రాజోలు లో జనసేన నేతలు వైసీపీలోకి!

Wed Oct 16 2019 20:00:01 GMT+0530 (IST)

ఏపీ లో అసెంబ్లీ  లోక్ సభ సార్వత్రిక ఎన్నికల్లో జనసేనకు పరువు నిలిచిన ఏకైక నియోజకవర్గం రాజోలు. ఆ రిజర్వ్డ్ నియోజకవర్గంలో జనసేన విజయం సాధించింది. రాష్ట్రంలో ఎక్కడా గెలవలేకపోయిన జనసేన రాజోలులో మాత్రం విజయం సాధించింది. ఆఖరికి ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్  రెండు చోట్ల పోటీ చేసి - రెండు చోట్లా ఓడిపోయారు. అయితే రాజోలులో మాత్రమే జనసేన నెగ్గింది.రాష్ట్రమంతా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సునామీ లాంటి విజయాన్ని సాధించింది. తెలుగుదేశం పార్టీని చిత్తు చేస్తూ జనసేనను ఊసులో లేకుండా చేస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. ఇక జనసేన తరఫున రాజోలులో నెగ్గిన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ ఆ పార్టీలోనే కొనసాగుతూ ఉన్నారు. అప్పుడప్పుడు పార్టీ మీటింగుల్లో ఆయన పాల్గొంటూ ఉన్నారు. ఆయన జనసేనను వీడతారనే ప్రచారమూ ఉంది. అయితే దాన్ని ఆయన ఖండిస్తూ ఉన్నారు. అయితే అసెంబ్లీలో జగన్ పాలనను ఆయన నిర్మొహమాటంగా ప్రశంసించారు.

ఇక రాపాకకు జనసేనలో అవమానాలు ఎదురవుతున్నాయనే ప్రచారమూ ఉంది. ఆ సంగతలా ఉంటే.. ఇప్పుడు రాజోలు నియోజకవర్గంలో వైఎస్సార్  కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు చోటు చేసుకున్నాయి. ఆ పార్టీలోకి రాజోలు మాజీ ఎమ్మెల్యే అల్లూరి కృష్ణం రాజు చేరారు.

అలాగే ఎన్నికల సమయంలో జనసేన కోసం పని చేసిన నేతలు కూడా ఇప్పుడు అక్కడ వైసీపీ తరఫున చూస్తున్నారు. అందులో భాగంగా కేఎస్ ఎన్ రాజు అనే జనసేన నేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. తాము ఎన్నికల సమయంలో జనసేన కోసం  పని చేసినట్టుగా ప్రభుత్వ పథకాలను చూసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి చేరుతున్నట్టుగా ఆయన ప్రకటించారు. రాజోలులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగరేస్తామంటూ ఆయన ప్రకటించుకున్నారు!