ప్రభుత్వమే వెళ్ళిపొమ్మంటోందిట

Tue Aug 03 2021 23:00:02 GMT+0530 (IST)

Amara raja Battery Manufacturing Unit is moving to Tamil Nadu

అమరరాజా బ్యాటరీల తయారీ యూనిట్ తమిళనాడుకు తరలిపోతోందనే ప్రచారంపై ప్రభుత్వ సలహదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. ఆయన వెర్షన్ ఏమిటంటే సంస్ధ తమ యూనిట్ ను తరలించటం కాదు ప్రభుత్వమే యూనిట్ ను తరలించేయమన్నదట. ఉత్పత్తి యూనిట్ నుండి ప్రమాదకరమైన విషవాయువులు వెలువడుతున్నాయిన సజ్జల చెప్పారు. దీనివల్ల ఫ్యాక్టరీ చుట్టుపక్కనున్న గ్రామాల ప్రజలంతా చాలా ఇబ్బందులు పడుతున్న కారణంగా ప్రభుత్వమే ఉత్పత్తి యూనిట్ ను ఎత్తేయమని చెప్పిందని సజ్జల స్పష్టంగా చెప్పారు.ఇదే విషయమై చంద్రబాబునాయుడు ఆందోళనలు చేసినా ఎవరు పట్టించుకోరని కూడా సలహాదారు అభిప్రాయపడ్డారు. చంద్రబాబు ఆందోళనలు చేస్తే పట్టించుకునేవారున్నారా ? అంటు ఆశ్చర్యపోయారు. బాధితులపక్షాన కాకుండా చంద్రబాబు కంపెనీ యాజమాన్యానికి మద్దతుగా మాట్లాడటం ఏమిటంటు మండిపడ్డారు. చంద్రబాబు నిర్వాకంతోనే రాష్ట్రంలో గడ్డు పరిస్ధితులు తలెత్తినట్లు మండిపడ్డారు.

బ్యాటరీలు ఇన్వర్టర్లు తయారుచేసే అమరరాజా సంస్ధ దేశంలోనే రెండో అతిపెద్దదిగా పాపులరైంది. ఇందులో వేలాదిమంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఈ సంస్ధకు టీడీపీ ఎంపి గల్లా జయదేవ్ ఎండిగా ఉన్నారు. మొన్నటివరకు సీఎండిగా ఉన్న ఆయన తండ్రి గల్లా రామచంద్రనాయుడు కంపెనీ నిర్వహణ నుండి తప్పుకోవటంతో జయదేవ్ ఎండిగాను ఆయన ఇద్దరు కొడుకులు డైరెక్టర్లుగా అపాయింట్ అయ్యారు.

సంస్ధ టర్నోవర్ ఏడాదికి సుమారు 1 బిలియన్ డాలర్లుంటుంది. ఏడాదికి రు. 2400 కోట్లను పన్నుల రూపంలోనే చెల్లిస్తోంది. కేంద్ర రాష్ట్రప్రభుత్వాలకు చెరి రు. 1200 కోట్లు పన్నుల రూపంలో అందుతోంది. అమరరాజా ఫ్యాక్టరీలో ఉద్యోగాలను దృష్టిలో పెట్టుకునే ఇంటనీరింగ్ పాలిటెక్నిక్ కాలేజీలు సిలబస్ ను డిజైన్ చేస్తున్నాయి. వైసీపీ-టీడీపీ మధ్య నెలకొన్న రాజకీయ వైరం కారణంగానే ప్రభుత్వం అమరరాజా కంపెనీపై కక్ష కట్టిందని టీడీపీ నేతలంటున్నారు. వాతావరణ నీటి కాలుష్యం కారణంగా వేలాదిమంది అనారోగ్యం పాలవుతున్న కారణంగానే ఫ్యాక్టరీ విషయంలో కఠినంగా ఉండాల్సొస్తోందని ప్రభుత్వం చెబుతోంది.