Begin typing your search above and press return to search.

అమరావతి: మెట్రో రైలు మంచిదా? కాదా..!?

By:  Tupaki Desk   |   22 Sep 2015 4:41 PM GMT
అమరావతి: మెట్రో రైలు మంచిదా? కాదా..!?
X
నవ్యాంధ్రలో మెట్రో రైలు పనులకు అన్ని ఏర్పాట్లు పూర్తవుతున్న నేపథ్యంలో ఈ ప్రతిపాదనలపై రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి... రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. విజయవాడ, విశాఖల్లో మెట్రో పనులు చేపట్టేందుకు ఢిల్లీ మెట్రో రైలు సంస్థతో ఒప్పందం కుదిరిన సంగతి తెలిసిందే. రెండు నగరాల్లోనూ మెట్రోరైలు వేయాల్సిన మార్గాలు... ఎంతెంత దూరం ఉంటుంది... స్టేషన్లు ఎక్కడెక్కడ వస్తాయి వంటి అన్ని వివరాలతో డీపీఆర్ లూ సిద్ధమయిపోయాయి. దీంతో రెండు మెట్రోల పనులకూ రంగం సిద్ధమవుతోంది. అయితే... ఈ దశలో విజయవాడ వంటి నగరానికి మెట్రో కంటే ఇతర విధానాలు మెరుగన్న వాదనను కొందరువినిపిస్తున్నారు. ఈ క్రమంలో అసత్యాలూ ప్రచారం చేస్తున్నారు. పొరుగునే ఉన్న రాష్ట్రాలతో పోల్చుతూ తప్పుడు వివరాలతో ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం జరుగుతోంది. మెట్రో రైలు వల్ల లాభనష్టాలేంటి... అసలిది అవసరమా కాదా అన్నది పక్కనపెడితే మెట్రోను అడ్డంపెట్టుకుని తెలిసీతెలియని గణాంకాలతో తప్పుడుప్రచారం చేయడం మాత్రం ఎవరికైనా సరికాదు.

విజయవాడలో ప్రతిపాదిస్తున్న మెట్రోను... కట్టడాలను కూల్చేసి... కాంక్రీటు స్తంభాలు వేసి దానిపై పట్టాలు వేసి నడిపించడం కంటే చెన్నైలో ఉన్నట్లుగా నేల మీదే మెట్రో వేయాలని.... దాని వల్ల 80 శాతం ఖర్చు తగ్గుతుందని పత్రికల సాక్షిగా కొందరు చెబుతున్నారు. అయితే... ఇందులో వాస్తవమెంతో చెన్నైతో పరిచయంఉన్న ఎవరైనా చెబుతారు. ఆ కథనంలో చెప్పినట్లుగా చెన్నై మెట్రో ఏమీ నేలపైన నిర్మించడం లేదు. అన్నిచోట్లా ఉన్నట్లు వంతెనలపై, సొరంగ మార్గంలో నిర్మిస్తున్నారు. అయితే... ఇందులో 80 శాతం సొరంగ మార్గంలోనే ప్రతిపాదించారు. 20 శాతం దూరం వంతెనపై ఉంటుంది... సొరంగ మార్గంలో నిర్మించడం ఆలస్యంఅవుతుంది.... చెన్నైలో అదే జరిగింది కూడా.... ప్రస్తుతం అక్కడ వంతెన మార్గంలోనే మెట్రోరైళ్లు తిరుగుతున్నాయి కానీ ఇంకా సొరంగమార్గాల మెట్రో పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాలేదు. ఇదంతా ఎలా ఉన్నా చెన్నైలో నేల మీద మెట్రో అయితే లేదు. ఒకవేళ నేల మీద మెట్రో ఉన్నా అప్పుడు అది ట్రాఫిక్ తగ్గించడానికితోడ్పడకపోగా నిమిషానికో ట్రైను తిరుగుతూ ట్రాఫిక్ కు ఆటంకంగా మారి అసలు లక్ష్యాన్ని దెబ్బతీస్తుంది.

