Begin typing your search above and press return to search.

అమిత్ షా కు లీకుల షాకిస్తున్న బీజేపీ

By:  Tupaki Desk   |   14 Jun 2018 9:07 AM GMT
అమిత్ షా కు లీకుల షాకిస్తున్న బీజేపీ
X
బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాకు చిత్ర‌మైన అనుభ‌వం ఎదుర‌వుతోంద‌ని తెలుస్తోంది. 2019 సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఇటీవలే బీజేపీ ప్రారంభించిన ‘మద్దతు కోసం కలుసుకోవడం’ (సంపర్క్‌ సే సమర్థన్‌) కార్యక్రమంలో భాగంగా అమిత్‌షా ఫాలో అవ్వాల‌న్న ప్ర‌తిపాద‌న ఆయ‌న‌కే బూమ‌రాంగ్ అయిందంటున్నారు. సంపర్క్ సే సమర్థన్ కార్యక్రమంలో భాగంగా ప్ర‌ముఖుల‌తో స‌మావేవం అయి నాలుగేళ్ల‌లో ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ సార‌థ్యంలోని స‌ర్కారు చేసిన ప‌నుల‌ను వివ‌రించాల‌ని నిర్ణ‌యించుకున్నారు. ఇందులో భాగంగా 25 మంది ప్ర‌ముఖుల‌ను క‌ల‌వ‌డం ల‌క్ష్యంగా పెట్టుకోగా అమిత్‌ షా ఇప్ప‌టివ‌ర‌కు 11 మందిని క‌లిశారు. అయితే మిగ‌తా వారికి క‌లిసే విష‌యంలో ట్విస్ట్ ఎదురైంది.

ఓట‌ర్ల‌ను ప్ర‌భావితం చేయ‌గ‌ల ప్ర‌ముఖుల‌ను క‌లిసే క్ర‌మంలో అమిత్ షా స‌హా ఇత‌ర నాయ‌కులు కొంద‌రి జాబితాను సిద్ధం చేసుకున్నారు. అయితే ఈ జాబితా విష‌యంలో బీజేపీలో ఆశ్చ‌ర్య‌క‌ర ప‌రిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ప్ర‌ముఖుల‌ను క‌ల‌వ‌డం త‌ప్ప‌నిస‌రి అయిన నేప‌థ్యంలో నాయ‌కులు ఒక‌రి జాబితాలో ఉన్న వివ‌రాల‌ను మ‌రొక‌రు తీసుకుంటున్నార‌రి స‌మాచారం. ఈ ప‌రిణామంతో క‌ష్ట‌ప‌డి వివ‌రాలు సేక‌రించిన వారికి షాకులు ఎదుర‌వుతున్నాయట‌. అందుకే వివ‌రాలు తెలియ‌కుండా జాబితాల‌ను గోప్యంగా ఉంచుతున్నార‌ని తెలుస్తోంది. మొత్తంగా స‌ర్కారు ప‌థ‌కాల‌ను ప్ర‌చారం చేసే కార్య‌క్ర‌మం కాస్త ఆ పార్టీలోని లుక‌లుక‌ల‌ను వివ‌రిస్తోంది.

ఇదిలాఉండ‌గా...సంప‌ర్క్ సే స‌మ‌ర్థ‌న్ కార్య‌క్ర‌మంలో భాగంగా బీజేపీ మిత్రపక్షాలు తమ గొంతు విన్పించేందుకు అవకాశం కల్పించింది. వాటితో ఉన్న చిన్నపాటి విభేదాలను పరిష్కరించుకునే అవకాశాన్ని సృష్టించుకుంది. వాటిల్లో ఉన్న అసంతృప్తిని దూరం చేసే ప్రయత్నాలకు వీలు కల్పిస్తోంది. బీజేపీ అధికారంలో ఉన్న చోట, బలంగా ఉన్న రాష్ట్రాల్లో బీజేపీ కాస్తంత బెట్టు చేసే అవకాశం ఉంది. ఇతర రాష్ట్రాల్లో మాత్రం మిత్ర పక్షాల ఒత్తిళ్ళకు బీజేపీ కాస్తంత లొంగుబాటు ప్రదర్శించక తప్పని పరిస్థితి ఏర్పడింది. మొత్తం మీద చూస్తే ఈ దఫా జాతీయ స్థాయిలో కంటే కూడా ఆయా రాష్ట్రాల్లో ఎక్కడికక్కడ పొత్తులు కీలకం కానున్నాయి.