జగన్ భేటి.. ఆ విషయంలో అమిత్ షా ఫుల్ ఖుషీ

Tue Oct 22 2019 19:09:45 GMT+0530 (IST)

ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రెండు రోజుల ఢిల్లీ పర్యటన దిగ్విజయంగా పూర్తయింది. అంతే కాదు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సీఎం జగన్ భేటీ ఫలప్రదం అయింది. ఇంతకాలం ఢిల్లీకి వెళ్ళిన ప్రతిసారి సీఎం జగన్ రిక్తహస్తాలతో వస్తున్న జగన్ కు ఈ సారి మాత్రం తన పర్యటను విజయవంతంగా ముగించుకోవడం పట్ల వైసీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. అయితే సీఎం జగన్ భేటి తరువాత హోంమంత్రి అమిత్ షా ఎక్కడా లేని ఆనందంతో ఉన్నట్టు తెలుస్తోంది.జగన్ పలు అంశాలు చెపుతున్న సందర్భంలో ఎంతో ప్రశాంతంగా విన్న అమిత్ షా.. తన సంతోషాన్ని ఆపుకోలేక పోయారని సమాచారం. ఇంతకు అమిత్ షాతో జగన్ భేటి సందర్భంగా ఏ విషయం పై లోతుగా చర్చించారు. అమిత్ షా ఏ విషయంలో ఫుల్ హ్యాపీగా ఉన్నారంటే.... అమిత్ షాతో భేటీ అయిన జగన్ ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరారట. దీనిపై అమిత్ షా ఆచితూచి మాట్లాడరట. ఇక జాతీయ ప్రాజెక్టు అయిన పోలవరం ప్రాజెక్టు పనుల్లో రివర్స్ టెండరింగ్ ప్రక్రియ ద్వారా రూ. 838 కోట్ల ప్రజాధనాన్ని ఆదా చేశామని అమిత్ షాకు జగన్ తెలిపారు.

హెడ్ వర్క్స్ - హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టులో రూ. 780 కోట్లు - టన్నెల్ పనుల్లో రూ. 58 కోట్లు ఆదా అయిన విషయాన్ని వివరించారు. పోలవరం రివర్స్ టెండర్ విధానంపై అమిత్ షా సీఎం జగన్ కు అభినందనలు తెలిపారు. రూ. 838 కోట్ల రూపాయల ప్రజాధనం ఆదాపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు. పోలవరం పై  ఇలాగే  ముందుకు వెళ్లాలని అమిత్ షా సూచించారు. ఇక తన పుట్టిన రోజు కావడంతో కేంద్ర మంత్రులు - అధికారులు తరలివచ్చినా సీఎం జగన్ తో అమిత్ షా ఏకంగా 45 నిమిషాల పాటు సమావేశమయ్యారు.

ఏపీ అభివృద్ధికి పూర్తిస్థాయిలో సహకరిస్తానని ఈ సందర్భంగా అమిత్ షా  భరోసా ఇచ్చారు. ఏపీ సమస్యలపై తాను ఇతర శాఖల మంత్రులతో మాట్లాడతానని అమిత్ షా హామీనిచ్చారు. ఆ తర్వాతనే మంత్రులను కలవాలని ఆయన సీఎం జగన్ కు సూచించారు. జగన్ అమిత్ షా భేటీ  సుహృద్భావ వాతావరణంలో రాజకీయాలకు అతీతంగా ఏపీ సమస్యలపై సానుకూల చర్చ జరిగింది. భేటీలో సీఎం జగన్ వెంట ఎంపీలు విజయసాయిరెడ్డి - మిథున్ రెడ్డి - మర్గాని భరత్ - నందిగం సురేశ్ - రఘురామకృష్ణంరాజు - వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఉన్నారు.