అయితే... మెట్రో రైళ్ల వల్ల లాభనష్టాలు... దానికి ప్రత్యామ్నాయాలు... ఆ ప్రత్యామ్నాయాల వల్ల లాభనష్టాలు తెలిస్తే ఇలాంటి తెలిసీతెలియని వాదనల్లో పసెంతో నిర్ణయించుకోవచ్చు. కష్టాల్లో ఉన్న ఏపీలో రెండు మెట్రోల నిర్మాణం పెనుభారమే కావచ్చు.. కానీ, లాంగ్ రన్ లో రాష్ట్రానికి దానివల్ల ఎంతో ప్రయోజనం ఉంటుంది.రవాణా వ్యవస్థకు అది ఆయువు పట్టుగా నిలుస్తుందన్నది మాత్రం నిజం. నవ్యాంధ్ర రాజధాని అమరావతిని వందేళ్ల ముందుచూపుతో నిర్మిస్తున్నందున అక్కడ చేపడుతున్న ఏ పనినీ ఈ రోజుకి ఇది అనవసరం అన్న కోణంలో చూడకుండా మన తరువాత రెండు మూడు తరాల అవసరాలను పరిగణనలోకి తీసుకుని ఆలోచించాలి. కొన్నికొన్ని పట్టణాల్లో... పలు జాతీయ రహదారులను విస్తరించినప్పుడు చాలామంది అనుకుంటుంటారు.. రోడ్లు వేసినప్పుడే పెద్దవిగా వేస్తే ఇప్పుడీ బిల్డింగులు కూల్చే పనుండదు కదా అని అంటుంటారు.. అది నిజమే... ఇరవై ముప్ఫయి ఏళ్ల కిందట వేసిన ఆ రోడ్లను అప్పుడే పెద్దవిగా వేస్తే ఇప్పటి అవసరాలకు సరిపడేవి. కాబట్టిఈ కాలంలో చేపడుతున్న పనుల్లో అలాంటి తప్పులు చేయకుండా వందేళ్ల భవిష్యత్తును ఊహించిన ప్రాజెక్టులు చేపట్టడం చాలా అవసరం. మెట్రో రైళ్ల వ్యవస్థ వంటివి అలాంటివే. ఇప్పటికి అవి అవసరానికి మించినట్లుగా అనిపించినా... అవసరమైన నాటికి ఇది లేకపోతే కలిగే ఇబ్బంది ఇంకా ఎక్కువగా ఉంటుంది.

వంతెనలపై మెట్రో రైలుకు ప్రత్యామ్నాయంగా నేలపైనే మెట్రో వేస్తే బెటరన్న వాదన ఒకటి ప్రచారమవుతోంది. వారు చెబుతున్నట్లుగా ఇది ఖర్చు పరంగా మంచిదే కానీ, ట్రాఫిక్.. ప్రమాదాల నివారణ విషయంలో ప్రపంచవ్యాప్తంగా దీనివల్ల ఇబ్బందులు పడుతున్నారు. ట్రాములు, లైట్ ట్రైన్ల పేరుతో యూరప్ దేశాలు,ఆస్ట్రేలియాల్లో ఇలాంటివి ఉన్నాయి. కానీ... ఇది రోడ్డు ట్రాఫిక్ కు ఇబ్బందులు కలిగిస్తాయి. ఇందులో ప్రమాదాలకు ఆస్కారమెక్కువ. వంతెనలపై మెట్రోలో ఇలాంటి ఇబ్బందులుండవు. యూరప్ దేశాల్లో ఈ రెండు విధానాలు కూడా ఉన్నాయి. కానీ.. అక్కడ మెట్రో రైళ్లకే ఆదరణ ఎక్కువగా ఉంటోంది. మనదేశంలోనూ కోల్ కతాలోఇప్పటికీ ట్రాములున్నాయి.

