Begin typing your search above and press return to search.

లక్షల కెమెరా వేలకే.. అమెజాన్ కు భారీ బొక్కా

By:  Tupaki Desk   |   20 July 2019 4:39 AM GMT
లక్షల కెమెరా వేలకే.. అమెజాన్ కు భారీ బొక్కా
X
ఒక్క సున్నా ఎంతపనిచేసింది. అస్సలు విలువ లేని సున్నాను సంఖ్య పక్కన తగ్గిస్తే ఎంతటి భారీ నష్టం వాటిల్లుతుందో దిగ్గజ సంస్థ అమెజాన్ కు అనుభవపూర్వకంగా అర్థమైంది.

ఆన్ లైన్ ఈకామర్స్ దిగ్గజ సంస్థ అమెజాన్ చేసిన పొరపాటుతో వినియోగదారులు భారీగా లాభపడ్డారు. లక్షల విలువ చేసే వస్తువులను వేలకే కొని పండుగ చేసుకున్నారు. పొరపాటు చేసిన అమెజాన్ మాత్రం భారీగా నష్టపోయింది. ఇప్పుడు నెత్తి నోరు కొట్టుకున్నా జరగాల్సిన నష్టం మాత్రం జరిగిపోయింది.

ఇటీవలే అమెజాన్ సంస్థ ప్రైమ్ డే సేల్ పేరుతో ఘోర తప్పిదం చేసింది. ఇతర ఉత్పత్తులతోపాటు హైఎండ్ కెమెరాలపై కూడా భారీ డిస్కౌంట్స్ డీల్స్ ప్రకటించింది. సోని ఏ6000 మిర్రర్ లెస్ కెమెరా నిజానికి 550 డాలర్ల నుంచి 940 డాలర్ల దాకా ఉన్నాయి.. కానీ అమెజాన్ పొరపాటును ఒక సున్నా తగ్గించేసి 94.4 డాలర్లకే వెబ్ సైట్ లో పెట్టింది. అంటే మన కరెన్సీలో 4 లక్షల రూపాయల సోని కెమెరా కేవలం 6500 కే అన్నమాట.. ఇంత తక్కువ ధరకు కెమెరా అని తెలియడంతో వినియోగదారులు ఎగబడ్డారు. అది హాట్ కేకుల్లా అమ్ముడుపోయింది.

అయితే సున్నా తగ్గించేసి పొరపాటు జరిగిందన్న విషయం తెలుసుకునే సరికి సరుకు వెళ్లిపోయి వినియోగదారుల చేతికి అందింది. దీంతో వినియోగదారులు సంతోషంతో సంబరాలు చేసుకోగా.. అమెజాన్ మాత్రం లక్షల్లో నష్టపోయింది. ఇక దీనిలాగానే 13000 డాలర్లు(9లక్షలు) మరో కెమెరాను కూడా రూ.6500 ధరలోనె పెట్టారు. 1.37 లక్షల కెనాన్ కెమెరాకు ఇదే ధర పెట్టారు. వీటిని కొని వినియోగదారులు భారీగా లాభపడగా.. పొరపాటు చేసి అమెజాన్ తీవ్రంగా నష్టపోయింది.

ఇక 9 లక్షల కెమెరా 6500 కే దొరికిందని వినియోగదారులు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అమెజాన్ కు అప్పుడు పొరపాటు తెలిసివచ్చింది. ఆ డీల్స్ అన్నింటిని తర్వాత క్యాన్సల్ చేసింది. కానీ అంతకుముందే అమెజాన్ కు జరగాల్సిన నష్టం జరిగిపోయింది.