అంబటి సంచలన వ్యాఖ్యలు.. ఏపీలో ఉన్నది ఎన్నికల కమిషన్ కాదట

Thu Oct 29 2020 13:40:43 GMT+0530 (IST)

Ambati Rambabu Fires On Nimmagadda Ramesh

ఏపీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ వర్సెస్ ఏపీ అధికారపక్షం అన్నట్లు సాగుతున్న ఎపిసోడ్ మరింత ముదిరింది. స్థానిక సంస్థలకు ఎన్నికల నిర్వహణకు సంబంధించి ప్రభుత్వ నిర్ణయాన్ని ముందుగా తెలుసుకోకుండా.. ఎన్నికల అంశంపై రాజకీయ పార్టీల అభిప్రాయాల్ని కోరిన తీరుపై ఏపీ సర్కారు గుర్రుగా ఉంది. ఈ కారణంగానే రాజకీయ పార్టీలతో నిర్వహించిన సమావేశానికి హాజరు కాలేదు. ఇలాంటివేళ.. ఏపీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ పై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కమ్ ఫైర్ బ్రాండ్ అంబటి రాంబాబు.. సంచలన వ్యాఖ్యలు చేశారు.ఏపీలో ఉన్నది ఎన్నిక కమిషన్ కాదని.. చంద్రబాబు - నిమ్మగడ్డ కమిషన్ గా ఆయన అభివర్ణించారు. అంబటి వ్యాఖ్యలకు కాస్త ముందుగా.. అఖిలపక్ష భేటీకి అధికారపక్షం హాజరు కాలేదన్న ప్రెస్ నోట్ చూసి తాను ఆశ్చర్యపోయినట్లుగా నిమ్మగడ్డ పేర్కొనటం.. ఏపీ అధికారపక్షానికి మరింత చిరాకు తెప్పించిందని చెప్పాలి.  ఇదే విషయాన్ని తన మీడియా సమావేశంలో ప్రస్తావించారు అంబటి.

రాష్ట్ర ఎన్నికల సంఘం అన్ని రాజకీయ పార్టీలను పిలిచి స్థానిక ఎన్నికలపై అభిప్రాయాలు తీసుకుంటున్న అంశంపై తాము ముందే హాజరు కామని స్పష్టం చేశామని అంబటి గుర్తు చేశారు. అలాంటప్పుడు తమ ప్రెస్ నోట్ చూసి ఆశ్చర్యపోవాల్సిన అవసరం నిమ్మగడ్డకు లేదన్నారు. ‘ఈసీ విడుదల చేసిన నోట్ పై మేం చేసిన వ్యాఖ్యలు ఆశ్చర్యపరిచాయని నమ్మగడ్డ అంటున్నారు. అసలు ఆశ్చర్యపడాల్సిన అంశం ఏమంటే.. రాజ్యాంగ పరంగా స్వతంత్రప్రతిపత్తి కలిగిన ఎన్నికల సంఘాన్ని నిమ్మగడ్డరమేశ్ టీడీపీకి తాకట్టు పెట్టారు. ఎన్నికల్ని మార్చిలో వాయిదా వేసిన సందర్భంలో అన్ని పార్టీల్ని అడిగారా? కనీసం ప్రభుత్వం నుంచి వివరణ కోరారా? కుట్ర పూరితంగా టీడీపీతో కలిసి నాడు ఎన్నికల్ని వాయిదా వేశారు’’ అని మండిపడ్డారు.

నిమ్మగడ్డపై పలు ఆరోపణలు సంధించిన అంబటి ఇంకేమన్నారంటే..
-  స్థానిక ఎన్నికల ప్రక్రియ ప్రారంభానికి ముందు రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించాలని సుప్రీంకోర్టు చెప్పింది. అలాంటప్పుడు నిమ్మగడ్డ.. రాజకీ పార్టీలతో మాట్లాడటానికి ముందు ప్రభుత్వంతో ఎందుకు చర్చించలేదు?
-  నాడు మూడు కరోనా కేసులు ఉంటే ఎన్నికల్ని వాయిదా వేశారు. ఇవాళ రోజుకు మూడు వేల కేసులు వస్తున్నప్పుడు  ఎలా సాధ్యం?
-  ఎవరి మాటలు విని అర్ధాంతరంగా ఎన్నికల్ని వాయిదా వేశారు?
- చంద్రబాబు ఆదేశంతో టీడీపీ ఆఫీసులో తయారైన లేఖపై సంతకం చేసిందెవరు?
-  ఎన్నికల సంఘాన్ని చంద్రబాబు - నిమ్మగడ్డ కమిషన్ గా మార్చేసింది ఎవరు?
-  ఎన్నికల వాయిదా కోరుతూ కేంద్ర ప్రభుత్వానికి తాను రాసిన లేఖ విషయమైనా నిమ్మగడ్డకు గుర్తుందా?
- బాబు రాసిన లేఖపై సంతకం చేసిన నిమ్మగడ్డ.. నాడు రాజకీయ పార్టీలతో అఖిలపక్ష సమావేశానని ఎందుకు నిర్వహించలేదు?
- ఎన్నికల్లో మద్యం.. డబ్బు పంపిణీ అరికట్టటానికి జగన్ సర్కార్ ఆర్డినెన్సు తీసుకొస్తే దానిపై ఎన్నేసి మాటలుఅన్నారో మర్చిపోయారా?