Begin typing your search above and press return to search.

ఇకపై ఐదు నిమిషాల్లోనే కరోనా నిర్దారణ !

By:  Tupaki Desk   |   28 March 2020 2:53 PM GMT
ఇకపై ఐదు నిమిషాల్లోనే కరోనా నిర్దారణ !
X
ప్రపంచ దేశాలను భయంతో వణికిపోయేలా చేస్తున్న కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించడానికి అమెరికాకు చెందిన హెల్త్‌ కేర్‌ సంస్థ అబాట్‌ లాబొరేటరీస్‌ అత్యాధునిక కిట్‌ను రూపొందించింది. దీని ద్వారా కేవలం ఐదు నిమిషాల్లోనే ఒక వ్యక్తికి కరోనా సోకిందా లేదా అన్న విషయం బయటపడుతుందని శుక్రవారం పత్రికా సమావేశంలో సంస్థ తెలిపింది. అబోట్ ల్యాబొరేటరీస్ రూపొందించిన ఈ పరికరానికి అత్యవసర ప్రక్రియ కింద అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అనుమతించింది.

దీనితో వచ్చేవారమే ఈ కిట్ వైద్య సిబ్బందికి అందుబాటులోకి రానుందని అబోట్ తెలిపింది. చిన్నపాటి టోస్టర్ పరిమాణంలో ఉండే మాలిక్యులర్ టెక్నాలజీ పరికరం.. వ్యక్తి నమూనాలను పరీక్షించి.. కరోనా వైరస్ ఉంటే ఫలితం ఐదు నిమిషాల్లోనే వెల్లడిస్తుంది. అంతేకాదు, నెగెటివ్ ఉంటే 13 నిమిషాల్లో ఫలితాన్ని తెలియజేస్తుందని అబోట్ ల్యాబొరేటరీస్ తెలిపింది.

ఈ సందర్భంగా అబాట్‌ అధ్యక్షుడు, సీఓఓ రాబర్ట్‌ ఫోర్డ్‌ మాట్లాడుతూ.. కరోనా మహమ్మారి పై అన్ని వైపుల నుంచి పోరాటం చేస్తున్నాం. కరోనాను సమర్థవంతంగా ఎదుర్కొనే యుద్ధంలో ఈ పోర్టబుల్‌ మాలిక్యులర్‌ టెస్టు ఎంతగానో ఉపకరిస్తుంది. వైరస్‌ పై పోరాడేందుకు ముఖ్యమైన నిర్ధారణ పరీక్షల్లో త్వరితగతిన ఫలితాలు వెల్లడిస్తుంది అని , కేవలం ఆస్పత్రులకే పరిమితం కాకుండా ఎక్కడైనా దీనిని తీసుకువెళ్లేందుకు వీలుగా టోస్టర్‌ సైజులో రూపొందించినట్లు వెల్లడించారు. అయితే ఈ కిట్‌ను ప్రజా బాహుళ్యంలోకి తెచ్చేందుకు ఎఫ్‌డీఏ నుంచి ఆమోదం లభించలేదని తెలిపారు. ఇకపోతే , దక్షిణ కొరియాలో ఏడు నిమిషాల్లోనే కరోనా పరీక్ష నిర్వహించే కిట్ తయారు చేశారు.