Begin typing your search above and press return to search.

కరోనా వేళ షా ఎంట్రీ...సోనియాపై పంచ్ లే పంచ్ లు

By:  Tupaki Desk   |   2 April 2020 5:30 PM GMT
కరోనా వేళ షా ఎంట్రీ...సోనియాపై పంచ్ లే పంచ్ లు
X
అమిత్ షా... కీలక సమయంలో బీజేపీకి జాతీయ అధ్యక్షుడిగా పనిచేసి, తాజాగా నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర కేబినెట్ లో కేంద్ర హోం శాఖ మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన అమిత్ షా చాలా కాలంగా కనిపించడమే లేదు. దేశంలో కరోనా కల్లోలం రేగిన వేళ... అమిత్ షా అస్సలు కనిపించనే లేదు. అమిత్ షా అసలు ఇలాంటి కీలక తరుణంలో ఎందుకు బయటకు రావడం లేదన్న వాదనలు కూడా వినిపించాయి. అయితే ఈ విమర్శలేమీ పట్టించుకోకుండా చాలా కాలంగా మీడియాకు దూరంగా ఉంటున్న షా... గురువారం బయటకు వచ్చారు. వచ్చీ రాగానే... కరోనా కట్టడి కోసం తమ ప్రభుత్వం చేపడుతున్న చర్యలను వివరిస్తూనే విపక్ష కాంగ్రెస్ పార్టీపైనా, ఆ పార్టీ అధినేత్రి సోనియా గాంధీపైనా ఓ రేంజిలో ఫైరయ్యారు. కరోనా మహమ్మారిపై యావత్తు దేశం పోరాటం చేస్తోంటే... కాంగ్రెస్ పార్టీ చిల్లర రాజకీయాలు చేస్తోందని ఓ రేంజిలో ధ్వజమెత్తిన షా... ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రజలను తప్పుదోవ పట్టించడం మాని... దేశ ప్రయోజనాల కోసం పనిచేయాలని సోనియాకు హితవు చెప్పారు.

మొత్తంగా చాలా కాలం తర్వాత ఎంట్రీ ఇచ్చిన అమిత్ షా... వచ్చీ రాగానే ఇలా సోనియా గాంధీపైనా, కాంగ్రెస్ పార్టీ వైఖరిపైనా నిప్పులు చెరగడం నిజంగానే ఆసక్తి రేకెత్తిస్తోంది. అయినా సోనియాపై అమిత్ షా ఈ రేంజిలో పంచ్ లు సంధించడానికి దారి తీసిన పరిస్థితులు ఏమిటన్న విషయానికి వస్తే... దేశంలో కరోనా కట్టడి కోసం మోదీ సర్కారు మూడు వారాల పాటు దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ను ప్రకటించింది. ఈ లాక్ డౌన్ ఇప్పటికే ఓ వారం పాటు పూర్తి కాగా... ఇంకో రెండు వారాల పాటు కొనసాగనుంది. ఈ నెల 14న లాక్ డౌన్ గడువు ముగియనుంది. అంటే లాక్ డౌన్ సగం రోజులు కూడా పూర్తి కాకుండానే... బుధవారం ఎంట్రీ ఇచ్చిన సోనియా గాంధీ... మోదీ సర్కారు లాక్ డౌన్ ను అమలు చేస్తున్న తీరుపై ఆరోపణలు గుప్పించారు. సరైన ప్రణాళిక లేకుండానే మోదీ సర్కారు లాక్ డౌన్ అమలు చేస్తోందని, దీంతో పేదలు నానా ఇబ్బందులు పడుతున్నారని బుధవారం జరిగిన సీడబ్ల్యూసీ వీడియో కాన్ఫరెన్స్ లో సోనియా విరుచుకుపడ్డారు.

సోనియా గాంధీ నుంచి ఈ తరహా విమర్శలు వినిపించిన మరునాడే... గురువారం రంగంలోకి దిగిన అమిత్ షా తనదైన శైలిలో కాంగ్రెస్ పార్టీ వైఖరిని తూర్పారబట్టారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని దేశం... కరోనా మహమ్మారిపై పోరాడుతోందని, ఈ క్రమంలో 130 కోట్ల మంది ఒక్కటయ్యారని అమిత్ షా పేర్కొన్నారు. ఈ సమయంలో కాంగ్రెస్ పార్టీ చిల్లర రాజకీయాలు చేస్తోందని ఆయన మండిపడ్డారు. ఇలాంటి పరిస్థితుల్లో దేశ ప్రజలను తప్పుదో పట్టించడం సరికాదని కూడా షా వ్యాఖ్యానించారు. జాతి ప్రయోజనాల కోసం ఆలోచించాలని సూచించిన అమిత్ షా... సోనియా గాంధీ, ఆమె నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ ఇప్పటికైనా జాతి ప్రయోజనాలను గుర్తించి అందుకు అనుగుణంగా వ్యవహరించాలని సూచించారు. మొత్తంగా కరోనా వేళ... మోదీ సర్కారుపై విమర్శలు చేసిన సోనియా గాంధీ, కాంగ్రెస్ పార్టీ... అమిత్ షా చేతిలో ఇలా బుక్కైపోయిందన్న మాట.