Begin typing your search above and press return to search.

నిజమా..బాబును బ్రహ్మదేవుడు కూడా కాపాడలేడా?

By:  Tupaki Desk   |   16 Feb 2020 4:54 PM GMT
నిజమా..బాబును బ్రహ్మదేవుడు కూడా కాపాడలేడా?
X
ఇటీవల రెండు తెలుగు రాష్ట్రాల్లో జరిగిన ఐటీ దాడుల తర్వాత టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు అడ్డంగా దొరికిపోయారని, ఆయన అరెస్ట్ ఖాయమన్న వాదనలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. నేరుగా చంద్రబాబుపై ఐటీ దాడులు జరక్కపోయినా... బాబుకు చాలా కాలం పాటు వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేసిన పెండ్యాల శ్రీనివాస్ పై జరిగిన ఐటీ దాడుల్లో బాబు గుట్టంతా బయటపడిందన్న వాదనలు నిజంగానే సంచలనంగా మారిపోయాయి. ఇలాంటి నేపథ్యంలో ఆదివారం మీడియా ముందుకు వచ్చిన వైసీపీ కీలక నేత, ఆ పార్టీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక చంద్రబాబును ఆ బ్రహ్మ దేవుడు కూడా కాపాడలేరంటూ అంబటి చేసిన వ్యాఖ్యలు నిజంగానే కలకలం రేపుతున్నాయని చెప్పక తప్పదు. ఇప్పటికిప్పుడు కాకున్నా... బాబుకు శిక్ష తప్పదని, ఆ శిక్ష నుంచి చంద్రబాబు తప్పించుకోవడం అసాధ్యమని అంబటి సంచలన వ్యాఖ్యలు చేశారు.

అయినా ఈ దిశగా అంబటి ఏమన్నారన్న విషయానికి వస్తే... ‘‘తన మాజీ పీఎస్ శ్రీనివాస్ పై ఐటీ దాడుల ఘటనకు సంబంధించి చంద్రబాబు సమాధానం చెప్పుకోలేకపోతున్నారు. బ్రహ్మదేవుడు కూడా దీని నుంచి చంద్రబాబును కాపాడలేరు. ఈ కథ ఇంతటితో ముగిసేది కాదు. ‘లాజికల్ గా ఎండ్’ కావాలి. వాస్తవాలు బయటకొస్తాయి. చాలా మందికి ఈ వ్యవహారం చుట్టుకుంటుంది. అన్యాయంగా, అక్రమంగా వేల కోట్లు దోచుకున్న చంద్రబాబునాయుడి గుట్టురట్టు కాబోతున్న సమయం ఆసన్నమైంది. ఇంకా చాలా సోదాలు జరగాల్సిన అవసరం ఉంది. ఇలా ఒకటి లేదా రెండు సంవత్సరాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ క్రమంలో చంద్రబాబునాయుడిని కూడా ఇన్ కంట్యాక్స్ డిపార్టుమెంట్ విచారిస్తుందని కొంచెం కామన్ సెన్స్ ఉపయోగించి భావిస్తున్నా. చంద్రబాబు మాజీ ముఖ్యమంత్రి అనో, కేంద్రంలో చక్రం తిప్పారనో విచారించకుండా ఉండాల్సిన అవసరం లేదు. చంద్రబాబునాయుడు దొరికిపోతారని, శిక్ష నుంచి ఆయన తప్పించుకోవడం సాధ్యం కాదు’’ అని అంబటి వ్యాఖ్యానించారు.

అంబటి వ్యాఖ్యలు చూస్తుంటే... చంద్రబాబు నిజంగానే ఐటీ శాఖకు అడ్డంగా బుక్కయ్యారనే వాదరలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. గత వారం పెండ్యాల శ్రీనివాస్ తో పాటు టీడీపీ కడప జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులు రెడ్డి, మరికొందరిపై జరిగిన ఐటీ దాడుల్లో రూ.2వేల కోట్లకు పైగా అక్రమ వ్యవహారాలు సాగాయని, ఈ అక్రమాలన్నీ కూడా చంద్రబాబు సెంట్రిక్ గానే జరిగినట్లుగా వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ వార్తలనే ఆధారం చేసుకుని అంబటి రాంబాబు తాజాగా చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి.