బీజేపీ లాంటి బడా పార్టీ.. అమిత్ షా లాంటి పెద్దమనిషి ఆదర్శాలు ఇవేనా?

Tue Aug 04 2020 20:30:58 GMT+0530 (IST)

Amit Shah tests positive for COVID 19

నోరు తెరిస్తే చాలు ఆదర్శాలతో ఉక్కిరిబిక్కిరి చేసే అలవాటు కమలనాథుల్లో కొట్టొచ్చినట్లుగా కనిపిస్తుంది. తాము చెప్పే మాటలకు.. చేసే పనులకు ఏ మాత్రం పోలిక ఉండదన్న విషయం తాజాగా చోటు చేసుకున్న పరిణామాన్ని చూస్తే ఇట్టే అర్థం కాక మానదు. దేశంలోని అత్యంత శక్తివంతమైన వ్యక్తుల్లో ఒకరు కేంద్ర హోం శాఖామంత్రి అమిత్ షా. అలాంటి ఆయనకు కరోనా లాంటి వైరస్ కమ్మేస్తే.. ఏం చేయాలి? దేశంలోనే అత్యుత్తమ ఆసుపత్రిగా చెప్పే ఎయిమ్స్ కు వెళ్లకుండా ప్రైవేటు ఆసుపత్రికి తరలించటం ఏమిటి? అన్నది ప్రశ్నగా మారింది.ఈ వ్యవహారంపై విపక్షాలు సైతం విరుచుకుపడుతున్నాయి. ప్రభుత్వ సంస్థలు ప్రజల నమ్మకాన్ని పొందాలంటే.. ప్రముఖులు వాటి సేవల్ని ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ విషయంలో అమిత్ షా తీరును పలువురు తప్ప పడుతున్నారు. కరోనా సోకినంతనే అమిత్ షా.. ప్రభుత్వ ఆసుపత్రికి కాకుండా ప్రైవేటు ఆసుపత్రికి తరలించటంపైపలువురు తప్పు పడుతున్నారు.

సాక్ష్యాత్తు కేంద్ర హోంమంత్రి అనారోగ్యానికి గురైనప్పుడు ఎయిమ్స్ కు వెళ్లకపోవటాన్ని పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి ఒక్క అమిత్ షా మాత్రమే కాదు.. బీజేపీకి చెందిన ప్రముఖులు పలువురు తమకు కరోనా సోకినంతనే ప్రభుత్వ ఆసుపత్రుల్ని వదిలి ప్రైవేటు. కార్పొరేట్ ఆసుపత్రుల బాట పట్టటం గమనార్హం.

కర్నాటక ముఖ్యమంత్రి యడియూరప్ప.. తమిళనాడు గవర్నర్ బన్వరిలాల్ పురోహిత్.. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్.. తదితరులు ప్రైవేటు ఆసుపత్రుల్లో చేరటం గమనార్హం. తెలంగాణ.. ఆంధ్రప్రదేశ్ కు చెందిన అధికారపార్టీ నేతలు పలువురు కరోనా పాజిటివ్ అయిన వెంటనే.. ప్రైవేటు ఆసుపత్రులకు తరలి వెళ్లటం చూస్తే.. సర్కారీ వైద్యం విషయంలో నేతలు.. ప్రముఖులకు ఉన్న నమ్మకానికి హేట్సాప్ చెప్పాల్సిందే. ఏటా వేల కోట్ల ప్రజా ధనాన్ని సర్కారీ దవాఖానాలకు ఖర్చు చేయటం ఎందుకంట? అన్న ప్రశ్న మదిలో మెదలక మానదు.