బ్రిటీషర్ల హయాంలో ఇండియాలో చెన్నై, కోల్ కతా, ముంబయి, ఢిల్లీ, పాట్నా, కాన్పూర్, భోపాల్, నాసిక్ తదితర చోట్ట ట్రాములు ప్రవేశపెట్టారు. అయితే... కాలక్రమేణా వీటికి ఆదరణ తగ్గింది. 1930, 60 మధ్య కాలంలో దేశంలో ట్రాములు నిలిచిపోయాయి.. ఒక్క కోల్ కతాలో మాత్రమే ఇప్పటికీ మనుగడ సాగిస్తున్నాయి.అయితే... ఒకప్పుడు ఉన్నన్ని ట్రాములు ఇప్పుడు అక్కడ కూడా లేవు. ఒకప్పుడు 1950లో కోల్ కతాలో రోజూ 300 ట్రాములు తిరిగేవి... ప్రతిమార్గంలోనూ అయిదు నిమిషాలకో ట్రామ్ వచ్చేది. ఇప్పుడు 25 మార్గాల్లో కేవలం 125ట్రాములు తిరుగుతున్నాయి. రోడ్లకు సమాంతరంగా కొన్నిచోట్ల... క్రాస్ చేస్తూ కొన్నిచోట్ల ఈమార్గాలుంటాయి... దీంతో ఇబ్బందులు ఎదురవుతాయి. అయితే.. మనదేశంలో ట్రామ్ ప్రమాదాలు మాత్రం చాలా తక్కువే. కోల్ కతాలో నూ రెండు మూడేళ్లకో ప్రమాదం జరగడం తప్పితే రోడ్డు ప్రమాదాల్లా నిత్యకృత్యం మాత్రం కాదు.

అయితే... ఆధునిక సాంకేతికత.. సౌలభ్యం వంటి అంశాల ప్రాతిపదికగా ప్రపంచమంతా ఇప్పుడు మెట్రోరైలు వ్యవస్థలకు మొగ్గు చూపుతోంది. నవ్యాంధ్ర కూడా అందుకు భిన్నమేమీ కాదు. మెట్రో రైలు ప్రాజెక్టు వల్ల భవంతులు కూల్చాలన్నది కొంత నిజమే అయినా.. రోడ్ల విస్తరణ అవసరమైప్పుడు ఎప్పటికైనా అది తప్పనిపనేనన్న సంగతి తెలుసుకోవాలి. అదేసమయంలో కొన్ని చోట్ల కూల్చడాలేమీ అవసరం లేకుండానే రోడ్డు మధ్యలో పిల్లర్లు వేసి మెట్రో నిర్మిస్తున్నారు.

ఉమ్మడి రాష్ట్రంలోనే హైదరాబాద్ లో చేపట్టిన మెట్రో రైలు నిర్మాణ పనులను కోట్ల మంది చూశారు... ఇప్పటికీ చూస్తున్నారు. అన్ని నగరాల్లో ఉన్నట్లే హైదరాబాద్ మెట్రోనూ పిల్లర్లపై వంతెనల్లా నిర్మించి దానిపై ట్రాక్స్ వేసి రైళ్లు తిరిగేలా ఏర్పాట్లు చేస్తున్నారు. అవసరమైన చోట ఎక్కడికక్కడ స్టేషన్లు నిర్మిస్తున్నారు.హైదరాబాద్ లో ట్రాఫిక్ సమస్య ఏ స్థాయిలో ఉంటుందో అందరికీ తెలిసిందే... ఆ సమస్య పరిష్కారం కోసమే మెట్రో వేస్తున్నారు. రవాణా సౌకర్యం పెంచేందుకు మెట్రో నిర్మిస్తున్నారు. దీని నిర్మాణ సమయంలో కొంత ట్రాఫిక్ ఇబ్బుందులున్నా ఆ తరువాత కలిగే సౌకర్యంతో పోల్చితే దాన్ని లెక్కలోకి తీసుకోనవసరం లేదు. అలాగే రోడ్లపై ఇలాంటి ప్రాజెక్టులు తలపెడితే నిర్మాణాలు కూల్చాల్సిన అవసరం ఎక్కువగా ఉంటుంది... రోడ్డు మధ్యలో వంతెనపై నిర్మిస్తే నిర్మాణాలు కూల్చాల్సిన అవసరం ఉండదు.. స్టేషన్లు నిర్మించే చోటే కూల్చాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు విజయవాడలోనైనా ఇదే పరిస్థితి ఉంటుంది కానీ... ఇంతకుమించి తీవ్రనష్టాలైతే జరిగిపోవు. కానీ, మెట్రో పూర్తయితే మాత్రం ప్రజలకు సౌకర్యంతో పాటు పాశ్చాత్య దేశాల మాదిరిగా ప్రగతి కనిపిస్తుంది.


- గరుడ