Begin typing your search above and press return to search.

అమలాపురం ఎందుకంత ఆగమాగమైంది? లెక్క తేడా కొట్టిందెక్కడ?

By:  Tupaki Desk   |   25 May 2022 2:29 AM GMT
అమలాపురం ఎందుకంత ఆగమాగమైంది? లెక్క తేడా కొట్టిందెక్కడ?
X
ఏపీలోని మిగిలిన జిల్లాలతో పోలిస్తే.. ప్రశాంతవాతావరణం ఉన్న జిల్లాల్లో గోదారి జిల్లాలుగా చెబుతారు. అక్కడి ప్రజలంతా శాంతికాముకులే కాక.. మర్యాదలకు.. అతిధ్యానికి మారుపేరుగా నిలుస్తారని చెబుతారు. ముఖ పరిచయంలేని వారిని సైతం తమ మర్యాదలతో మురిపించే కోనసీమ వాసుల్లో ఇంతటి ఆగ్రహావేశాల్ని చూసింది లేదు. కొత్త జిల్లాల ఏర్పాటు అనంతరం.. మొదట పెట్టిన ‘కోనసీమ’ జిల్లా పేరుకు ముందు బీఆర్ అంబేడ్కర్ పేరును యాడ్ చేస్తామన్న ప్రభుత్వ నిర్ణయంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. తాము తీసుకున్న నిర్ణయానికి తగ్గట్లు నోటిఫికేషన్ విడుదల చేసిన వేళ.. దాన్ని వ్యతిరేకిస్తూ కోనసీమ జిల్లా సాధన సమితి పేరుతో చలో అమలాపురం పేరుతో పిలుపునిచ్చారు. జిల్లా కలెక్టరేట్ కు వెళ్లి.. తమ డిమాండ్ ను కలెక్టర్ కు విన్నవించుకోవాలని భావించారు.

ఇంతవరకు బాగానే ఉన్నా.. వంద మంది పోలీసులకు గాయాలు.. అందులో ఎస్పీ స్థాయి అధికారి నుంచి ఎస్ ఐ వరకు అధికారులే కాదు..కానిస్టేబుళ్లు పెద్ద ఎత్తు ఉన్నారు. వీటన్నింటికి మించి జిల్లాకు చెందిన మంత్రి విశ్వరూప్ రెండు ఇళ్లను తగలబెట్టటం.. ఎమ్మెల్యే సతీశ్ ఇంటిని వదలకుండా అగ్నికి ఆహుతి చేశారు. ఇంత వ్యతిరేకత ఎలా సాధ్యమైంది? అసలు ఇంతలా పరిస్థితులు చేజారి పోవటానికి కారణం ఏమిటి? అన్నది ప్రశ్న.

దీనికి సమాధానం వెతికితే.. ఆసక్తికర విషయాల్ని చెబుతున్నారు స్థానిక రిపోర్టర్లు. జిల్లా పేరును మార్చకూడదన్న దానిపై తీవ్రమైన భావోద్వేగంతో ఉన్న వారు.. తమకు సంఘీభావంగా అధికారపక్షం లేకపోవటం ఒక ఎత్తు అయితే.. పోలీసుల మితిమీరిన నియంత్రణ కూడా ఇలాంటి పరిస్థితులకు కారణంగా చెబుతున్నారు. మంగళవారం చలో కలెక్టరేట్ కు పిలుపునిస్తే.. సోమవార నుంచే ఆంక్షలు అమలు చేయటం.. అవసరం ఉన్నా లేకున్నా ఉరుకులు ఎత్తించిన కొందరి కారణంగా మిగిలిన వారిలో ఆగ్రహావేశాలు వ్యక్తమైనట్లు చెబుతున్నారు.

శాంతియుతంగా చలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న వైనాన్ని స్వాగతిస్తూ.. సంయమనంతో పోలీసులు వ్యవహరించి ఉంటే పరిస్థితి ఇంతలా అదుపు తప్పేది కాదన్న మాట వినిపిస్తోంది. మంగళవారం మధ్యాహ్నం వరకు పరిస్థితి బాగానే ఉండి.. సరిగ్గా మూడు గంటల నుంచి సీన్ మొత్తం మారిపోవటానికి కారణం.. అప్పటివరకు తీవ్రమైన ఒత్తిడితో అణగదొక్కేసే ప్రయత్నం చేయటం.. అది కాస్త.. బ్లోఅవుట్ గా మారిందన్న వాదనను వినిపిస్తున్నారు.

మంగళవారం ఉదయం నుంచి నిరసనకారుల మీదా.. ఆందోళనకారుల మీదా లాఠీలు ఝుళిపించకుంటే పరిస్థితి ఇంతవరకు వచ్చేది కాదంటున్నారు. పెద్ద ఎత్తున చేస్తున్న ఆందోళనను అధికారంతో అణగదొక్కే బదులు.. వారిని శాంతంగా ఉంచుతూ.. వారి డిమాండ్ల విషయంలో సానుకూలంగా ఉన్నామన్న సంకేతాల్ని పంపి ఉంటే ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదంటున్నారు.

దూసుకొస్తున్న ఆందోళనకారులను నియంత్రించేందుకు లాఠీల్ని పోలీసులు ఝుళిపిస్తే.. అందుకు ప్రతిగా ఆందోళనకారులు రాళ్లను రువ్వటం షురూ చేశారు. ఇక.. ఆందోళన కట్ట తెగింది ఎక్కడన్న విషయానికి వస్తే.. మధ్యామ్నం మూడు గంటల వేళలో ఆర్టీసీ బస్టాండ్ వైపు వేలాది మంది యువత ప్రదర్శనగా గడియార స్తంభం వద్దకు చేరుకోవటం.. వారిని పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. ఆందోళనకారుల్ని కంట్రోల్ చేయటానికి పోలీసులు లాఠీ చార్జి చేయటంతో ఆగ్రహావేశాలు పెరిగాయి. తమ న్యాయమైన డిమాండ్ విషయంలో సానుకూలంగా లేకున్నా ఫర్లేదు.. బలవంతంగా తమను అడ్డుకుంటున్నారన్న భావన ఆవేశాన్ని రగిలించి.. అదే పరిస్థితి మొత్తం అదుపు తప్పేలా.. వ్యవహారం చేయి దాటిపోయేలా చేసింది.