ప్రతిపక్షాలు అదిరిపోయే చాలెంజ్ విసిరిన అమిత్ షా

Tue Jan 21 2020 18:39:31 GMT+0530 (IST)

Amit Shah Challenges Opposition Parties Over CAA

పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) - జాతీయ పౌర జాబితా (ఎన్నార్సీ)పై కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని టార్గెట్ చేస్తూ విపక్షాలు ఆందోళనలు కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. గతవారం కాంగ్రెస్ నేతృత్వంలో ఢిల్లీలో ప్రతిపక్ష పార్టీల సమావేశం జరిగింది. దాదాపు 20 పార్టీలకు చెందిన నేతలు దీనికి హాజరయ్యారు. ఈ సందర్భంగా  కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ మాట్లాడుతూ.. ప్రధానమంత్రి నరేంద్రమోదీ - కేంద్ర హోంమంత్రి అమిత్ షా పౌరసత్వ సవరణ చట్టం - జాతీయ పౌర జాబితాపై అవాస్తవాలను ప్రచారం చేస్తూ - ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. అయితే ఈ కామెంట్లపై అమిత్ షా ఘాటుగా స్పందించారు. ఎక్కడైనా చర్చకు సిద్ధమంటూ సవాల్ విసిరారు.ఢిల్లీ ఉత్తరప్రదేశ్ లో పోలీసుల ప్రవర్తన క్రూరంగా ఉందని... మొత్తంగా తాము ప్రజలకు రక్షణ కల్పించలేమని - పాలించడం చేతకాదని మోదీ-అమిత్ షా నిరూపించుకుంటున్నారని సోనియాగాంధీ ఎద్దేవా చేశారు. సీఏఏకు నిరసనగా భారీ ర్యాలీలు - హింసాత్మక ప్రదర్శనలు జరుగుతున్న రాష్ట్రాల్లో యూపీ కూడా ఒకటి అనే సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో...తాజాగా ఉత్తరప్రదేశ్ వేదికగా విపక్షాలకు అమిత్షా క్లారిటీ ఇచ్చారు. ముస్లిం జనాభా ఎక్కువగా ఉన్న లక్నోలో గతవారం నుంచి ఆందోళనలు జరగుతున్నాయి. ర్యాలీలో ప్రసంగించిన ఆయన.. రాహుల్ గాంధీ - మమతా బెనర్జీ వంటివారు ఈ చట్టం మీద చర్చకు రావాలని సవాల్ విసిరారు.

ప్రతిపక్షాల కళ్ళు ఓటు బ్యాంకు రాజకీయాల ముసుగుతో కప్పబడిపోయాయని - కాంగ్రెస్ - సమాజ్ వాదీ పార్టీ వంటివి అసత్యాలు చెబుతున్నాయని అమిత్ షా ఆరోపించారు. పాకిస్థాన్ నుంచి అక్రమ వలసలు - తీవ్రవాదం ఇన్నేళ్ళుగా ఈ దేశంలోకి ‘చొరబడుతున్నా’..కాంగ్రెస్ పార్టీ పట్టించుకోలేదని అమిత్ ఆరోపించారు. అలియా - మలియా - జమాలియాలు ఇక్కడికి వచ్చి బాంబులు పేల్చుతున్నా ‘ మౌనీబాబా’ మన్మోహన్ సింగ్ ఒక్క మాట కూడా మాట్లాడలేదని అమిత్ షా విమర్శించారు. ఒకరి పౌరసత్వాన్ని లాక్కునే నిబంధన ఈ బిల్లులో ఒక్కటైనా ఉందేమో చూపండి అని డిమాండ్ చేశారు. `మమతా దీదీ - మాయావతిజీ.. అఖిలేష్ జీ.. ఈ దేశంలో ఎక్కడైనా సరే.. సీఏఏపై  చర్చకు రావాలని ఛాలెంజ్ చేస్తున్నా`` అని  అమిత్ షా సవాల్ విసిరారు.