Begin typing your search above and press return to search.

ఆప్ వైపు.. అమ‌రీంద‌ర్‌!

By:  Tupaki Desk   |   24 Sep 2021 5:30 PM GMT
ఆప్ వైపు.. అమ‌రీంద‌ర్‌!
X
పంజాబ్‌లోని కాంగ్రెస్ పార్టీ రాజ‌కీయాలు ఆస‌క్తిక‌రంగా మారాయి. అమ‌రీంద‌ర్‌.. న‌వ్‌జోత్ సింగ్ సిద్ధూ మ‌ధ్య విభేధాలతో మొద‌లై.. సిద్ధూకు పీసీసీ అధ్య‌క్ష ప‌ద‌వి ద‌క్క‌డంతో అవి మ‌రింత తీవ్ర‌మై.. చివ‌ర‌కు అమ‌రీంద‌ర్ సీఎం ప‌ద‌వికి రాజీనామా చేయాల్సిన ప‌రిస్థితి వ‌చ్చింది. కాంగ్రెస్ అధిష్ఠానం నిర్ణ‌యం మేర‌కు ముఖ్య‌మంత్రి ప‌ద‌వికి రాజీనామా చేసిన అమ‌రీంద‌ర్ ఇప్పుడు ఏం చేయ‌బోతున్నార‌నేది ఆస‌క్తిని పెంచుతోంది. కొత్త ముఖ్య‌మంత్రి చ‌ర‌ణ్‌జిత్ సింగ్ చ‌న్నీకి శుభాకాంక్ష‌లు చెప్పిన ఆయ‌న‌.. ప్ర‌స్తుతానికి ఆ పార్టీలోనే కొన‌సాగుతున్నారు. కానీ పంజాబ్ పీసీసీ అధ్య‌క్షుడు సిద్ధూపై ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు తీవ్ర చ‌ర్చ‌నీయాంశంగా మారాయి.

దేశానికి సిద్ధూ ప్ర‌మాద‌కారి అని ఎట్టి ప‌రిస్థితుల్లోనూ ఆయ‌న‌ను సీఎం కాకుండా అడ్డుకోవ‌డానికి ఏ త్యాగానికైనా సిద్ధ‌మ‌ని వచ్చే ఎన్నిక‌ల్లో ఆయ‌న‌పై పోటీకి బ‌ల‌మైన అభ్య‌ర్థిని నిల‌బెడ‌తామ‌ని అమ‌రీంద‌ర్ చేసిన వ్యాఖ్య‌లు ఇప్పుడు క‌ల‌క‌లం సృష్టిస్తున్నాయి. వ‌చ్చే ఏడాది పంజాబ్‌లో శాస‌న స‌భ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఈ నేప‌థ్యంలో ఆ ఎన్నిక‌ల్లో సిద్ధూపై బ‌ల‌మైన అభ్య‌ర్థిని నిలెబ‌డ‌తామ‌ని అమ‌రీంద‌ర్ పేర్కొన‌డం వెన‌క ఆంత‌ర్యం ఏమిట‌న్న‌ది ఇప్పుడు చ‌ర్చ‌కు కార‌ణ‌మైంది. చ‌ర‌ణ్‌జిత్‌ను కాకుండా సిద్ధూను ముఖ్య‌మంత్రిని చేస్తే అమ‌రీంద‌ర్ ఇప్ప‌టికే వేరు కుంప‌టి పెట్టేవార‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఇప్పుడేమో అలా కాకుండా పార్టీలోనే కొన‌సాగుతూ సొంత నాయ‌కుల‌పైనే ఆయ‌న విమ‌ర్శ‌లు చేస్తున్నారు.

ఒకే పార్టీలో ఉన్న సిద్ధూపై తీవ్ర ఆరోప‌ణ‌లు చేసిన అమ‌రీంద‌ర్ కాంగ్రెస్ అగ్ర నాయ‌కులు రాహుల్ గాంధీ, ప్రియాంక‌ల‌పై కూడా అసంతృప్తి వ్య‌క్తం చేశారు. వాళ్ల‌కు అనుభవం లేద‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. ఈ నేప‌థ్యంలో అమ‌రీంద‌ర్ పార్టీ వీడేందుకు సిద్ధ‌మ‌య్యార‌ని అందుకే ఇలాంటి వ్యాఖ్య‌లు చేస్తున్నార‌ని విశ్లేష‌కులు అంటున్నారు. లేక‌పోతే ఒకే పార్టీలో ఉన్న సిద్ధూపై పోటీకి బ‌ల‌మైన అభ్య‌ర్థిని నిల‌బెడ‌తామ‌ని ఆయ‌న ప్ర‌క‌టించ‌డం ఏమిట‌ని? ఆయ‌న పార్టీ మారేందుకు సిద్ధ‌మ‌య్యార‌నే ప్ర‌చారం సాగుతోంది. ఇప్పుడు ఆయ‌న ఏ పార్టీలో చేర‌తారు? లేదా సొంత పార్టీ పెడ‌తారా? అనే ప్ర‌శ్న‌లు మొద‌ల‌య్యాయి.

గ‌తంలోనే ఓ సారి సొంత కుంప‌టి పెట్టి చేతులు కాల్చుకున్న ఆయ‌న‌.. ఇప్పుడు 79 ఏళ్ల వ‌య‌సులో మ‌రోసారి ఆ సాహ‌సం చేయ‌లేక‌పోవ‌చ్చు. దీంతో వేరే పార్టీలోనే చేరే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉన్నాయి. పంజాబ్‌లో బ‌లోపేతంపై దృష్టి సారించిన ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్‌) వైపే ఆయ‌న మొగ్గు చూపే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉన్నాయి. కేంద్రంలోని బీజేపీ స‌ర్కారు తెచ్చిన కొత్త వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌కు వ్య‌తిరేకంగా రైతులు చేస్తున్న పోరాటానికి మ‌ద్ద‌తు ఇచ్చిన అమ‌రీంద‌ర్‌.. ఇప్పుడు బీజేపీలో చేరే ఆస్కారం లేదు. ఇక ఆ రాష్ట్రంలో మ‌రో ప్ర‌ధాన పార్టీ అయిన శిరోమ‌ణి అకాలీద‌ళ్‌లోనూ చేరే సూచ‌న‌లు క‌నిపించ‌డం లేదు. ఎందుకంటే ఆ పార్టీ కూడా కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ కూట‌మిలో పొత్తు పెట్టుకుని.. ఆ త‌ర్వాత రైతు చ‌ట్టాల‌ను వ్య‌తిరేకించి కూట‌మిలో నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఈ ప‌రిస్థితుల్లో అమ‌రీంద‌ర్ ఆప్‌లోనే చేరే వీలుంద‌ని రాజ‌కీయ నిపుణులు అనుకుంటున్నారు. ఆయ‌న కోసం ఆప్ అధినేత కేజ్రీవాల్ కూడా గ‌ట్టి ప్ర‌య‌త్నాలే చేస్తున్న‌ట్లు స‌మాచారం.