అంబటి వర్సెస్ అయ్యన్న లడాయి లాభం ఎంత..?

Tue May 17 2022 12:46:53 GMT+0530 (IST)

Ambati Vs Ayyanna Patrudu

వైసీపీ సీనియర్ నాయకుడు.. మంత్రి అంబటి రాంబాబు.. వర్సెస్ టీడీపీ సీనియర్ నాయకుడు.. మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడి మధ్య లడాయి పెరుగుతోంది. అంబటిని తీవ్రస్థాయిలో ట్రోల్ చేస్తున్న అయ్యన్న తన మాటల తూటాలతో విరుచుకుపడుతున్నారు. కాంబాబు.. అంటూ.. రాంబాబుకు నిక్ నేమ్ పెట్టి మరీ విరుచుకుపడుతున్నారు. అంతేకాదు.. వ్యక్తిగతంగా కూడా అంబటిని తూర్పారబడుతున్నారు. అయితే.. దీనివల్ల.. టీడీపీకి వచ్చే లాభం ఏమైనా ఉందా? అనేది ప్రశ్న.ఎందుకంటే.. గతంలోనూ అయ్యన్న.. కర్నూలుకు చెందిన.. మంత్రి గుమ్మనూరు జయరాం కుటుంబంపై విరుచుకుపడ్డారు. ఆయన కుమారుడు బహుమానంగా ఒక కారును అందుకున్నారంటూ.. తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

దీంతో అటు గుమ్మనూరు జయరాం కుటుంబం నుంచి అయ్యన్న తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. అంతకు మించి.. టీడీపీకి వచ్చిన లాభం ఏమీలేదు. ఇక ఇప్పుడు అంబటిపై విమర్శలు చేస్తున్నారు. ఒక టీవీ చానెల్ యాంకర్తో అసభ్యంగా మాట్లాడారంటూ..అంబటిపై అయ్యన్న విమర్శలు సంధిస్తున్నారు.

అంతేకాదు.. కొన్ని ట్వీట్లు కూడా చేశారు. అంబటి విషయం జగన్ వరకు చేరిందని.. త్వరలోనే ఆయన బర్తరఫ్కావడం ఖాయమని.. కూడా అయ్యన్న  పేర్కొన్నారు. అయితే.. ఇదంతా కూడా టీడీపీకిమేలు చేస్తుందా?  లేక చిల్లర రాజకీయంగానే మిగిలిపోతుందా?

అనేది కీలక ప్రశ్న. ఎందుకంటే.. ప్రస్తుతం టీడీపీకి కావాల్సింది.. టైం పాస్ రాజకీయం లేదా.. నిత్యం మీడియాలో ఉండడం కాదు.. నిత్యం ప్రజల్లో ఉండే నాయకుడు కావాలి. ప్రజలను చైతన్యం చేసే నాయకుడు కావాలి. కానీ.. అంబటిని పట్టుకుని.. వేలాడుతు న్న అయ్యన్న ఏం సాధిస్తున్నారో ఆయనకైనా అర్ధమవుతోందా? అనేది ప్రశ్న.

ఇలాంటి వాటిపై ట్రోల్ చేయాల్సిందే.. తప్పులు చేస్తే.. ప్రజాక్షేత్రంలో నిలబెట్టాల్సిందే. కానీ.. అంత సీనియర్ నేత.. ఈ విషయానికే రోజులు వారాలు కేటాయించడం.. ప్రజా క్షేత్రంలో నిలబడకుండా.. టైంపాస్ రాజకీయాలు చేయడం ఎంత వరకు సమంజసం అనేది కీలక ప్రశ్న. మరి అయ్యన్న తన పద్ధతి మార్చుకుంటారా.?  నర్సీపట్నం ప్రజల సమస్యలు తెలుసుకుంటారా?  చూడాలి... ఏం చేస్తారో.