కోనసీమ రగడ.. సాధించేదేంటి? ప్రభుత్వం చేయాల్సిందేంటి..?

Thu May 26 2022 08:00:01 GMT+0530 (IST)

Amalapuram Violence Why Intel officials were caught napping

పచ్చని పంటలతో కళకళలాడే.. పర్యాటక ప్రాంతం కోనసీమ కల్లోలంగా మారింది. ఒక్కసారిగా చెలరేగిన వివాదం.. తారాజువ్వలా మారి.. ఇక్కడి రాజకీయాలను ఉడుకెత్తించింది. ఏకంగా మంత్రి ఎమ్మెల్యే ఇళ్లకు నిప్పు పెట్టే పరిస్థితి వచ్చింది. మరిదీనికి కారకులు ఎవరు.. ప్రభుత్వమేనని విపక్షాలు.. కాదు.. విపక్షాలేనని ప్రభుత్వం.. పరస్పర విమర్శలతో రోజులు గడిచిపోవడమే తప్ప.. సాధించింది ఏమైనా ఉందా ?  సాధించేది ఏమైనా ఉందా? అనే చర్చ జోరుగా సాగుతోంది.కోనసీమ జిల్లాల్లోని రాజోలు అమలాపురం వంటి రిజర్వ్‌డ్ నియోజకవర్గాలు.. కాకముందు.. ఇక్కడ కాపులు శెట్టిబలిజల వర్గ పోరు ఎక్కువగా ఉండేది. మెట్ల సత్యనారాయణ చిట్టిబాబు వంటివారు.. ఆధిపత్య రాజకీ యాలు చేశారు. తర్వాత.. 2009లో రిజర్వ్‌డ్ నియోజకవర్గాలుగా ప్రకటించిన తర్వాత.. ఇక్కడ ఎస్సీలకు టికెట్లు కేటాయిస్తున్నారు. అయినప్పటికీ.. తమదే ఆధిపత్యంగా సాగాలని.. కాపులు శెట్టి బలిజలు పట్టుబ  ట్టడంతోపాటు.. ఎవరికివారు ఆధిపత్య రాజకీయాలు చేసుకుంటున్నారు.

ముఖ్యంగా ఎస్సీలు కూడా.. తమ ఆధిపత్య ప్రదర్శన కోసం.. అనేక ఉద్యమాలు చేశారు. ఈ నేపథ్యంలో ఈ మూడు వర్గాల మధ్య రాజకీయాల్లో వైరం ఇప్పటికీ కొనసాగుతోంది. మధ్య మత్స్యకారులు కూడా జతకలిసా రు. ఈ పరిణామాలను రాజకీయ కోణం కన్నా.. తమకు వనరులు.. లేదా పదవుల విషయంలో జరుగుతున్న అన్యాయంగా చూడడం లేదనే వాదన గత కొన్నాళ్లుగా వినిపించింది. ఇదే విషయాన్ని ఇటీవల  సీఎం జగన్ ఇక్కడ పర్యటించినప్పుడు ఎస్సీలు మత్స్య కారులు వెల్లడించారు.

తమకు ఎలాంటి ప్రాధాన్యం లేదనితెలిపారు. అదే సమయంలో  ఉన్న ఒకరిద్దరు నాయకులు కూడా.. అగ్రవర్ణాల నాయకులకు అనుకూలంగా మారిపోయారంటూ.. గతంలో జరిగిన విషయాలను కూడా వివరించారు. ఈ పరిణామాల నేపథ్యంలోనే అప్పటి వరకు వదిలేసిన.. అంబేడ్కర్ పేరును కోనసీమకు జోడించారు. ఇది.. సహజంగానే అగ్రవర్ణ రాజకీయ నేతలకు ఆగ్రహం తెప్పించిందనేది వాస్తవం. అందుకే ఇలా వివాదంతెరమీదకి వచ్చిందని అంటున్నారు విశ్లేషకులు.

మరి ఈ సమస్యకు పరిష్కారం లేదా? అంటే.. ఉంది. కేవలం ప్రభుత్వం నాయకులు.. ఇక్కడి ప్రజలతో చర్చించడం.. వారి భావోద్వేగాలను చల్లార్చడం మినహా.. అంతకుమించిన మార్గం లేదని అంటున్నారు. మరి ఆ దిశగా నాయకులు.. ప్రబుత్వం చర్యలు తీసుకుంటుందా?  లేదా..?  కేవలం రాజకీయ కోణంలోనే చూస్తారా? అనేది తేలాల్సి ఉంది.