ఆళ్ళగడ్డ ఫైట్ : గంగుల ఫ్యామిలీతో అఖిలప్రియ ఢీ

Mon Sep 26 2022 20:00:02 GMT+0530 (India Standard Time)

Allagadda fight: Akhilapriya's fight with Gangula's family

కర్నూల్ జిల్లాలో ప్రముఖ కుటుంబం అయిన భూమా నాగిరెడ్డి శోభా నాగిరెడ్డి రాజకీయ వారసురాలు అఖిలప్రియ తన సొంత గడ్డ ఆళ్ల గడ్డనే మళ్ళీ నమ్ముకోవాలనుకుంటున్నారు. తండ్రి కాలం నుంచి కూడా అచ్చి వచ్చిన ఈ సీటు నుంచే 2024 ఎన్నికల్లో పోటీకి దిగుతాను అని ఆమె తన అనుచరులకు చెప్పేశారుట. అయిత నంద్యాలలో పార్టీ ఆఫీస్ తెరవడం అన్నది ఒక రకమైన రాజకీయ ఎత్తుగడగానే చెబుతున్నారు.ఇదిలా ఉంటే ఆళ్ళగడ్డలో 2019 ఎన్నికల్లో పోటీ చేసిన ఆమెను వైసీపీ తరఫున బరిలోకి దిగిన గంగుల ఫ్యామిలీకి చెందిన బిజేంద్రనాథ్ రెడ్డి 35613 భారీ మెజారిటీతో ఓడించారు. ఇక ఆళ్ళగడ్డలో గంగుల ఫ్యామిలీకి గట్టి పట్టు ఉంది. గంగుల ప్రతాపరెడ్డి 2004లో ఆయన కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్యేగా గెలిచారు. 1967 నుంచే గంగుల కుటుంబం ఆళ్ళగడ్డను అడ్డాగా మార్చుకుంది. 1867లో గంగుల తిమ్మారెడ్డి ఇండిపెండెంట్ గాగెలిచారు. అలాగే 1978లో ఆయన మరోసారి గెలిచారు.

ఇపుడు వారి వారసుడిగా గంగుల బిజేంద్రనాథ్ రెడ్డి దూసుకుపోతున్నారు. చిత్రమేంటి అంటే భూమా నాగిరెడ్డిని కూడా 2004లో గంగుల ఫ్యామిలీ ఓడించింది. 2019లో అఖిలప్రియను ఓడించింది. అదే ఫ్యామిలీ చేతిలో రెండు సార్లు ఓటమి పాలు కూడా అయింది. ఇపుడు ఈ రెండు కుటుంబాల మధ్యనే మరోసారి పోటీకి తెర లేస్తోంది. ఈసారి ఆళ్లగడ్డ నుంచి జెండా పాతాలని అఖిలప్రియ పంతం మీద ఉన్నారు.

ఆమె తనకు దూరమైన బంధువర్గాన్ని కూడా దగ్గర చేసుకుంటున్నారు. భూమా ఫ్యామిలీకే ఆళ్ళగడ్డ సీటు ఉండాలని ఆమె సెంటిమెంట్ రాజేస్తున్నారుట. దాంతో ఇతర పార్టీలలో ఉన్న భూమా ఫ్యామిలీ మెంబర్స్ ని అలాగే సొంత పార్టీలో ఉన్న వారిని ఆమె ఈ విధంగా బుజ్జగిస్తూ భూమా ఫ్యామిలీ గురించి చెబుతూ తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ఆళ్ళగడ్డలో టీడీపీని పటిష్టం చేస్తే టికెట్ ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు కాబట్టి అఖిలప్రీయ సీరియస్ గానే ఆ దిశగా అడుగులు వేస్తున్నారు అని అంటున్నారు.

మరో వైపు గంగుల ఫ్యామిలీ కూడా తక్కువ ఏమీ తినలేదు వైసీపీలో చేరి గెలిచిన గంగుల బిజేంద్రనాథ్ రెడ్డి ఈసారి కూడా తనదే గెలుపు అంటున్నారు. దశాబ్దాలుగా భూమా గంగుల ఫ్యామిలీల మధ్య రాజకీయ వైరం ఉంది. రాష్ట్రంలో చూస్తే టీడీపీ వైసీపీల మధ్య భీకరమైన పోరు ఉంది. దాంతో ఆళ్ళగడ్డలో ఈసారి పోటీ మామూలుగా ఉండదని అంటున్నారు. మరి అఖిలప్రియ ఈసారి అయినా గెలుస్తుందా అన్నది చూడాలి.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.