Begin typing your search above and press return to search.

స్పేస్ టూర్ కు అమెరికా రూల్స్.. కొత్త వారి ప‌రిస్థితి ఇంతే!

By:  Tupaki Desk   |   25 July 2021 1:30 PM GMT
స్పేస్ టూర్ కు అమెరికా రూల్స్.. కొత్త వారి ప‌రిస్థితి ఇంతే!
X
అంత‌రిక్షంలోకి వెళ్ల‌డం అంటే.. అదో అద్భుత‌మైన విష‌యం. వ్యోమ‌గాముల‌కు త‌ప్ప‌, ఇత‌రుల‌కు అసాధ్య‌మైన‌ అంశం. కానీ.. ఇప్పుడు ప‌రిస్థితి మొత్తం మారిపోయింది. ఇంత త్వ‌ర‌గా అంత‌రిక్ష యానం అందుబాటులోకి వ‌స్తుంద‌ని ఎవ్వ‌రూ ఊహించ‌లేదు. మొత్తానికి స్పేస్ షిప్ ల‌ను సొంతం త‌యారు చేసుకున్న బిలియనీర్లు.. జెఫ్ బెజోస్‌, రిచ్డ్ బ్రాన్స‌న్ ఒక రౌండ్ అలా స‌ర‌దాగా వెళ్లి వ‌చ్చారు కూడా.

దీంతో.. అంత‌రిక్ష యానం దాదాపు సామాన్యుల‌కు అందుబాటులోకి వ‌చ్చేసిన‌ట్టే. కాక‌పోతే దండిగా ఖ‌ర్చు చేయాల‌నుకోండి. మొత్తానికి డ‌బ్బులు భారీగా ఖ‌ర్చు చేస్తే.. స్పేస్ లోకి వెళ్లిరావ‌డం అనేది పెద్ద విష‌యం కాదు అనేది తేలిపోయింది. దీంతో.. ఇత‌ర ఔత్సాహికులు కూడా ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేసుకుంటున్నారు. స‌మీప భ‌విష్య‌త్ లోనే స్పేస్ టూరిజం క‌ళ‌క‌ళ‌లాడే ప‌రిస్థితి క‌నిపిస్తోంది.

అయితే.. అమెరికా స‌ర్కారు ఈ విష‌యంలో కీల‌క మార్పులు చేసింది. నిన్నా మొన్న‌టి వ‌ర‌కు అంత‌రిక్షంలోకి వెళ్లి వ‌చ్చిన వారంతా వ్యోమ‌గాములుగా ఫీల‌య్యారు. అయితే.. ఇప్పుడు ఆ హోదా ఇవ్వ‌డానికి అమెరికా విమాన‌యాన శాఖ నో చెప్పేసింది. ఎవరికి ప‌డితే వాళ్ల‌కు వ్యోమ‌గామి అనే ఐడెంటిటీని ఇవ్వ‌లేమని ప్ర‌క‌టించింది.

ఒక‌వేళ వ్యోమ‌గామి గుర్తింపు కావాల‌ని అనుకుంటే ఏం చేయాలో చెప్పింది. ఇందుకోసం ముందుగా శిక్ష‌ణ తీసుకోవాల‌ని చెప్పింది. అంతేకాకుండా.. వ్యోమ‌నౌక సిబ్బంది హోదాలో.. భూమికి క‌నీసం 80 కిలోమీట‌ర్ల ఎత్తు వ‌ర‌కు ప్ర‌యాణించిరావాలి. అంతేకాకుండా.. అంత‌రియ‌క్ష యాత్ర భ‌ద్ర‌త పెంచే కార్య‌క్ర‌మాలు, ప‌బ్లిక్ సేఫ్టీకి ఉప‌యోగించే కార్య‌క్ర‌మాల్లో పాల్గొన్న‌ట్టుగా నిరూపించుకోవాలి. ఇలాంటి రూల్స్ ను ఫాలో అయిన వాళ్ల‌కే వ్యోమ‌గామి ఐడెంటిటీ వ‌స్తుంద‌ని ప్ర‌క‌టించింది.

దీంతో.. ఇటీవ‌ల అమెజాన్ అధినేత బెజోస్ తో వెళ్లివ‌చ్చిన వాళ్ల‌కు ఈ గుర్తింపు రాద‌ని నిపుణులు అంచ‌నా వేస్తున్నారు. వాళ్లంతా సాధార‌ణ ప్ర‌యాణికులుగానే మిగిలిపోతార‌ని అంటున్నారు. సో.. ఇక‌మీద ఎవ‌రైనా అంత‌రిక్ష వ్యోమ‌గామిగా గుర్తింపు పొందాలంటే.. అమెరికా విమాన‌యాన శాఖ రూపొందించిన తాజా ప‌రీక్ష‌ల్లో పాస‌వ్వాల్సిందే.