అమెరికా హెచ్చరిక... గాలి ద్వారా కూడా కరోనా

Sun May 09 2021 21:09:19 GMT+0530 (IST)

American warning  Corona even by air

యావత్తు ప్రపంచ దేశాలను హడలెత్తిస్తున్న కరోనా మహమ్మారి గాలి ద్వారా సోకదని ఇప్పటిదాకా అనుకుంటున్నాం కదా. అయితే అదంతా ఒట్టి మాటేనట. గాలి ద్వారా కూడా కరోనా ఒకరి నుంచి మరొకరికి సోకుతుందట. ఈ దిశగా ఇప్పటికే *ద లాన్సెట్* జర్నల్ తేల్చి చెప్పిన సంగతి తెలిసిందే. తాజాగా అగ్రరాజ్యం అమెరికాకు చెందిన సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) కూడా ఇదే విషయాన్ని మరింత వివరంగా విపులంగా తేల్చి చెప్పింది. గాలి ద్వారా కూడా కరోనా ఒకరి నుంచి మరొకరికి సోకుతుందని ఇందుకు సంబంధించి మరింత మేర స్పష్టతను ఇస్తూ సీడీసీ తాజాగా ఓ హెచ్చరికను జారీ చేసింది. భౌతిక దూరాన్ని పాటిస్తూ ముఖానికి మాస్క్ వేసుకుంటే... కరోనాను దూరంగా పెట్టేయొచ్చన్న మన భావనలను పటాపంచలు చేస్తూ సీడీసీ సంచలన విషయాలను వెల్లడించింది. అంతేకాకుండా గాలి ద్వారా ఏ రీతిన కరోనా సంక్రమిస్తుందన్న విషయాన్ని కూడా సీడీసీ కాస్తంత వివరంగానే వెల్లడించింది.
గాలిలో మానవుల శ్వాసకు సంబంధించిన శ్వాసకోశ బింధువులతో పాటు ఏరోసాల్ కణాలు కూడా గాలిలో ఉంటున్న సంగతి తెలిసిందే. ఈ బింధువుల ద్వారానే కరోనా వైరస్ ను వ్యాపింపజేస్తున్నట్లుగా సీడీసీ తెలిపింది. ఇందుకు సంబంధించి కరోనా సంక్రమణ వైనాన్ని కూడా సీడీసీ కాస్తంత డీటైల్ గానే వెల్లడించింది. మనం గాలిని పీల్చి వదిలే సమయంలో శ్వాసకోశ బింధువులు బయటకు వెళతాయి కదా. ఇలాంటి శ్వాసకోశ బింధువులు కేవలం గాలి వదిలే సమయంలోనే కాకుండా మాట్లాడుతున్నప్పుడు పాడుతున్నప్పుడు ఎక్సర్ సైజులు చేస్తున్నప్పుడు దగ్గుతున్నప్పుడు కూడా మన నుంచి విడుదలవుతాయిన. వీటిలో కొన్ని బింధువులు కేవలం కొన్ని సెకన్ల నుంచి నిమిషాల వ్యవధిలోనే మాయమైపోతే... మరికొన్ని బింధువులు మాత్రం కొన్ని నిమిషాల వ్యవధి నుంచి గంటల తరబడి గాల్లోనే ఉండిపోతాయి. ఈ తరహా బింధువుల ద్వారా కరోనా వైరస్ ఒకరి నుంచి మరొకరికి సోకుతుందట.

ఇలా కరోనా బారిన పడిన వ్యక్తుల నుంచి గాలిలోకి వచ్చేసే శ్వాసకోశ బింధువులు ఏరోసాల్ కణాలు అలా కొంతకాలం పాటు గాలిలోనే ఉండిపోతాయి. ఈ శ్వాసకోశ బింధువులు ఏరోసాల్ కణాలు మనం గాలి పీల్చుకునే సమయంలో మన శరీరంలోకి చేరిపోతాయి. వెరసి గాలి ద్వారానే మనకు కరోనా వైరస్ సోకుతుందన్న మాట. అయితే కేవలం గాలి ద్వారా మాత్రమే కరోనా వైరస్ సోకుతుందని మాత్రమే చెప్పడానికి వీలు లేదు. కరోనా బాధిత వ్యక్తి నుంచి విడుదలయ్యే శ్వాసకోశ బింధువులు ఏరోసాల్ కణాలు గాలితో పాటు మనం భౌతికంగా టచ్ చేసే ఉపరితలాలపైనా తిష్ట వేస్తాయి. ఈ తరహా ఉపరితలాలను టచ్ చేయడం ద్వారా కూడా కరోనా వైరస్ సంక్రమిస్తుందన్న మాట. మొత్తంగా ఇటు భౌతికంగానే కాకుండా గాలి ద్వారా కూడా కరోనా వైరస్ ఒకరి నుంచి మరొకరికి సోకుతున్న వైనాన్ని సీడీసీ క్లియర్ గానే గుర్తించింది. ఇదే విషయాన్ని తన తాజా నివేదికలో విడుదల చేసింది.