Begin typing your search above and press return to search.

ఏ మీడియాలోనూ రాని అమలాపురం గ్రౌండ్ రిపోర్టు

By:  Tupaki Desk   |   25 May 2022 5:57 AM GMT
ఏ మీడియాలోనూ రాని అమలాపురం గ్రౌండ్ రిపోర్టు
X
అవును.. ఇప్పుడు మీరు చదివేది.. ఏ ప్రధాన మీడియా హౌస్ పబ్లిష్ చేసే.. ప్రసారం చేసే వార్తల్లో లేని సమాచారం. ఎందుకంటే.. ఈ నిజాల్ని రాయటానికి వారికుండే పరిమితులకు లోబడి.. జరిగిందేమిటి? అన్నది ప్రపంచానికి చెప్పే పరిస్థితి లేదు.ఈ కారణంగానే విషయాలు తెలిసినప్పటికి తెలియని రీతిలో స్వీయ సెన్సారింగ్ చేశారని చెప్పాలి. రెండు తెలుగు రాష్ట్రాల చరిత్రల్ని చూస్తే.. ఆందోళనలు..నిరసనలు.. ఉద్యమాలు కొత్తవేం కావు. కానీ.. చాలా అరుదుగా మాత్రమే చోటు చేసుకునే అధికారపక్షనేతల ఇళ్లను తగలబెట్టే విపరీత పరిస్థితి ఎందుకు వచ్చింది? దానికి కారణం ఎవరు? అన్నది ప్రశ్న.

అమలాపురం అగ్గి పాపం విపక్ష తెలుగుదేశం.. జనసేన పార్టీలే అని అధికారపక్షం ఆరోపిస్తే.. విపక్షాలు ఆ ఆరోపణల్ని గంటల వ్యవధిలోనే తీవ్రంగా ఖండించటమే కాదు.. అధికార పక్షం చేతకానితనంతోనే ఇలా జరిగిందని మండిపడ్డాయి. అదే సమయంలో.. ప్రజలంతా స్వీయ నియంత్రణ పాటించాలని.. సంయమనంతో వ్యవహరించాలని.. ఆవేశాలకు గురి కావొద్దన్న హితవు పలికాయి.

ఇంతకూ అమలాపురంలో జిరగిందేమిటి? అన్న విషయంలోకి వెళితే.. నిరసనలు చేపట్టిన వారిలోనూ.. ఆందోళనలు చేసిన వారిలో అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన వారున్నారు. ఇప్పటివరకు ఎప్పుడూ లేని విధంగా.. కోనసీమ జిల్లా పేరును మార్చొద్దంటూ గళం విప్పిన వారిలో అన్ని పార్టీల వారు ఉన్నట్లు స్థానిక మీడియాకు చెందిన పలువురు చెబుతున్నారు.

''ఇక్కడ పార్టీలు లేవు సార్. అందరూ ఒక్కటై పోయారు. అందరికి కోనసీమ జిల్లా పేరు మారటం ఇష్టం లేదు.తమ ఉనికిని ప్రశ్నించేలా ప్రభుత్వం మార్చిందన్న భావనలో ఉన్నారు. అందుకే.. కులాలు.. రాజకీయ పార్టీల్నిపక్కన పెట్టేశారు. ఎవరు ఏ పార్టీ అయినా సరే.. కోనసీమ తప్పించి మరే పేరును ఒప్పుకోకూడదన్న ఏకాభిప్రాయానికి వచ్చారు. ఈ కారణంతోనే ఇంతటి రభస జరిగింది'' అంటూ ఒకరు వెల్లడించారు. ఇదే వాదనకు బలం చేకూరేలా ఇతర మీడియా సంస్థలకు చెందిన గ్రామీణ విలేకరులు వివరాల్ని అందించారు.

''సార్.. నిజంగానే పార్టీలు పథకం ప్రకారం ఇలాంటి విధ్వంసం చేసి ఉంటే..అవతల పార్టీల వారు ఊరుకుంటారా సార్. అందునా వారికి 'అధికారం' అండ ఉంటుంది. అలాంటప్పుడు తమ పార్టీకి చెందిన మంత్రి ఆస్తులను నిప్పు పెట్టే ధైర్యం ఏ రాజకీయ పార్టీకి ఉంటుంది చెప్పండి? అమలాపురంలో మంత్రి..ఎమ్మెల్యేల ఆస్తుల మీద దాడి జరిగినప్పుడు.. వారి అనుచర వర్గంతో పాటు.. సన్నిహితులు.. సానుభూతిపరులు సైతం బయటకు వస్తారు కదా. అలాంటిదేమీ జరగలేదంటే ఏమిటి అర్థం?'' అని ప్రశ్నిస్తున్నారు.

పార్టీలకు అతీతంగా అందరు ఒకటి కావటంతో ఇలాంటి అరుదైన పరిస్థితులు చోటు చేసుకున్నట్లు చెబుతున్నారు. ఈ కారణంతోనే.. పార్టీల రాష్ట్ర స్థాయి నాయకత్వాలు... ఒక స్థాయిలో ఉన్న వారు బయటకు వచ్చి రాజకీయ విమర్శలు చేస్తున్నారే కానీ.. స్థానిక నేతలు ఎవరూ పెదవి విప్పకపోవటానికి కారణం.. గ్రౌండ్ లో ఏం జరుగుతుందన్న అవగాహన ఉండటమేనని చెబుతున్నారు.