిలి మళ్లీ హైదరాబాద్ వెళ్లడమే మేలని భావిస్తున్నారట చాలా మంది. కర్ణాటకలో వ్యవసాయ భూములు ఎవరైనా కొనుగోలు చేయవచ్చంటూ ఇటీవల చట్ట సవరణ చేసిన నేపథ్యంలో.. మరికొందరు ఆ రాష్ట్రానికి వెళ్లిపోతున్నారని తెలుస్తోంది. ఇప్పటికే పలువురు వెళ్లిపోయారని సమాచారం.

దీంతో.. నిర్మాణ రంగంపై భారీగా ప్రభావం చూపిందని చెబుతున్నారు నిపుణులు. ఇది కూలీల ఉపాధిపై పెను ప్రభావం చూపుతోందని అంటున్నారు. నిర్మాణాలు కొత్త వెంచర్లు తగ్గిపోవడంతో.. వారికి పని కరువైంది. కేవలం కూలీలే కాకుండా.. నిర్మాణరంగంపై ఆధారపడిన పునాదులు తవ్వేవారి నుంచి.. వడ్రంగి ఎలక్ట్రీషియన్ టైల్స్ గ్రానైట్ వేసేవాళ్లు ప్లంబర్ పెయింటర్లు  రెయిలింగ్ చేసేవాళ్ల వరకు ఇలా.. నిర్మాణ రంగంపై ఆధారపడిన దాదాపు లక్షలాది మంది సరైన ఉపాధి దొరకక సతమతం అవుతున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

అయితే.. ఉద్యోగాలు ఉపాధి అంశంతోపాటు.. తమ సొంత రాష్ట్రం అనే మమకారంతో నవ్యాంధ్రకు తిరిగి వచ్చిన వారు కూడా చాలా మంది ఉన్నారు. ఇక తమ రాష్ట్రంలోనే ఉండిపోవాలని ఇక్కడే సెటిల్ కావాలని అనుకున్నవారిలో చాలా మంది రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెట్టారు. మరికొందరు పిల్లల కోసం అని స్థలాలు కొన్నారు. ప్రధానంగా.. విజయవాడ గుంటూరు రాజమహేంద్రవరం విశాఖపట్నం అనంతపురం తిరుపతి వంటి నగరాల్లో మెజారిటీ పెట్టుబడులు పెట్టారు. అయితే.. స్థిరాస్థి రంగంలో పెద్దగా పురోగతి లేకపోవడంతో.. చాలా మంది తిరిగి హైదరాబాద్ వెళ్లిపోవాలని చూస్తున్నారనే ప్రచారం సాగుతోంది.