Begin typing your search above and press return to search.

దేశంలోకి ఆ కుక్కల ఎంట్రీపై అమెరికా నిషేధం !

By:  Tupaki Desk   |   16 Jun 2021 2:30 AM GMT
దేశంలోకి ఆ  కుక్కల ఎంట్రీపై  అమెరికా నిషేధం   !
X
రేబిస్ తో బాధపడే వారు ఉన్న దేశాల నుంచి కుక్కలను అమెరికాకు తీసుకురాకూడదని ఆ దేశ ఆరోగ్య శాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. దాదాపు 100 దేశాల నుంచి కుక్కలను తీసుకురావడంపై ఏడాది పాటు నిషేధం విధించినట్లు వెల్లడించింది. అయితే ఇప్పటికే వచ్చిన కుక్కలకు రేబిస్ వ్యాక్సినేషన్ జరిగినట్లు ప్రూవ్స్ చూపవలసి ఉంటుందని, పూర్తిగా వ్యాక్సినేషన్ చేయడానికి తగినంత వయసుగలవి కాకపోవడంతో విదేశాల నుంచి వస్తున్న కుక్కల ప్రవేశంపై నిషేధం విధించినట్లు తెలిపింది.

జూలై 14 నుంచి ఈ నిషేధం అమల్లోకి వస్తుందని , సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ఈ ప్రకటనను జారీ చేసింది. అమెరికాకు ఏటా సుమారు 10 లక్షల కుక్కలను రవాణా చేస్తూ ఉంటారని సీడీసీ అధికారులు తెలిపారు. అందులో దాదాపు 7.5 శాతం కుక్కలపై ఈ నిషేధం ప్రభావం పడుతుందన్నారు. కొన్ని పరిస్థితుల్లో ఈ ఆంక్షలను సడలిస్తామన్నారు. అంధులకు దారి చూపే గైడ్ కుక్కలు, అమెరికాకు తమ కుక్కలతోపాటు మారుతున్న విదేశీయులకు మినహాయింపు ఇస్తామన్నారు. ఇటీవల తిరస్కరణకు గురైనవాటిలో అత్యధిక కుక్కలు రష్యా, ఉక్రెయిన్, కొలంబియా నుంచి వచ్చినవేనని పేర్కొన్నారు.

రేబిస్ రిస్క్ ఎక్కువగా ఉన్న దేశాల నుంచి కుక్కలను తీసుకురావడానికి నిషేధం విధించినట్లు తెలిపారు. కుక్క వయసు నాలుగు నెలల కన్నా ఎక్కువ ఉన్నట్లు తప్పుడు ధ్రువపత్రాలు సమర్పిస్తున్నారని, అటువంటి కుక్కలను అమెరికాలో ప్రవేశించడానికి అనుమతించడం లేదని సీడీసీ అధికారులు తెలిపారు. విదేశీ కుక్కలపై నిషేధం విధించడాన్ని అమెరికన్ వెటరినరీ మెడికల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ డగ్లస్ క్రాట్ స్వాగతించారు. దేశంలోకి ఆరోగ్యవంతమైన కుక్కలే వచ్చేలా చూడాలని అన్నారు.