లిక్కర్.. శాండ్ పాలసీల్లో ఏపీ ప్రభుత్వం డిజాస్టర్.. ఎంత ఘోరంగా ఫెయిల్ అంటే?

Fri Sep 24 2021 06:00:01 GMT+0530 (IST)

All the sand money is going to Jagan

ఏపీ ప్రభుత్వం లిక్కర్.. శాండ్ పాలసీల్లో డిజాస్టర్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు ఉండవల్లి. అంతేకాదు.. ఏపీలో అనుసరిస్తున్న ఇసుక విధానం దారుణమైన పరిస్థితి ఉందని.. ప్రభుత్వం నిర్ణయించిన ధర కంటే కూడా మూడు వందల రెట్లు అధికంగా వసూలు చేస్తున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు మాజీ ఎంపీ ఉండవల్లి. మరి.. ఆ డబ్బులు ఎక్కడికి వెళుతున్నాయంటే పైకి వెళుతున్నాయన్న ఆయన.. ‘పైకి’ అంటే అన్న ప్రశ్నకు.. ‘జగన్’ అంటూ షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. అంతటి తీవ్ర ఆరోపణ ఎలా చేశారు? ఎందుకు ఆయన నోటి నుంచి అలాంటి మాటలు వచ్చాయన్నది ఉండవల్లి మాటల్లోనే చూస్తే..‘‘క్వార్టర్ మందు బాటిల్ రూ.12.5 పడుతుంది. దాన్ని షాపు వాడికి ఆ రేటుకు ఇస్తే దాన్ని వాడు.. రూ.270లకు అమ్ముతున్నాడు. టీడీపీ ప్రభుత్వంలో రూ.50-70 మధ్యలో అమ్మేవారు. జగన్ ప్రభుత్వం ఏం చెబుతుందంటే.. ఎక్కువ ధరలు పెడితే తక్కువ మంది కొంటారని. దాంతో తాగే వారు మానేస్తారంటూ చెబుతున్నారు. వాళ్ల పేపర్లో కూడా 40 శాతం సేల్ తగ్గిపోయిందంటూ రాశారు. కానీ.. అమ్మకాలు తగ్గిపోలేదు.. పక్క రాష్ట్రాల నుంచి స్మగ్లింగ్ .. నాటు సారా వచ్చేసింది. అందుకే అమ్మకాలు తగ్గాయి’’ అని చెప్పారు.

లిక్కర్ పాలసీలో జగన్ సర్కారు డిజాస్టర్ అని.. ఇసుక అది మరింత దారుణంగా అభివర్ణించారు. తానున్న రాజమండ్రిలో ట్రక్కు ఇసుక రూ.18వేలు నడుస్తుందన్న ఆయన.. ప్రభుత్వం నిర్ణయించిన ధరకు 300 రెట్లు అధిక ధరకు అమ్ముతున్నారు. చంద్రబాబు హయాంలో ఇసుక విషయంలో టీడీపీ ఎంపీలు.. ఎమ్మెల్యేలు.. లీడర్లు తినేస్తున్నారని.. వారికి వాటా ఉంది.. వీరికి వాటా ఉందని అనే వాళ్లని.. ఇప్పుడుఅలాంటిదేమీ లేదన్నారు. అంతా పైకే వెళుతుందన్న ఉండవల్లి మాటల్లోనే చూస్తే..

‘‘రాజమండ్రిలో రూ.18వేలు ఇసుక. వాళ్లు ప్రింట్ చేసిన రేట్లను 300 రెట్లు అధికంగా అమ్ముతున్నారు. పూర్వం తెలుగు దేశం వాళ్లు తినేస్తున్నారు.. వాళ్లు తినేస్తున్నారని అనేవాళ్లు. ఎంపీకి వాటా ఉంది.. ఎమ్మెల్యేకు వాటా ఉందనుకునే వాళ్లం. ఇప్పుడు ఎవరికి వాటా లేదు. ఎవరు తినేస్తున్నారు? డైరెక్టుగా పైకి వెళ్లిపోతోంది. జగన్ కు వెళ్లిపోతోంది. మీ ప్రభుత్వం రూ.5వేలకు అమ్మాలని చెబుతుంది. రూ.10వేలకు అమ్ముతున్నారు. గతంలో ఎమ్మెల్యే.. ఎంపీ అనే వారు. వాళ్లు కూడా అదే రేటుకు తెప్పించుకోవాల్సి వస్తోంది. పాట పాడినోళ్లకు ఇస్తున్నారు. వాడి సంగతి చూస్తే.. వాడికి వెళ్లటం లేదు. వాడు ఎవరికైతే ఇవ్వాలో వారికి ఇచ్చేయాలంటున్నాడు. మా దగ్గర ఏమీ ఉండదని అంటున్నాడు’’ అని చెప్పారు.

ఇసుక చాలా కీలకమని.. దానితోనే పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు ఉంటాయన్నారు ఉండవల్లి. ‘‘ఇసుక అనేది లేకపోతే.. రాజమండ్రిలో యాభై శాతం మంది జాబ్ లేకుండా పోతారు. ఇసుక ఉంటేనే నిర్మాణం. నిర్మాణం ఉంటేనే ఎలక్ట్రిషీయన్.. ప్లంబర్.. కార్పెంటర్.. పెయింటర్.. అందరి జీవితాలు ఆధారపడి ఉండేది రియల్ ఎస్టేట్ మీద. ఇసుక ధర సిమెంటు ధరకు దగ్గర అవుతోంది. దీని రేటును తగ్గించటం చాలా సింఫుల్. ఎందుకు అరికట్టలేకపోతున్నారు. అవినీతి ప్రభుత్వం అనుకుంటున్నారందరూ’’ అంటూ ఘాటు ఆరోపణలు చేశారు.