Begin typing your search above and press return to search.

అసెంబ్లీ ముట్టడికి ఆందోళనకారుల యత్నం...

By:  Tupaki Desk   |   20 Jan 2020 7:07 AM GMT
అసెంబ్లీ ముట్టడికి ఆందోళనకారుల యత్నం...
X
ఆంధప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతిని కొనసాగించాలంటూ రైతులు కొనసాగిస్తోన్న నిరసన ప్రదర్శనలు, ఆందోళనలు సోమవారం నాటికి పతాకస్థాయికి చేరుకున్నాయి. తెలుగుదేశం పార్టీ - అమరావతి పరిరక్షణ సమితి ఐక్య కార్యాచరణ కమిటీ నాయకులు ఇచ్చిన పిలుపుమేరకు అసెంబ్లీ ముట్టడి ఆందోళనను చేపట్టాయి. మూడు రాజధానులకు అనుకూలంగా బిల్లును ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ లో ప్రవేశపెట్టింది. ప్రస్తుతం దానిపై సభలో చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో మూడు రాజధానులను ఏర్పాటు చేస్తామంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చిన తరుణంలో అమరావతి పరిధిలోని గ్రామాల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

అసెంబ్లీ ముట్టడిని భగ్నం చేయడానిక ప్రభుత్వం పెద్ద సంఖ్యలో పోలీసులను మోహరింపజేసింది. పలువురు నాయకులను గృహ నిర్బంధంలో ఉంచింది. పోలీసుల చర్యకు నిరసనగా గ్రామస్తులు రోడ్ల మీదికి వచ్చి నిరసనలు చేపట్టడం పలు చోట్ల ఉద్రిక్తతకు దారితీసింది. సోమవారం తెల్లవారుజాము నుండే పలుచోట్ల నేతలను పోలీసులు ముందస్తు అరెస్టులు చేశారు.పొన్నూరు నుంచి భారీ బైక్‌ ర్యాలీతో అసెంబ్లీ ముట్టడిలో పాల్గొన్న టీడీపీ మాజీ ఎమ్మెల్యే ధూలిపాళ్ళ నరేంద్ర కుమార్ చౌదరిని పోలీసులు అరెస్టు చేశారు. పొన్నూరు నుంచి ర్యాలీగా బయలుదేరిన ఆయన తుళ్లూరుకు చేరుకున్నారు. అసెంబ్లీ వైపు దూసుకెళ్లడానికి ప్రయత్నించగా.. పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులకు, నరేంద్ర కుమార్ అనుచరులు, కార్యకర్తల మధ్య తోపులాట చోటు చేసుకుంది. అనంతరం ఆయనను అరెస్టు చేసిన పోలీసులు అరండల్‌ పేట పోలీస్‌‌ స్టేషన్‌ కు తరలించారు.

పెద్ద ఎత్తున పోలీసు బలగాలను మోహరింపజేసినప్పటికీ.. రాజధాని గ్రామాల రైతులు ఎక్కడా వెనుకంజ వేయట్లేదు. పోలీసులు ఏర్పాటు చేసిన కంచెల్ని దాటుకుంటూ అసెంబ్లీ వైపు పరుగులు తీస్తున్నారు. వెలగపూడిలో నిర్మించిన తాత్కాలిక అసెంబ్లీ భవనం చుట్టూ వందలాదిమంది పోలీసులు మోహరించి ఉన్నప్పటికీ - రైతులు వెనక్కి తగ్గట్లేదు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నిస్తున్నారు. దీనితో పోలీసులు - ఆందోళన కారుల మధ్య తోపులాటలు జరుగుతున్నాయి.