Begin typing your search above and press return to search.

బీజేపీలో కరోనా కల్లోలం..వరుస బెట్టి ముఖ్య నేతలకు పాజిటివ్

By:  Tupaki Desk   |   4 Aug 2020 5:30 AM GMT
బీజేపీలో కరోనా కల్లోలం..వరుస బెట్టి ముఖ్య నేతలకు పాజిటివ్
X
దేశంలో కరోనా కల్లోలం తీవ్రమైంది. రోజుకు వేలకొలది పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ప్రజా ప్రతినిధులు, నాయకులు వ్యాధి సోకుతున్న వారిలో అధికంగా వున్నారు. అయితే కోవిడ్ బారిన పడుతున్న వారిలో బీజేపీ నాయకులు అధిక సంఖ్యలో ఉండటంతో ఆ పార్టీ అధిష్టానం ఆందోళన చెందుతోంది. ఏకంగా కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షాకు కూడా కరోనా సోకింది. ఆ పార్టీ ప్రముఖుల్లో ముందు మధ్య ప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ కు కోవిడ్ సోకగా ఆయన ఐసోలేషన్ లో ఉన్నారు.

ఆ తర్వాత ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన విద్యా శాఖ మంత్రి కమలా రాణి కరోనా మహమ్మారి బారిన పడి మృతి చెందింది. ఏపీలో సీనియర్ బీజేపీ నాయకుడు మాణిక్యాలరావుకు కూడా కరోనా తేలగా ఆస్పత్రిలో చేరారు. ఆయన పరిస్థితి విషమించినట్లు ముందే వార్తలు రాగా తాను ఆరోగ్యంగానే ఉన్నట్లు మాణిక్యాలరావు ప్రకటించారు. ఆ తర్వాత ఆయన వ్యాధి కారణంగా ఆకస్మికంగా మృతి చెందారు. ఇప్పుడు సాక్షాత్తు కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షాకు కోవిడ్ సోకడంతో పార్టీ పెద్దలు ఆందోళన చెందుతున్నారు.

అమిత్ షాను కలిసిన కేంద్ర మంత్రులు రవి శంకర్, బాబుల్ సుప్రియో సెల్ఫ్ ఐసోలేషన్ కు వెళ్లిపోయారు. ఇలాంటి పరిస్థితుల్లో కర్ణాటక సీఎం యడ్యూరప్ప కరోనా బారిన పడటం కలవరపరుస్తోంది. సీఎంని కలిసిన ప్రముఖులంతా కరోనా పరీక్షలు చేయించుకుంటున్నారు. స్వీయ నిర్బంధం పాటిస్తున్నారు. యడ్యూరప్ప కుమార్తెకు కూడా పాజిటివ్ తేలింది. వరుస బెట్టి పార్టీ ప్రముఖులంతా కరోనా బారిన పడుతుండటంతో అధిష్టానం పెద్దలు తలలు పట్టుకుంటున్నారు.